logo

కాపు భవన్‌ శిలాఫలకం ధ్వంసం

అడవి తక్కెళ్లపాడు సమీపంలో కాపు భవన్‌ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కాపు భవన్‌కు కేటాయించిన 50 సెంట్ల స్థలంలో ఆక్రమణదారులు హద్దురాళ్లు పాతారు.

Published : 24 Jun 2024 04:51 IST

కేటాయించిన స్థలంలో హద్దు రాళ్లు పాతిన దుండగులు

ముక్కలైన శిలాఫలకం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అడవి తక్కెళ్లపాడు సమీపంలో కాపు భవన్‌ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కాపు భవన్‌కు కేటాయించిన 50 సెంట్ల స్థలంలో ఆక్రమణదారులు హద్దురాళ్లు పాతారు. తామంతా ఎన్నికల హడావుడిలో ఉండగా ఆక్రమణదారులు ఈ పనికి పాల్పడి ఉండొచ్చని తెదేపా కాపు నాయకులు అనుమానిస్తున్నారు. కాపు భవన్‌ నిర్మాణం కోసం 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం అడవి తక్కెళ్లపాడు సమీపంలో స్థలం కేటాయించింది. కాపు భవన్‌ నిర్మాణం కోసం రూ.2 కోట్లు మంజూరు చేసింది. అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి 2018, డిసెంబర్‌ 27న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దాని నిర్మాణం అటకెక్కింది. తెదేపా కాపు నాయకులు కాపు భవన్‌కు కేటాయించిన స్థలం అన్యాక్రాంతం అవుతుందేమోనన్న ఆందోళనతో నెల రోజులకోసారి అక్కడకు వెళ్లి పరిశీలించి వచ్చేవారు. గత రెండు, మూడు నెలలుగా ఎన్నికల హడావుడి ఉండడంతో పరిశీలించేందుకు కుదరలేదు. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి కేటాయించిన స్థలంలో హద్దు రాళ్లు పాతారు. ప్రభుత్వం మారడంతో కాపు భవన్‌ నిర్మాణం చేపట్టాలని కోరేందుకు తెదేపా కాపు నాయకులు మేళం సైదయ్య అక్కడకు వెళ్లి పరిశీలించగా పరిస్థితి చూసి అవాక్కయ్యారు. శిలాఫలకం ధ్వంసమై ఉండటం, హద్దు రాళ్లు పాతి ఉండటం గమనించారు. ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై నల్లపాడు ఠాణాలో ఫిర్యాదు చేస్తామన్నారు. ఆ ఠాణాకు కూతవేటు దూరంలో దుండగులు ఈ విధంగా బరి తెగిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి ఈ దుశ్చర్యకు పాల్పడింది ఎవరో నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు.

కేటాయించిన స్థలంలో వేసిన హద్దు రాళ్లు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని