logo

ఆవేశం.. కత్తి దూసింది

నిత్యం వ్యాపారులు, ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడంతో ఒక్కసారిగా వ్యాపారులు, పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల నడిబొడ్డులో ఆదివారం చోటు చేసుకుంది.

Published : 24 Jun 2024 04:53 IST

చీరాలలో పట్టపగలు యువకుడి హత్య 

సంతోష్‌(పాత చిత్రం)

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: నిత్యం వ్యాపారులు, ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడంతో ఒక్కసారిగా వ్యాపారులు, పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల నడిబొడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సంఘం థియేటరు సమీపంలో కంచర్ల సంతోష్‌ (33) కర్రీస్‌ పాయింట్‌ పెట్టుకుని జీవిస్తున్నాడు. నిత్యం దుకాణం తెరిచే పనిలో భాగంగా ఉదయం 11 గంటల సమయంలో షాపు తీశాడు. దీనికి ఎదురుగా ఏసురాజు (ఉరఫ్‌ చిన్నా) అనే వ్యక్తి అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇతని వద్ద పనిచేసే ఉమామహేశ్వరరావు తన వద్ద ఉన్న నీటిని రోడ్డుపై విసురుగా పోయడంతో అవి కూరలు విక్రయించే దుకాణం వరకు వెళ్లాయి. ఈ విషయమై సంతోష్, ఉమామహేశ్వరరావు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో పండ్ల దుకాణం యజమాని చిన్నా అక్కడకు వచ్చి విషయంపై ఆరాతీస్తున్నాడు. ఈక్రమంలో ఏం చేసుకుంటావో చేసుకో అని ఉమామహేశ్వరరావు అనడంతో అయితే రా... పోలీసుస్టేషన్‌కి వెళదామని సంతోష్‌ తల్లి అనగా, వెంటనే అతడు కత్తి తీసుకొచ్చి పక్కనే ఉన్న సంతోష్‌ ఛాతి పైభాగంలో ఒకసారి, పొట్ట దిగువ భాగంలో రెండుసార్లు పొడవడంతో తీవ్ర గాయమైంది. వెంటనే బాధితుడు తల్లితో పాటు విషయాన్ని ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడానికి హడావిడిగా చేరుకున్నాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావమైన సంతోష్‌ స్టేషన్‌ ముందే సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసులు అతడ్ని చీరాల వైద్యశాలకు చేర్చి, చికిత్స చేసేలోపు మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. 


ఉలిక్కిపడ్డ వ్యాపారులు, ప్రజలు

ఘటన జరిగిన ప్రాంతంలో అనేక మంది తమ బండ్లపై చిరు వ్యాపారాలు చేస్తుంటారు. మరోవైపు ప్రజలు నిత్యం అదే దారిన రాకపోకలు సాగిస్తుంటారు. పక్కనే టీ దుకాణం ఉంది. అక్కడికి తేనీరు ప్రియులు వస్తుంటారు. నిత్యం ఈప్రాంతం రద్దీగా ఉంటోంది. ఆదివారం కావడంతో జనసంచారం తక్కువగానే ఉంది. ఇద్దరి మధ్య వాగ్వాదం, అంతలోనే కత్తితో పొడవడంతో బాధితుడు, అతని తల్లి అరుచుకుంటూ పోలీసు స్టేషన్‌కి వెళ్లడం క్షణాల మీద జరిగిపోయింది. అసలు ఏం జరిగిందని ఆరా తీసేలోపు సంతోష్‌ మృతిచెందాడనే విషయం పట్టణంలో దావానంలా వ్యాపించడం ఇటు వ్యాపారులు, అక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని