logo

చీరాల పోలీసులు ఏం చేస్తున్నట్లు?

జిల్లాలో అతి పెద్ద పట్టణం.. చిన్న ముంబయిగా ప్రసిద్ధిగాంచిన చీరాలలో శాంతిభద్రతలు లోపించాయి. పట్టపగలే హత్యలకు తెగబడుతున్నా పోలీసులకు పట్టడం లేదు.

Published : 24 Jun 2024 04:58 IST

రెండు రోజుల వ్యవధిలో రెండు హత్యలు
మెరుగుపడని శాంతిభద్రతలు.. గస్తీల ఊసేలేదు
క్షేత్రస్థాయిలో పర్యటించని స్టేషన్‌ బాస్‌లు
తాజా పరిణామాలపై ఐజీ సీరియస్‌

ఈనాడు-బాపట్ల: జిల్లాలో అతి పెద్ద పట్టణం.. చిన్న ముంబయిగా ప్రసిద్ధిగాంచిన చీరాలలో శాంతిభద్రతలు లోపించాయి. పట్టపగలే హత్యలకు తెగబడుతున్నా పోలీసులకు పట్టడం లేదు. నేరగాళ్ల పాలిట సింహస్వప్నంలా మారాల్సిన పోలీసులు మాముళ్ల మత్తులో చేష్టలుడిగి కూర్చొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా నేరగాళ్లు జూలు విదుల్చుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో స్థానికంగా జరిగిన రెండు హత్యలే అందుకు నిదర్శనం. మొత్తంగా చీరాల సబ్‌డివిజన్‌లో పోలీసు యంత్రాంగం నేరగాళ్ల ఆటకట్టించలేకపోతోంది. ఏ మాత్రం భయం ఉన్నా ఇంతగా హత్యలకు తెగబడరనేది గుర్తెరగాలి. ఆదివారం చీరాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో కర్రీస్‌ పాయింట్‌ నిర్వాహకుడు సంతోష్‌ను అరటి పండ్ల దుకాణానికి చెందిన వ్యక్తి తొలుత దాడిచేసి ఆ తర్వాత కత్తితో పొడిచి హతమార్చడంతో పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. అంతకు ముందు చీరాల రూరల్‌ స్టేషన్‌ పరిధిలో ఈపూరిపాలెంలో ఓ యువతిని ఇద్దరు పాత నేరస్థులు అత్యాచారం చేసి ఆపై దారుణంగా కొట్టి హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. అయినా ఇక్కడ పోలీసులు మాత్రం విధి నిర్వహణను తేలిగ్గా తీసుకున్నారు. బహిర్భూమికి వెళ్లిన యువతిని గంజాయి బ్యాచ్‌ లాక్కెళ్లి అత్యాచారం చేసి చంపేసిన ఘటనతోనే పోలీసుల ఉనికి ప్రశ్నార్థకమైంది. నేరగాళ్లకే కాదు ఎవరికైనా పోలీసుల భయం అనేది ఉంటే ఇలా ఒక దాని వెంబడి ఒకటి వెంటనే హత్యలు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఉండదనడంలో సందేహం లేదు.

ఐదేళ్లు వైకాపా నేతల సేవలో..

గత వైకాపా పాలనలో పోలీసు పోస్టింగుల్లో మితిమీరిన రాజకీయ జోక్యం ఉండటం, నేతలు చెప్పినవారికే సీఐ, ఎస్సై పోస్టింగ్‌లు వేయటంతో ఆయా పోస్టుల్లోకి వచ్చిన అధికారులు తొలుత ఆ నేత చెప్పినట్లు కేసులు కట్టడం, వారి సేవలో తరించడానికే పరిమితమై శాంతిభద్రతలను గాలికొదిలేశారనే విమర్శలను మూటగట్టుకున్నారు. దీంతో పోలీసులకు నేరగాళ్లు, అసాంఘిక శక్తుల కదలికలు వారి వ్యాపకాలపై పట్టు లేకుండా పోయింది. సీఐలు మొదలుకుని హోంగార్డుల వరకు ప్రతిఒక్కరూ ఈ ఐదేళ్లు వైకాపా ప్రజాప్రతినిధులు, ఆపార్టీ ముఖ్య నేతల సేవలోనే తరించారనే ఆరోపణలు పోలీసులపై ఉన్నాయి. మొత్తంగా తాజాగా జరిగిన హత్యలు పోలీసులకు సవాళ్లు విసిరాయి. పట్టణంలో వన్‌టౌన్, టూటౌన్‌తో పాటు రూరల్‌ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. డీఎస్పీ, సీఐ, ఎస్సైలు వారి కింద పెద్దసంఖ్యలో సిబ్బంది అనేకమంది ఉన్నా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలంటే భయపడిపోయేలా పోలీసు వ్యవస్థను కింది నుంచి సంస్కరించాల్సిన తక్షణ ఆవశ్యకత కొత్త ప్రభుత్వంపై ఉంది. 

పాతుకుపోయిన సిబ్బంది 

చీరాల పట్టణంలో ట్రాఫిక్‌ చాలా అస్తవ్యస్తంగా తయారైంది. తమ షాపుల ముంగిటే కాదు ఏకంగా పోలీసు స్టేషన్‌ ముందే కొందరు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్‌ చేసి వెళ్లిపోతారు. ఇవేం పోలీసులకు పట్టవు. ఎంతసేపటికి ఖద్దరు నేతలతో కాలక్షేపం చేస్తూ వారు తీసుకొచ్చే సివిల్‌ వివాదాలు పరిష్కరిస్తూ కాలం గడిపేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదనే ఆరోపణలు పోలీసులపై ఉన్నాయి. రెండు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ రెండు హత్యలపై ప్రభుత్వం, ఐజీ, ఇతర ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. దీనికి అధికారులను బాధ్యులను చేయాలనే యోచనలో ఐజీ త్రిపాఠి ఉన్నారు. ఆమేరకు లోపం ఎవరిది అనే విషయమై సమాచారం తెప్పించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికైనా నిస్తేజంగా మారిన చీరాల పోలీసుల్లో మార్పు వచ్చేలా ఏం చర్యలకు ఉపక్రమిస్తారోనన్న ఉత్కంఠ పోలీసు వర్గాల్లో నెలకొంది. 

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొండయ్య 


పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే..

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ రోజున జిల్లాలో అత్యధిక ఘటనలు చీరాల నియోజకవర్గంలోనే జరిగాయి. చీరాల మండలం గవినివారిపాలెంలో ప్రస్తుత ఎమ్మెల్యే కొండయ్య వాహనంపై దాడి చేశారు. అప్పట్లో దాడి చేసింది కూడా రౌడీషీటరే. మొత్తంగా పోలీసుల కనుసన్నల్లో చీరాలలో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేం కావాలో గుర్తెరగాలి. ఆదివారం జరిగిన హత్య కూడా పోలీసు స్టేషన్‌కు సమీపంగానే చోటుచేసుకుంది. హత్యకు పాల్పడిన వ్యక్తికి ఏ మాత్రం పోలీసుల భయం ఉన్నా ఇలా వ్యవహరించేవారు కాదని అంటున్నారు. మార్కెట్లో కొందరు రౌడీలు తిష్ఠవేశారనే ఆరోపణలున్నాయి. అయినా వారిని పిలిచి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చిన పాపాన పోలేదని కొందరు వ్యాపారులు పేర్కొన్నారు. పచ్చి సరకు అమ్ముకునే వారిలో కొందరు చాలా దుందుడుకుగా వ్యవహరిస్తూ నెలవారీ అద్దెలు చెల్లిస్తూ పక్కాగా వ్యాపారం నిర్వహించే వారి షాపుల ముందు బండ్లు నిలిపి వర్తకం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. పోలీసులు పట్టించుకోరని, వారి నుంచి నెలవారీ మాముళ్లు తీసుకుని తిరిగి తమపైకి వారిని రెచ్చగొట్టడం కొందరు పోలీసులకు పరిపాటిగా మారందని సత్రం ప్రాంతానికి చెందిన వ్యాపారి ఒకరు గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని