logo

మత్తులోనే అఘాయిత్యాలు..

2022 మే నెలలో రేపల్లె రైల్వేస్టేషన్లో  గర్భిణిపై అర్ధరాత్రి గంజాయి మత్తులో దుండగులు సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు. భర్తను కొట్టి రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫాంపై దళిత మహిళను మానభంగం చేశారు. నిందితులు గంజాయి సేవిస్తూ దారి తప్పిన యువకులు కావడం గమనార్హం. 

Published : 24 Jun 2024 05:05 IST

తీర  ప్రాంతంలో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు
అత్యాచారాలు.. హత్యలకు తెగబడుతున్న ముఠాలు
బాపట్ల, చీరాల అర్బన్, న్యూస్‌టుడే

  • 2022 మే నెలలో రేపల్లె రైల్వేస్టేషన్లో  గర్భిణిపై అర్ధరాత్రి గంజాయి మత్తులో దుండగులు సామూహిక అత్యాచారానికి  పాల్పడ్డారు. భర్తను కొట్టి రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫాంపై దళిత మహిళను మానభంగం చేశారు. నిందితులు గంజాయి సేవిస్తూ దారి తప్పిన యువకులు కావడం గమనార్హం. 

  • గత ఫిబ్రవరి నెలలో జిల్లా కేంద్రం  బాపట్ల పట్టణంలో యువకుల  మధ్య గ్యాంగ్‌వార్‌ చోటుచేసుకుని గోరంట్ల సుమంత్‌ అనే యువకుడిని కత్తులతో  పొడిచి దారుణంగా హత్య చేశారు. గంజాయి మత్తులో హత్య చేసినట్లు  పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

  • తాజాగా చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు మానభంగం చేసి దారుణంగా హత్య చేశారు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. గంజాయి సేవించే పాత నేరస్థులు ఇద్దరిని వారికి సహకరించిన  మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.

గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డ కంటెయినర్‌ వాహనం 

బాపట్ల, చీరాల కేంద్రంగా గంజాయి వ్యాపారం పెద్దఎత్తున సాగుతోంది. మన్యం నుంచి గుట్టుచప్పుడు కాకుండా కొందరు వాహనాల్లో గంజాయిని జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో బాపట్ల జిల్లా గంజాయి విక్రయాలకు అడ్డాగా మారింది. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. కొందరు యువత గంజాయి మత్తుకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నేరాలకు పాల్పడుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. వైకాపా నేతలు విద్యాసంస్థల పరిసరాల్లో తమ వర్గీయులతో గంజాయి విక్రయాలు సాగించారు. జిల్లా పరిధిలోని 216 ఏ, 16వ నంబరు జాతీయ రహదారులపై భారీగా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. గత మార్చి 7న రాజమహేంద్రవరం నుంచి చెన్నైకు అక్రమంగా కంటెయినర్‌లో భారీగా తరలిస్తున్న 457 కేజీల గంజాయి బాపట్ల పట్టణ శివారున బైపాస్‌ రోడ్డులో సూర్యలంక పైవంతెన వద్ద పట్టుబడటం సంచలనం సృష్టించింది.

సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలు


పర్యాటకులకు విక్రయాలు

ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంకకు తెలంగాణా రాజధాని హైదరాబాద్, ఇతర దూర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. గంజాయి ముఠాలు సూర్యలంకను అడ్డాగా చేసుకుని విక్రయాలు చేస్తున్నారు. జిల్లా ఆవిర్భావం ఆరంభంలోనే సూర్యలంకలోని ఓ దుకాణంలో కేజీల కొద్దీ గంజాయి దొరికినా విషయం బయటకు వస్తే చెడ్డపేరు వస్తుందని వెలుగులోకి రానివ్వలేదు. జమ్ములపాలేనికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంపై గంజాయిని సూర్యలంకకు తీసుకువస్తూ దొరికిపోయారు. చినగంజాం మండలంలో అధికార పార్టీ నేతకు చెందిన ఇంటిలో భారీగా గంజాయి పట్టుబడింది. సదరు నేతను కేసు నుంచి తప్పించాలని వైకాపా ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. మీడియా ద్వారా సమాచారం బహిర్గతం కావడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. చీరాల, వేటపాలెం మండలాల్లోని తీర ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది. ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్య పర్యాటకులు వస్తున్నారు. మన్యం నుంచి గంజాయి తెప్పించి జోరుగా విక్రయిస్తున్నారు. బాపట్ల పట్టణంలో మార్కెట్ ప్రాంతం, రైలుపేటలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేస్తున్నారు.


ఇటీవల పట్టుబడ్డారు ఇలా..

మన్యం నుంచి లారీలు, ఇతర వాహనాల్లో వందల కేజీ కొద్దీ గంజాయిని ఎన్‌హెచ్‌-16లో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తూ జిల్లాలోని బొల్లాపల్లి ట్లోల్‌ప్లాజా వద్ద ముఠాలు పట్టుబడ్డాయి. బాపట్ల పట్టణ శివారున 216ఏ జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డులో సూర్యలంక కింది వంతెన వద్ద పైలట్ వాహనంతో వెళ్తున్న కంటెయినర్‌ లారీని సెబ్‌ అధికారులు గత మార్చి 7న తెల్లవారుజామున ఆపి తనిఖీ చేయగా వాహనం లోపల 457 కేజీల గంజాయి బస్తాలను చూసి విస్తుపోయారు. గంజాయి రవాణా చేస్తున్న మినీ కంటెయినర్‌ లారీ, పైలట్ వాహనంగా వచ్చిన కారును స్వాధీనం చేసుకున్నారు. కంటెయినర్‌ వాహనంలో ఎవరికీ అనుమానం రాకుండా పుష్ప సినిమా తరహాలో పాత ఫర్నీచర్‌ ఉంచి ముందు భాగాన్ని కొంత మూసివేశారు. లారీ లోపల తనిఖీ చేసినా బయటకు కనిపించకుండా అందులో 17 బస్తాల గంజాయిని ఉంచారు. రాజమహేంద్రవరం నుంచి 216 ఏ జాతీయ రహదారిలో పెనుమూడి వారధి నుంచి రేపల్లె, బాపట్ల, ఒంగోలు మీదుగా చెన్నైకు కంటెయినర్‌లో గంజాయి తరలిస్తూ పట్టుబడింది. 


నాడు వైకాపా నేతలను తప్పించేశారు..

గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిఘా వర్గాలు, బయట వ్యక్తుల ద్వారా పోలీసు ఉన్నతాధికారికి గంజాయి  ఉన్న సమాచారం తెలిసింది. పడమర బాపట్ల పరిధిలోని మెరుపుదాడి చేయడానికి స్థానిక పోలీసు అధికారులను పంపించారు. అయితే ముందుగా ఈ సమాచారం వైకాపా నేతకు లీకు చేశారు. వెంటనే అప్రమత్తమై గంజాయిని బయటకు తరలించి పట్టుబడకుండా తప్పించుకున్నారు. సదరు పోలీసు అధికారులపై పోలీసు ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత బడా నేతల ద్వారా ఆ ఉన్నతాధికారిపైన తీవ్ర ఒత్తిడి తెచ్చారు. హోంమంత్రి అనిత ప్రకటించిన విధంగా నార్కోటిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేసి విస్త్రృతంగా దాడులు నిర్వహించి విక్రయదారులు, వారి వెనక ఉన్న నేతలను ఉక్కుపాదంతో అణిచి వేసి జిల్లా నుంచి గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని