logo

నిధుల కేటాయింపులో గత పాలకుల నిర్లక్ష్యం

గడిచిన ఐదేళ్లగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులకు వైకాపా ప్రభుత్వం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించడంతోపాటు కనీసం పట్టించుకోకపోవడంతో సమస్యలు

Published : 24 Jun 2024 05:07 IST

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని
జీఎంసీలో అభివృద్ధి పనులపై సమీక్ష 

యూజీడీ పనుల మ్యాప్‌ పరిశీలిస్తున్న మంత్రి చంద్రశేఖర్, కమిషనర్‌ కీర్తి, ఎమ్మెల్యేలు నసీర్, మాధవి, రామాంజనేయులు 

నగరపాలక సంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: గడిచిన ఐదేళ్లగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులకు వైకాపా ప్రభుత్వం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించడంతోపాటు కనీసం పట్టించుకోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో ఆదివారం జీఎంసీలో తాగునీటి సరఫరా తీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, ఇతర పెండింగ్‌ అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. విభాగాల వారీగా పనుల పురోగతి, ప్రస్తుత పరిస్థితి గురించి జీఎంసీ కమిషనర్‌ కీర్తి చేకూరి, అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించారు. యూజీడీ పథకానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన రూ.540 కోట్ల నిధులు ఖర్చయ్యాయని, 55 శాతం పనులు పూర్తయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.400 కోట్లు విడుదల కాలేదని అధికారులు తెలియజేశారు. చేయాల్సిన పనుల వివరాలతో పూర్తిస్థాయి డీపీఆర్‌లు, మురికివాడల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిత సమయంలోపు సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. విలీన గ్రామాల సమస్యలు, ఇన్నర్‌ రింగురోడ్డు మూడో దశ పనుల పురోగతి గురించి తెలుసుకుని తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. 

ప్రజాప్రతినిధులమంతా ఒక్క తాటిపైకి వస్తాం

సమీక్ష అనంతరం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ విలేకర్లతో మాట్లాడారు. యూజీడీ, తాగునీటి పథకాలకు సంబంధించి కేంద్రం, ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థల నిధులతో చేపట్టిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులు నిలిపివేయడం, ఆయా నిధులను మళ్లించడం వల్ల సమస్యలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. నిధులు ఇవ్వకపోవడంతోపాటు గుత్తేదారులకు వైకాపా ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్ల చాలా పనులకు టెండర్లు కూడా పూర్తి కాలేదన్నారు. వీటన్నింటిని సమీక్షించి ఎంత వరకు నిధులు అవసరమో చర్చించామని పేర్కొన్నారు. ‘అధికారులు రాజకీయ ఒత్తిళ్తతోనే పనులు చేయలేక పోయారు. అభివృద్ధి, ప్రజోప్రయోగం కోసం ప్రజాప్రతినిధులందరూ ఒకతాటిపైకి వస్తాం. సమస్యలుంటే పరిష్కరించుకుంటాం. ప్రతినెలా నగరాభివృద్ధికి సంబంధించి సమీక్షించుకుని చర్యలు తీసుకుంటాం’అని వెల్లడించారు. ‘జీఎంసీ పాలకవర్గం వైకాపాకు చెందిన మేయర్, కార్పొరేటర్లు ఉన్నందున రాజకీయంగా వీరి సహకారం అవసరం. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. వైకాపా వారితోనూ మాట్లాడి అభివృద్ధికి కలిసి రావాలని కోరుతామ’ని చెప్పారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు మాట్లాడుతూ వైకాపా పాలకులు నగరపాలక సంస్థలో కనీసం మౌలిక వసతులు కల్పించకుండా దుర్మార్గంగా వ్యవహరించారని విమర్శించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ మాట్లాడుతూ వరదలకు గృహాల్లోకి నీరు వచ్చే ప్రాంతాలపై దృష్టి సారించి ముంపు సమస్యలు రాకుండా డ్రెయిన్లలో పూడికతీతలు తీసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గుంటూరు పశ్చిమ ఎమ్యెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ రహదారుల అభివృద్ధితోపాటు విద్యుత్తు, పూడికతీతల సమస్యలపై వెంటనే అధికారులు దృష్టిసారించాలని సూచించామన్నారు. సమావేశంలో ప్రజారోగ్య సాంకేతిక విభాగం ఎస్‌ఈ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య విభాగాల అధికారులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని