logo

రాకాసి అలలు.. కన్నీటి సుడులు

స్నేహితులంతా కలిసి సముద్ర స్నానాలకు వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. అంతలోనే మృత్యువు కాటేసింది. అలల ఉద్ధృతికి ఇద్దరు బలయ్యారు. కళ్లెదుటే స్నేహితులు కొట్టుకుపోతుంటే... కేకలు వేయడం తప్ప.. కాపాడలేకపోయారు.

Published : 24 Jun 2024 05:10 IST

సముద్రంలో మునిగి ఇద్దరి మృతి 

బాల నాగేశ్వరరావు, బాల సాయి (పాత చిత్రాలు)

వేటపాలెం, మంగళగిరి, న్యూస్‌టుడే: స్నేహితులంతా కలిసి సముద్ర స్నానాలకు వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. అంతలోనే మృత్యువు కాటేసింది. అలల ఉద్ధృతికి ఇద్దరు బలయ్యారు. కళ్లెదుటే స్నేహితులు కొట్టుకుపోతుంటే... కేకలు వేయడం తప్ప.. కాపాడలేకపోయారు. కన్నీటి సుడులు ఆగలేదు. నోటి మాట రాలేదు. బాధిత కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక బోరున విలపించారు. మృతుల్లో ఒకరికి మూడు నెలల పాప ఉంది. ఆ చిన్నారి నోట నాన్న... అనే మాట వినకుండానే.. కన్న తండ్రి కనుమరుగయ్యారు. పసి పాపకు తండ్రి ప్రేమ కరవైంది. ఆయా కుటుంబాల్లో చీకట్లు అలముకున్నాయి. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని భార్గవపేట, దేవునిమాన్యానికి చెందిన 12 మంది యువకులు సముద్ర స్నానాలు చేయడానికి ప్రత్యేక వాహనంలో  వేటపాలెం మండలం రామాపురం చేరుకున్నారు. రామాపురం-కఠారిపాలెం మధ్య స్నానాలు చేయడానికి సముద్రంలోకి దిగారు. అందరూ ఉత్సాహంగా స్నానం చేస్తున్న సమయంలో కొసనం బాలనాగేశ్వరరావు(27), పడవల బాలసాయి(25) అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న పోలీసులు రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కొన ఉపిరితో ఉన్న ఇద్దర్ని చీరాలలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈపూరుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నప్రాసన చేయకుండానే..

అమ్మా.. బైబై అంటూ చెప్పి సరదాగా వెళ్లిన కొన్ని గంటలకే కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనే చేదు నిజాన్ని ఆ తల్లి నమ్మలేకపోయింది. పడవల బాలసాయి మంగళగిరి దేవుడు మాన్యం ఎనిమిదో లైన్లో బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవిస్తుంటాడు. సముద్ర స్నానానికి వెళ్లే ముందు తల్లి వెంకటరత్నంతో అమ్మా బైబై అని చెప్పిన చివరి మాటలను గుర్తుచేసుకుంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. బాలసాయికి మూడేళ్ల కిందటే వివాహమైంది. మూడు నెలల పాపకు జన్వికా ఖుషీ అని పేరుపెట్టుకున్నారు. కొద్దిరోజుల్లో పాపకు అన్నప్రాసన చేసేందుకు తిరుపతి వెళ్లాలని భార్యాభర్తలు అనుకున్నారు. ఇంతలోనే విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య పూజిత కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లారు. పాపకు టీకా వేయించడంతో కాస్త జ్వరంగా ఉందని తల్లి వద్దకు వెళ్లింది. ఇంతలోనే చీరాల్లోని బంధువుల నుంచి వచ్చిన సమాచారంతో కుప్పకూలిపోయింది. 

మంగళగిరి దేవుడు మాన్యం ప్రాంతంలోనే నివాసం ఉంటున్న మరో యువకుడు..బాలనాగేశ్వరరావు మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాగేశ్వరరావుకు పెళ్లి కాలేదు. 

లోకేశ్‌ దిగ్భ్రాంతి.. 

సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందడ[ంపై మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువకుల మృతి వారి కుటుంబాలకు తీరని లోటన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని