logo

నేటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం

రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. అందుకుగాను గత ప్రభుత్వం నిర్వహించిన స్పందన కార్యక్రమం పేరును ప్రజా సమస్య పరిష్కార వేదికగా మార్చి కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది.

Published : 24 Jun 2024 05:12 IST

అర్జీల నమోదుకు కేటాయించే నంబర్‌ కోసం వేచి ఉన్న ఫిర్యాదుదారులు (పాత చిత్రం)

కలెక్టరేట్, జిల్లా పరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. అందుకుగాను గత ప్రభుత్వం నిర్వహించిన స్పందన కార్యక్రమం పేరును ప్రజా సమస్య పరిష్కార వేదికగా మార్చి కార్యాచరణకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టరేట్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

వైకాపా ప్రభుత్వం 2019లో స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజా సమస్యలను స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించింది. 2023, మే నెలలో దీనిని పేరును ‘జగనన్నకు చెబుదాం’గా మార్చారు. జిల్లాలో 80 శాఖల పరిధిలో 16,402 అర్జీలు ప్రజలు అందించారు. వాటిలో 14,555 పరిష్కరించగా, 1649 అర్జీలు రీఓపెన్‌ అయ్యాయి. మొత్తంగా 162 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. 

గత ప్రభుత్వంలో మమ అనిపించి...

స్పందనకు అధిక ప్రాధాన్యం అని చెబుతూనే అర్జీలు అందించిన ప్రజల ఆవేదనను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు అధికారులైతే రాజకీయ నాయకులతో అంటకాగి సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించినట్లుగా అర్జీని ముగించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సమస్య పరిష్కరి ంచినట్లు అర్జీదారు చరవాణికి సందేశం రావడంతో వారు అవాక్కయ్యారు. వాస్తవానికి అర్జీదారు సంతకం తీసుకున్న తర్వాతే సమస్య పరిష్కరించినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయి అధికారులు కొందరు పట్టించుకోలేదు. 

ప్రత్యేక దృష్టి సారించాల్సిందే

ప్రజా సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో కొందరు అధికార పార్టీతో అంటకాగి సమస్యలను తొక్కిపెట్టారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉండకుండా సమస్యల పరిష్కారంలో స్పష్టత ఉండేలా చూడాలి. ముఖ్యంగా భూములకు సంబంధించిన అంశాల్లో యంత్రాంగం చొరవ చూపాల్సి ఉంది. ఇటువంటి సమస్యలపై ప్రజలు ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాటికి శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఇటువంటి వాటన్నింటికీ గడువులోగా పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని