logo

నాడు స్పందన శూన్యం.. నేటి మీకోసంపై ఆశలు

వైకాపా ఎమ్మెల్యే అనుచరుడినని చెప్పుకొంటూ తన స్థలాన్ని లాక్కున్నారని, అడిగితే దిక్కున్నచోటకు చెప్పుకోండంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఓ దళిత యువకుడి ఆక్రందన.. 

Published : 24 Jun 2024 05:24 IST

కలెక్టరేట్‌లో నేడు ప్రారంభం కానున్న గ్రీవెన్స్‌ కార్యక్రమం
ఇకనైనా న్యాయం చేయాలంటున్న బాధితులు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట

వైకాపా ఎమ్మెల్యే అనుచరుడినని చెప్పుకొంటూ తన స్థలాన్ని లాక్కున్నారని, అడిగితే దిక్కున్నచోటకు చెప్పుకోండంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఓ దళిత యువకుడి ఆక్రందన.. 


ఇంట్లో అద్దెకు ఉంటూ కబ్జా చేసే యత్నాల్లో భాగంగా తననే బయటకు గెంటేస్తున్నారని అందుకు ఓ వైకాపా నేత అండగా ఉన్నారని ఓ దివ్యాంగుడి ఆవేదన..


తాను బతికుండగా చచ్చిపోయినట్టు కన్నకొడుకే మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి బీమా సొమ్ము కాజేసి బయటకు గెంటేశారని న్యాయం చేయండంటూ ఓ మాతృమూర్తి వేదన.. 


ఓ వైకాపా నేత తమ భూమిని ఆక్రమించి ఇబ్బందుకు గురిచేస్తున్నాడని ఓ సన్నకారు రైతు గగ్గోలు.. 


ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో ఫిర్యాదులు గత ఐదేళ్లలో ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందనకు’ వచ్చేవి. కానీ ఇవేమి పరిష్కారానికి నోచుకోలేదు. జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి ఎందరో నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయానికి తమ గోడును వెళ్లబోసుకుని న్యాయం జరుగుతుందేమోనని వచ్చేవారు. అర్జీలు ఇచ్చినా పరిష్కారానికి నోచుకోకపోవడంతో బాధితుల్లో ‘స్పందన’పై నమ్మకం పోయింది. కొత్త ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)’పైనే ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇకనైనా అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. 


ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీల స్వీకరణకు గత వైకాపా ప్రభుత్వం ‘స్పందన’ పేరిట నిర్వహించేది. ఏదైనా సమస్య ఉంటే నేరుగా నాటి సీఎం జగన్‌కు ఫోన్‌ చేసి చెప్పొచ్చని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఎంతకీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల నుంచే స్పందన కరవైంది. కలెక్టరేట్‌ల వద్ద నిర్వహించే స్పందనలో కూడా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కొంతమంది బాధితులు అయితే పదుల సంఖ్యలో కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరిగారు. మధ్యాహ్నం భోజనం పెడుతూ అర్జీదారులను మభ్యపెడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదనే ఆరోపణలు వచ్చాయి. కొందరైతే ఏళ్లుగా తిరిగినవారూ ఉన్నారు. చిలకలూరిపేటకు చెందిన ఓ వృద్ధురాలు అయితే సంవత్సరన్నర కాలంగా న్యాయం చేయండంటూ తిరిగినా ఫలితం దక్కలేదు. కొడుకు కోడలు తన ఇంటిని లాక్కోవడమే కాకుండా.. తాను చచ్చిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి బీమా సొమ్ము మింగేసి, బయటకు గెంటేశారని, బతికే ఉన్నాను మహాప్రభో అని ఎన్నిసార్లు కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారో లెక్కే లేదు. అయినా సరే ఆమెకు ఇంత వరకూ న్యాయం చేయలేదు. 

ఇంటి స్థలం ఆక్రమణపై కలెక్టరేట్‌లో ఆందోళన చేస్తున్న రొంపిచర్లకు చెందిన శివకృష్ణ(పాతచిత్రం) 


ఐదేళ్ల గోడు వెల్లబోసుకొనేందుకు..

గత ప్రభుత్వం సమయంలో దగాపడ్డ వారెందరో సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి పోటెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో భూములు ఆక్రమణలకు గురైన బాధితులు, రీసర్వేలో నష్టపోయిన రైతులు, వైకాపా నాయకుల చేతిలో మోసపోయినవారు.. ఇలా చాలామంది తమ గోడును అధికారులకు వెళ్లబోసుకోవడానికి కలెక్టర్‌ కార్యాలయానికి రానున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం లేకపోవడం, ఒకవేళ అధికారుల వద్దకు వెళ్లినా న్యాయం చేయకపోగా, తిరిగి బెదిరింపులు వంటివి బాధితులకు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు బాధితుల నుంచి వినతులను స్వీకరించి ఇకనైనా తమకు న్యాయం చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.


వైకాపా నాయకుల వల్ల బాధితులైన వారే ఎక్కువ

వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన స్పందనకు ఎక్కువగా ప్రజల నుంచి భూములు కబ్జా చేశారని, పొలాన్ని ఆక్రమించారని, ఆన్‌లైన్‌లో తమ పొలాన్ని తక్కువగా నమోదు చేశారని, కొంత స్థలం పక్కవారి భూమిలో ఆన్‌లైన్‌లో చూపిస్తోందని.. ఇలాంటి సమస్యలే అధికంగా వచ్చేవి. ఎక్కువగా వైకాపా నేతలే తమ భూమిని ఆక్రమించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైకాపా ప్రభుత్వం కావడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి సాహసించేవారు కాదు. ఆన్‌లైన్‌లో తమ భూమిని తక్కువగా నమోదు చేశారని, పక్కవారి స్థలంలోకి తమ భూమి నమోదైందంటూ రీసర్వేలో జరిగిన సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూసర్వే పేరిట జరిగిన రీసర్వేలో ఎన్నో తప్పులు జరిగాయి. ఎంతోమంది రైతులు నష్టపోయారు. తమ భూమి ఆన్‌లైన్‌లో ఎకరం ఉంటే తొంభై సెంట్లే చూపిస్తోందని.. ఇలాంటి సమస్యలతో స్పందనకు వస్తుండేవారు. వీటిని పరిష్కరించడంలో అధికారులు పెద్దగా చొరవ చూపలేదు. తమ స్థలాన్ని ఆక్రమించారని కొందరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నాలు కూడా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని