logo

జనులు.. దేశాభివృద్ధికి వనరులు

చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం. ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు.. ఒకప్పుడు జనాభా నియంత్రణకు వైద్యఆరోగ్యశాఖ విస్తృతంగా చేసిన ప్రచార నినాదాలివి. ఇప్పుడా ఆ అవసరం చాలావరకు తగ్గింది. జనాభా పెరిగితే కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెరిగింది.

Updated : 11 Jul 2024 05:34 IST

మౌలికవసతుల కల్పనతో మేలు
ప్రపంచ జనాభా దినోత్సవ ప్రత్యేకం
న్యూస్‌టుడే, సత్తెనపల్లి, మల్లమ్మసెంటర్‌ (నరసరావుపేట)

చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం. ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు.. ఒకప్పుడు జనాభా నియంత్రణకు వైద్యఆరోగ్యశాఖ విస్తృతంగా చేసిన ప్రచార నినాదాలివి. ఇప్పుడా ఆ అవసరం చాలావరకు తగ్గింది. జనాభా పెరిగితే కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెరిగింది. జీవితంలో ఉన్నతస్థితిలో ఉన్న దంపతులు ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఒకరికి మరొకరు తోడుండాలి. ఇద్దరినైనా కనండ్రా బాబూ అంటూ పెద్దలు వేడుకోవాల్సిన పరిస్థితి నేటితరంలో ఉంది. విద్యాపరంగా పల్నాడులో ప్రగతి తక్కువైనా కుటుంబ నియంత్రణ పాటించే కుటుంబాలు గత దశాబ్దన్నరకాలంలో గణనీయంగా పెరిగాయి.

పల్నాడు జిల్లా జనాభాలో మూడొంతలు గ్రామాల్లోనే నివాసముంటున్నారు. సహజ వనరులు దండిగా ఉన్నా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. దీంతో మౌలిక వసతులపరంగా వెనుకబాటుతనం కనిపిస్తూనే ఉంది. ఇంటింటికీ తాగునీరు అందకపోవడం.. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ప్రగతి ఆశించిన మేరకు లేదు. జనాభా పెరిగితే అందుకు తగ్గట్టు వసతులు, వనరులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయా అంటే సరైన సమాధానం దొరకని పరిస్థితి ఉంది.

చైనాతోపాటు సాంకేతికంగా, మానవాభివృద్ధిపరంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్, జర్మనీ తదితర దేశాల్లో యువశక్తి తగ్గిపోయి వృద్ధులు పెరిగిపోయారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేనంత తక్కువస్థాయిలో జనాభా ఉన్న చాలా దేశాలు గతంలో జనాభా నియంత్రణపై పాటించిన కఠినత్వాన్ని విడనాడుతున్నాయి. ఒకరితో పరిమితం కావద్దు.. మరో ఇద్దరితోనూ సంతోషంగా ఉండొచ్చు.. అందుకు ప్రోత్సాహాకాలూ ఇస్తామంటూ ప్రజల్ని వెన్నుతడుతున్నాయి. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెరుగుదలను ఇక్కడి ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ఈ అంశాల్లో మార్పు రావాలి...

  • వైద్యపరంగానూ జిల్లా ప్రగతి సాధించాల్సి ఉంది. జిల్లాలో 350 పడకల ఆసుపత్రి, ట్రామాకేర్‌ ఆసుపత్రి ఒక్కటీ లేదు. పేరుకు ఆసుపత్రులు ఉన్నా నాణ్యమైన వైద్యం అందని దుస్థితి ఉంది. అతిసారానికి కూడా మరణాలు సంభవించడం వైద్య దుస్థితికి అద్దం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యసేవల్ని మరింత బలోపేతం చేయాలి.
  • జనాభా మరీ పెరగొద్దు.. మరీ తగ్గొద్దు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత జనాభా పెరిగినా మేలే. జిల్లాలో నెలకు సగటున 2 వేల జననాలు నమోదవుతున్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు పాటించే జంటలు కూడా పెరుగుతున్నాయి. తల్లీబిడ్డల మరణాల సంఖ్య తగ్గినా జనాభా పెరుగుదలను ప్రభుత్వమే ఆశించే పరిస్థితి నెలకొంది.
  • విద్యాపరంగా పల్నాడు వెనకబడి ఉంది. జిల్లా మొత్తం అక్షరాస్యత కేవలం 57.20 శాతంగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 67.01 శాతంగా ఉంటే మహిళల్లో కేవలం 47.39 శాతమే అక్షరాస్యత నమోదైంది. 28 మండలాలకుగాను 18 మండలాల్లో 50 కంటే తక్కువ అక్షరాస్యత శాతం ఉంది. అక్షరజ్ఞానం లేకుండా సుస్థిర అభివృద్ధి సాధించడం కష్టమే.
  • బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో మహిళలు తక్కువ వయసులో గర్భం దాల్చి అనారోగ్యం బారినపడుతున్నారు. వారికి పుట్టే బిడ్డలు తక్కువ బరువు, పోషకాహారలోపం, రక్తహీనత, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 37.2 శాతం ఆడబిడ్డల పెళ్లిళ్లు 16 ఏళ్ల వయసులోపే జరుగుతున్నాయి.
  • జిల్లాలో 2.83 లక్షల హెక్టార్టలో వరి, వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపు పంటలు సాగవుతున్నాయి. మానవ నిర్మిత మహాసాగరం చెంతనే ఉండటంతో సాగు, తాగు, పారిశ్రామిక అభివృద్ధికి అనంత అవకాశాలున్నాయి. వాటిని ఇప్పటివరకు సద్వినియోగం చేసుకోలేదు. ఇక నుంచి పారిశ్రామిక అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని విరివిగా ఏర్పాటు చేయాలి. సహజ వనరులైన ఇసుక, సిమెంట్, సున్నం, ముగ్గురాళ్లు, ఖనిజ సంపదను సద్వినియోగం చేయాలి. ఉపాధి, ఉద్యోగ అవకాశాల విప్లవాన్ని తీసుకురావాలి.

పల్నాడు జిల్లాలో..

జిల్లా జనాభా : 20.42 లక్షలు
పురుషులు 10.24 లక్షలు
మహిళలు 10.18 లక్షలు
గ్రామీణ జనాభా మొత్తం: 15.83 లక్షలు
జిల్లా మొత్తం జనాభాలో 77.5 శాతం
పట్టణ జనాభా : 4.59 లక్షలు (22.5 శాతం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని