logo

Pinnelli Venkatrami Reddy: పరారీలోనే పిన్నెల్లి తమ్ముడు.. అదే బాటలో కీలక అనుచరుడు తురకా కిశోర్‌

అధికారం చేతిలో ఉందని నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి విర్రవీగారు.. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు దిగారు.

Updated : 11 Jun 2024 08:54 IST

తీవ్ర నేర కేసులు నమోదైనా అరెస్టుకు యత్నించని పోలీసులు

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: అధికారం చేతిలో ఉందని నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి విర్రవీగారు.. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు దిగారు. ఎన్నికల రోజే కాకుండా మరుసటి రోజు కూడా దాడులకు పాల్పడటంతో ఇద్దరిపై హత్యాయత్నం కేసులు సైతం నమోదయ్యాయి. వారాలు గడుస్తున్నా మాచర్ల అల్లర్ల కేసుల్లో పురోగతి లేదు. సాధారణ కార్యకర్తలను, చోటామోటా నేతలను అదుపులోకి తీసుకున్నారే తప్పించి ఇంత వరకూ ప్రధాన సూత్రధారులను మాత్రం అదుపులోకి తీసుకోలేదు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, అతని అనుచరుడు తురకా కిశోర్‌ పరారీలోనే ఉన్నారు. 

ముందస్తు బెయిల్‌పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడి నరసరావుపేటకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మాత్రం పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. పోలీసులూ అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడం లేదు. సాధారణంగా అన్నాదమ్ములిద్దరూ ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తారు. ఏ పనైనా కలిసే చేస్తారు. దాడులు వంటి విషయంలో అన్న కంటే తమ్ముడు రెండాకులు ఎక్కువే చదివాడని మాచర్ల వాసులు అంటారు. గృహ నిర్బంధంలో ఉన్నా అన్నదమ్ములిద్దరూ వైకాపా అధినేత  జగన్‌ను కలవడానికి సీఎంవో వద్దకు గత నెల 16న మాచర్ల నుంచి తాడేపల్లి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రికి మాచర్లకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే త్వరలో అరెస్టు ఉంటుందనే వార్తలు రావడంతో రాత్రికి రాత్రి మాచర్ల నుంచి హైదరాబాద్‌కు పరారయ్యారు. అక్కడి నుంచి తమిళనాడు లేదా కేరళ వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌ నుంచి కేరళ వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో పిన్నెల్లి సోదరులు పరారీ? అని పత్రికల్లో వార్తలు రావడం.. పులులు అని చెప్పుకొనే వారు పిల్లుల్లా పారిపోయారని సోషల్‌ మీడియాలో మీమ్స్, రీల్స్‌ వైరల్‌ కావడంతో హైదరాబాద్‌లోనే ఉండి ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఎక్కడికీ పారిపోలేదని, తలచుకుంటే అరగంటలో మాచర్లలో ఉంటామని సవాల్‌ విసిరారు. ఇలా రెండు రోజుల పాటు టీవీల్లో కనిపిస్తూ    రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పోలీసులు మాత్రం పట్టుకునే ప్రయత్నం చేయలేదు. చివరకు పోలీసులపై ఒత్తిడి పెరగడంతో మే 22న అరెస్టు చేయడానికి సంగారెడ్డి వెళ్లగా అక్కడ పోలీసుల కళ్లుగప్పి సినిమాటిక్‌ స్థాయిలో తమిళనాడు  వెళ్లిపోయారు. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్, కారంపూడి విధ్వంస ఘటనలో సీఐపై హత్యాయత్నం కేసులో కూడా ముందస్తు బెయిల్‌ పొంది నరసరావుపేటలో రక్షణ వలయంలో ఉన్నారు. 

వాహనాల్లో తిరుగుతూ దాడులు..

పోలింగ్‌ రోజు, మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు తురకా కిశోర్‌ పెద్దసంఖ్యలో దాడులకు పాల్పడ్డారు. మాచర్ల పట్టణంలో 5 స్కార్పియో వాహనాలు, 50 ద్విచక్ర వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. మాచర్ల పట్టణం పీడబ్ల్యూడీ కాలనీలో పోలింగ్‌ కేంద్రంలో బీభత్సం చేశారు. కారుతో ఢీకొట్టి పైనుంచి పోనీయడంతో భవానీప్రసాద్‌ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెదేపా నేత కేశవ్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి ఇల్లు, కారును ధ్వంసం చేశారు. వెల్దుర్తి మండలం కండ్లకుంటలో తెదేపా ఏజెంట్‌గా ఉన్న నోముల మాణిక్యరావుపై పిన్నెల్లి సోదరులిద్దరూ దాడి చేశారు. మాణిక్యరావు ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో సీఐపైనే దాడి చేశారు. ఈ ఘటనలో వెంకట్రామిరెడ్డిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇలా రెండు 307 కేసులున్నా ఇంతవరకూ పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని