logo

Pinnelli: పిన్నెల్లిది మొదటి నుంచి అరాచకమే!

వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యువజన కాంగ్రెస్‌లో ఉంటూ 2006లో వెల్దుర్తి మండల జడ్పీటీసీ సభ్యుడిగా పోటీకి దిగారు. సొంత పార్టీలో పలువురు పోటీపడుతున్నా పెదనాన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన సహకారంతో వారందరినీ కాదనీ జడ్పీటీసీ సభ్యుడిగా బరిలో నిలిచారు.

Updated : 29 May 2024 09:16 IST

తెదేపా అభ్యర్థిని బెదిరించి జడ్పీటీసీ సభ్యునిగా ఏకగ్రీవ ఎన్నిక
రాజకీయ ప్రస్థానంలో అడుగడుగూ వివాదాస్పదమే
ఈనాడు, నరసరావుపేట

వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యువజన కాంగ్రెస్‌లో ఉంటూ 2006లో వెల్దుర్తి మండల జడ్పీటీసీ సభ్యుడిగా పోటీకి దిగారు. సొంత పార్టీలో పలువురు పోటీపడుతున్నా పెదనాన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన సహకారంతో వారందరినీ కాదనీ జడ్పీటీసీ సభ్యుడిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి పోటీగా తెదేపా తరఫున పట్లవీడు గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటం, పెదనాన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో తెదేపా అభ్యర్థిని బెదిరించి నామినేషన్‌ ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకువచ్చారు. పిన్నెల్లి అనుచరులు వెల్దుర్తి నుంచి తెదేపా అభ్యర్థిని కారులో జిల్లా పరిషత్‌కు తీసుకొచ్చి ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో తెదేపా అభ్యర్థి వెంకటరెడ్డి అప్పట్లో రిటర్నింగ్‌ అధికారి జిల్లా సంయుక్త పాలనాధికారి వద్దకు వెళ్లి నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఉపసంహరణకు కారణమేంటని జాయింట్‌ కలెక్టర్‌ అడగగా కాంగ్రెస్‌ వారు బెదిరిస్తున్నట్లు గొంతు మీద కత్తి పెట్టినట్లు మూగసైగలు చేసి వెంకటరెడ్డి చూపారు. స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారా.. ఒత్తిడితో ఉపసంహరించుకుంటున్నారా? అంటే పైవాడికే తెలుసని పైకి చూపించారు. రక్షణ కల్పిస్తామని చెప్పినా వినకుండా భయంతో నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోనే మాటువేసిన పిన్నెల్లి అనుచరులు అతనిని కారులో తీసుకెళ్లిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 జడ్పీటీసీ స్థానాలకు గానూ వెల్దుర్తి ఒక్కటే ఏకగ్రీవమైందని అప్పటి సంఘటనను జిల్లా పరిషత్‌ ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రవేశమే వివాదాలతో మొదలైందని చెప్పుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుండటంతో అప్పటి ఘటనను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టడం, ఆయనపై మరికొన్ని కేసులు నమోదుకావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయ ప్రవేశమే అప్పట్లో వివాదమైందని చెబుతున్నారు. అప్పట్లో మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పెదనాన్నకు వ్యతిరేకంగా పనిచేసి ఆయన సీటుకు ఎసరు పెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందడం వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. వైకాపా అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సాగించిన దౌర్జన్యకాండను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

ఈవీఎం పగలకొడుతున్న పిన్నెల్లి

పెదనాన్న స్థానంలో పోటీ

2009 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న పెదనాన్న లక్ష్మారెడ్డి స్థానంలో సీటు తనకు కేటాయించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సఫలీకృతులయ్యారు. దీంతో లక్ష్మారెడ్డి స్థానంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం, వైఎస్, జానారెడ్డి వంటి నేతల సూచనలతో లక్ష్మారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపు కోసం ఎన్నికల్లో పనిచేశారు. అప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీ 2009లో అధికారంలోకి రావడం, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జగన్‌ వైపు చేరారు. జగన్‌ బృందంలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. వైకాపా తరఫున 2014, 2019 ఎన్నికల్లోనూ మాచర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తెదేపా నాయకుల వాహనంపై దాడి చేస్తున్న పిన్నెల్లి అనుచరుడు (పాత చిత్రం)

అధికారం అండగా చెలరేగి..

2019లో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడంతో పిన్నెల్లి సోదరులు అధికారం అండగా చెలరేగిపోయారు. ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు ప్రత్యర్థులను బలహీనపరిచే కుట్రలకు తెరలేపారు. ఈ నేపథ్యంలో జరిగిన 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలన్నీ ఏకగ్రీవం అయ్యేలా చక్రం తిప్పారు. పోలీసుల సహకారంతో ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతోపాటు కేసుల పేరుతో బెదిరించి నామినేషన్‌ వేసినవారు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకువచ్చారు. భయపెట్టి, బెదిరించి ఆరాచకాలకు తెరలేపి ప్రత్యర్థులు పోటీలో లేకుండా చేశారు. నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో మాత్రమే సర్పంచి స్థానాలకు పోటీ జరిగినా అవి కూడా వైకాపా ఖాతాలోకే చేరాయి. దీంతో అప్పట్లో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకపక్ష ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. అదే పంథాను సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూసిన పిన్నెల్లి సోదరులకు ప్రతిపక్షాలు గట్టిగా ఎదురుతిరిగి స్వేచ్ఛగా ఓటు వేసుకుంటామని ముందుకురావడంతో జీర్ణించుకోలేకపోయారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గాన్ని శాసిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు ఎదురుతిరగడాన్ని సహించలేక సహనం కోల్పోయి ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి ఇప్పటివరకు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన విషయాలను ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరోమారు చర్చించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని