logo

Bhavaria gang: భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్‌

భవారియా గ్యాంగ్‌ మరోసారి రాజధానిపై విరుచుకుపడింది. నగర శివార్లలో కిరాతకమైన ధార్‌ గ్యాంగ్‌ అలజడి రేపిన కొద్దిరోజుల్లోనే ఉత్తరప్రదేశ్‌ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్‌ సభ్యులు శనివారం ఒకే రోజు నాలుగు చోట్ల చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు

Updated : 18 Jun 2024 08:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: భవారియా గ్యాంగ్‌ మరోసారి రాజధానిపై విరుచుకుపడింది. నగర శివార్లలో కిరాతకమైన ధార్‌ గ్యాంగ్‌ అలజడి రేపిన కొద్దిరోజుల్లోనే ఉత్తరప్రదేశ్‌ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్‌ సభ్యులు శనివారం ఒకే రోజు నాలుగు చోట్ల చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కొట్టేసిన బైకు మీదొచ్చిన ఇద్దరు దుండగులు నకిలీ రిజిస్ట్రేషన్‌ నంబరుతో జవహర్‌నగర్, చీర్యాల, శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వరుసగా చోరీలు చేశారు. తర్వాత గజ్వేల్‌ వరకూ వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. గజ్వేల్‌లో కనిపించిన గంటల వ్యవధిలో చీర్యాలలో ఒక గొలుసు కొట్టేశారు. తర్వాత ఎటువైపు వెళ్లారో ఆచూకీ చిక్కలేదు. సిద్ధిపేట, రాచకొండ, సైబరాబాద్‌ సహా వివిధ కమిషనరేట్ల పరిధిలో బైకు అదృశ్యం కేసుల గురించి ఆరా తీస్తున్నారు.  ఇటీవల సోలాపూర్‌లో భవారియా ముఠా వరుసగా చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడింది. వారిలోని కొందరు ఇక్కడికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

గతేడాది ఇదే ముఠా: గతేడాది జనవరి 7న హైదరాబాద్, రాచకొండ పరిధిలో ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఇద్దరు రెండు గంటల వ్యవధిలో ఆరు చైన్‌ స్నాచింగ్‌లు చేశారు. నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా ముఠాగా గుర్తించారు. వరుస దోపిడీల అనంతరం ఉత్తరప్రదేశ్‌కు పరారయ్యారు. వారి ఆచూకీకి యూపీ, దిల్లీలో ప్రత్యేక బృందాలు రోజుల తరబడి శ్రమించారు. ఇప్పుడు అదే ముఠా సభ్యులు నాలుగు చోరీలు చేశారు. వరుస దోపిడీలతో హడలెత్తించే అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి మళ్లీ తలెత్తింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని