logo

Hyderabad: హైదరాబాద్‌ వాసులు మదుపరులే.. ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు!

భాగ్యనగరవాసులు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు.. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హోం క్రెడిట్‌ ఇండియా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వాలెట్‌’ జాతీయ స్థాయి అధ్యయనం స్పష్టం చేసింది.

Updated : 21 Jun 2024 08:41 IST

ఆదాయం రూ.44వేలు, ఖర్చు రూ.24వేలు

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరవాసులు ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు.. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హోం క్రెడిట్‌ ఇండియా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వాలెట్‌’ జాతీయ స్థాయి అధ్యయనం స్పష్టం చేసింది. ఆర్థిక క్రమశిక్షణలోనూ ఇతర నగరాల కంటే మెరుగైన స్థానంలో ఉన్నారని వెల్లడించింది. సగటు వ్యక్తిగత ఆదాయంలోనూ 17 నగరాల కంటే ముందున్నారని పేర్కొంది. మధ్యతరగతి వర్గాలు సౌకర్యంగా జీవించడానికి, ఆదాయం పొందేందుకు హైదరాబాద్‌ సరైన ప్రదేశమని కితాబిచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మధ్యతరగతి జీవనంపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలెన్నో తెలిపింది.

పొదుపులో నంబర్‌-1: ఈ సంస్థ మధ్యతరగతి కుటుంబాల్లో ఆదాయం, ఖర్చులపై పరిశీలన చేసింది.  18 నుంచి 55 ఏళ్ల  వయసుండి.. వార్షిక ఆదాయం రూ.3.5లక్షల కంటే ఎక్కువ ఉన్నవారిని సర్వే చేసింది.
అనుకూల నగరం: మధ్యతరగతి ప్రజలకు అనుకూల నగరంగా హైదరాబాద్‌ వరుసగా రెండోసారి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంగళూరు మొదటిస్థానంలో ఉంది. అత్యధిక నెలవారీ ఆదాయం ఉన్న నగరాల్లో రూ.44 వేలతో మొదటిస్థానంలో  ఉంది. సగటు వ్యక్తిగత నెలవారీ ఆదాయం 2023లో రూ.42వేల నుంచి రూ.44వేలకు పెరిగింది. స్థిర నెలవారీ ఖర్చులు రూ.19వేల నుంచి రూ.24వేలకు పెరిగాయి. 
ఖర్చు తగ్గింది..: నగరంలో 69శాతం మంది ఖర్చు తగ్గించి పొదుపువైపు మొగ్గు చూపారని అధ్యయనం తేల్చింది. నెలవారీ ఖర్చుల విషయానికొస్తే పర్యటనలు లేదా విహారయాత్రలకు 35శాతం, బయటి ఆహారానికి 19శాతం, ఫిట్‌నెస్‌కు 6శాతం, ఓటీటీ యాప్‌లకు 10శాతం ఖర్చు చేస్తున్నారు. గత ఆరు నెలల్లో 57శాతం మంది దుస్తులు, ఇతర అవసరమైన వస్తువులనే కొనుగోలు చేశారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 88శాతం మంది తమ సేవింగ్స్‌ను నగదు రూపంలోనే భద్రపరుస్తున్నారు. 26శాతం మంది నగరవాసులు వారి ఆర్థిక సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. 25శాతం మంది ఈ వివరాలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని