logo

చల్లగా తాగి.. ఆస్తమానం బాధపడొద్దు

ఎండ వేడి నుంచి ఉపశమనానికి చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఐస్‌వాటర్‌ లేదంటే ఐస్‌ కలిపిన పానీయాలు తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు.

Updated : 27 May 2023 10:44 IST

ఎండ వేడి నుంచి ఉపశమనానికి చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఐస్‌వాటర్‌ లేదంటే ఐస్‌ కలిపిన పానీయాలు తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రోడ్డు పక్కన శుభ్రత లేని ఐస్‌ కలిపిన పానీయాల వల్ల ఉపశమనం మాటెలా ఉన్నా.. రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిమ్మరసం, చెరుకురసం ఇతర ఫ్రూట్‌జ్యూస్‌ల్లో చల్లదనానికి ఐస్‌ చేర్చుతారు. అపరిశుభ్రమైన ఐస్‌ ఉపయోగిస్తే వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఐస్‌ కోసం ఎలాంటి నీరు ఉపయోగిస్తున్నారనేది కూడా కీలకమే.

ఆస్తమా, బ్రాంకైటీస్‌, సైనస్‌ బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలి. బాగా చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోని నాళాలు పూర్తిగా మూసుకు పోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. నిద్ర పట్టకపోవడం.. నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియాగా మారుతుంది.

చిన్నారులు, వృద్ధులు చల్లని ద్రవాలు, రోడ్డు పక్కన దొరికే చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, వైరల్‌ వ్యాధులకు కారణమవుతాయి. సరైన ఐస్‌ను ఉపయోగించక పోవడం ఒక కారణమైతే... వీటిని అమ్మే వారు శుభ్రత పాటించక పోవడం, రోడ్లపై ఉండే దుమ్ము, ధూళి వాటిపై పడటం కూడా వ్యాధులకు కారణం. అవసరమైతే ఇంట్లో శుభ్రమైన నీటితో తయారు చేసిన ఐస్‌క్యూబ్‌లను ఒకటి రెండు వాడుకోవచ్చు.

తొలుత గొంతు నొప్పితో సమస్య ప్రారంభమవుతుంది. తర్వాత గొంతు బొంగురు పోవడం, కఫం, దగ్గు, జబ్బుతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వస్తుంది. ఇక ఇలాంటి వారిలో ఆస్తమా, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, కిడ్నీలు, షుగర్‌, లివర్‌, సీవోపీడీ రోగులు ఉంటే వారిలో తక్షణం న్యూమెనియాకు దారి తీసి ప్రాణాల మీదకే తెస్తుంది.

ఈ కాలంలో ఎయిర్‌ కూలర్లు, ఏసీలు వాడుతుంటారు. కూలర్ల ద్వారా వచ్చే తుంపర్లలో సన్నని ధూళి కణాలు ఉంటాయి. ఇవి ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆస్తమాను కలగజేస్తాయి. వేసవి కాలం ప్రారంభంలోనే కూలర్లలో ఉన్న మ్యాట్లు మార్చాలి. ఏసీల్లో ఫిల్టర్లను శుభ్రం చేయడం లేదంటే మార్చుకోవడం ఉత్తమం.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని