logo

Education In USA: బీఏ.. నర్సింగ్‌.. బిజినెస్‌.. అంతా అమెరికాకే

అమెరికా చదువుకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేది ఇంజినీరింగ్‌ విద్యార్థులే అన్న అభిప్రాయం మారుతోంది.

Updated : 27 Aug 2023 08:58 IST

యూఎస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు పోటెత్తిన విద్యార్థులు


ఔత్సాహికులతో కిటకిటలాడిన ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ప్రాంగణం

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా చదువుకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేది ఇంజినీరింగ్‌ విద్యార్థులే అన్న అభిప్రాయం మారుతోంది. అత్యధిక శాతం మంది ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కృత్రిమ మేధ లాంటి కోర్సుల్లో చేరేందుకే వెళ్తున్నా.. ఇతర కోర్సులు చదువుతూ ఆ దేశానికి ఉన్నత విద్యకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్న వారూ పెరుగుతున్నారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన యూఎస్‌ఏ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు వచ్చిన పలువురు విద్యార్థులను పలకరించగా... అనేక మంది ఇంజినీరింగేతర విద్యార్థులు ఉండటం విశేషం. బీఏ, బీఎస్సీ, నర్సింగ్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితర కోర్సులు చదువుతున్న వారూ బీఎస్‌, ఎంఎస్‌ కోర్సుల కోసం ఆయా వర్సిటీల ప్రతినిధులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. కొందరు వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రవేశాలు పొందేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు చదువు పూర్తయిన తర్వాత వెళ్లే ఉద్దేశంతో సమాచారం సేకరించడానికి హాజరయ్యారు. ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న 3 వేల మందే కాకుండా ఇతరులు కూడా వందలాది మంది తరలిరావడంతో నోవాటెల్‌ ప్రాంగణం కిటకిటలాడింది. నాలుగైదు సంవత్సరాల క్రితం బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం కొలువులకు రాజీనామా చేసి అమెరికాలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ఎన్నేళ్లు ఉన్నా ఆశించినంత ఆదాయం ఉండదని, దానికితోడు ఒత్తిడి అధికమని భావిస్తున్న వారు అటువైపు చూస్తున్నారు. 


డేటా సైన్స్‌ చదువుదామని.. : మనోజ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు

హైదరాబాద్‌లో 2018లో బీటెక్‌ సీఎస్‌ఈ పూర్తయ్యింది. అప్పటి నుంచి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా వార్షిక వేతనం రూ.12.50 లక్షలు. అమెరికాలో ఎంఎస్‌ డేటా సైన్స్‌ చేయాలని అనుకుంటున్నా. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో వెళ్లాలన్న ప్రణాళికలో భాగంగా ఈ ప్రదర్శనకు వచ్చా.


నర్సింగ్‌ కోర్సంటే వారూ ఆశ్చర్యపోయారు : సుధీర, హైదరాబాద్‌

మా పెద్ద కుమార్తె అమెరికాలో ఎంఎస్‌ చదివి ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె సహన బీఎస్సీ నర్సింగ్‌ చివరి సంవత్సరం చదువుతోంది. అమెరికాలో ఎంఎస్‌ నర్సింగ్‌ చదివేందుకు అవసరమైన సాధికారిక సమాచారం కోసం వచ్చాం. ఒక్కో స్టాల్‌లో అడుగుతూ పోతే కొన్ని చోట్ల కోర్సు ఉందని వర్సిటీల ప్రతినిధులు చెప్పారు. మీరొక్కరే నర్సింగ్‌ గురించి అడిగిందని వారూ ఆశ్చర్యపోయారు.


నడవలేకున్నా..  చక్రాల కుర్చీలో వచ్చి

ఓక్రిడ్జ్‌ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పేరు సిద్ధీ. ఇటీవల ప్రమాదవశాత్తూ కాలికి గాయమైంది. అమెరికాలో బిజినెస్‌ విభాగంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఆ వివరాల కోసం  చక్రాల కుర్చీలో తన తల్లిదండ్రులతో కలిసి ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు వచ్చాడు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని