logo

నీరు రాదు.. నిర్వహణ లేదు

ప్రజా మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. నీరు లేదంటూ గుత్తేదారులు నిర్వహణను వదిలేశారు. అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుని.. నిర్వహణ బిల్లులపై సంతకాలు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

Published : 15 Apr 2024 03:04 IST

అధ్వానంగా ప్రజా మరుగుదొడ్లు

సైదాబాద్‌ వార్డు కార్యాలయం వద్ద..

ఈనాడు, హైదరాబాద్‌, వెంగళరావునగర్‌, మలక్‌పేట, న్యూస్‌టుడే: ప్రజా మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. నీరు లేదంటూ గుత్తేదారులు నిర్వహణను వదిలేశారు. అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుని.. నిర్వహణ బిల్లులపై సంతకాలు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకుల కోసం మూడేళ్ల కిందట నగరవ్యాప్తంగా దాదాపు 6 వేల మరుగుదొడ్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం చాలావరకు గల్లంతయ్యాయి. ఇటీవల 2,173 ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఇవి కూడా శుభ్రంగా లేవు.

ఇదీ పరిస్థితి.. నీరు లేకపోవడంతో ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి ఎదురుగా కాలిబాటపై ఉన్న మరుగుదొడ్డి చాలా రోజులుగా మలవ్యర్థాలతో నిండి ఉంది. వెంగళరావునగర్‌ కల్యాణ్‌ నగర్‌ చౌరస్తా వద్ద నున్న మరుగుదొడ్డి నిరుపయోగంగా మారింది.

  • దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండు పరిసరాల్లో ఒక్కటీ పని చేయట్లేదు. సాయిబాబా గుడి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ చౌరస్తా వెళ్లే రోడ్డులో నాలుగేళ్ల క్రితం ఈ-టాయిలెట్‌ ఏర్పాటు చేయగా, ప్రారంభించిన నెల రోజులకే మూతపడింది. వాటి పక్కనున్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్ల పరిస్థితి అంతే.
  • వీఎస్టీ కూడలి నుంచి రాంనగర్‌ వెళ్లే రోడ్డులోని ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదు.
  • పాతబస్తీ మొఘల్‌పుర క్రీడా ప్రాంగణంలో సుమారు పది ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లు మూలకుబడ్డాయి.
  • ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ సైదాబాద్‌ బిస్కట్‌ ఫ్యాక్టరీ దోబీఘాట్‌ వద్దనున్న మరుగుదొడ్లకు తలుపులు, విద్యుత్తు, నీటి కనెక్షన్లు లేవు.

మలక్‌పేటలో జాకీర్‌ హుస్సేన్‌ కమ్యూనిటీహాల్‌ చెంత


పేరుకే నిబంధనలు.. ఒక్కో మరుగుదొడ్డి నిర్వహణకు బల్దియా రూ.4 వేలు చెల్లిస్తోంది. మరుగుదొడ్లలో గుత్తేదారు లిక్విడ్‌ సోప్‌, నీటి వసతి కల్పించాలి. 500 లీటర్ల నీటి ట్యాంకును రోజూ నింపాలి. భూగర్భంలోని ట్యాంకులోని మల వ్యర్థాలను ఏరోజుకారోజు మురుగు శుద్ధి కేంద్రాలకు తరలించాలి.

  • ప్రతి నిర్మాణాన్ని 4 గంటలకోసారి శుభ్రం చేయాలి. 15 టాయిలెట్లను ఓ క్లస్టర్‌గా విభజించి.ప్రైవేటు నిర్వహణకు అప్పగించారు. సెలవు రోజుల్లోనూ శుభ్రం చేయాలి. చుట్టూ 50 మీటర్ల పాటు వ్యర్థాలు, బహిరంగ మూత్ర విసర్జన జరగకుండా చూడాలి. బ్లీచింగ్‌ పౌడరు, సున్నం చల్లాలి.
  • శుభ్రం చేయకపోతే రోజుకు రూ.1,000 జరిమానా, ఫినాయిల్‌, యాసిడ్‌ వాడకపోయినా, క్రిమి సంహారక రసాయనాలు వినియోగించకున్నా..రూ.100 చొప్పున జరిమానా ఉంటుంది. ఎవరి నుంచైనా ఫిర్యాదు అందితే గుత్తేదారు రూ.300 జరిమానా చెల్లించాల్సిందే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని