logo

హౌసింగ్‌ సొసైటీల్లోనూ పోలింగ్‌ కేంద్రాలు

ఎన్నిక ఏదైనా.. తక్కువ మంది ఓటేసే జిల్లాల్లో రాజధాని హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

Published : 16 Apr 2024 06:10 IST

దివ్యాంగ ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయం: రోనాల్డ్‌రాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నిక ఏదైనా.. తక్కువ మంది ఓటేసే జిల్లాల్లో రాజధాని హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ ‘ఈనాడు’కు తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే సొసైటీల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం అర్హతలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఈసీఐ ముందడుగు..

ప్రైవేటు హౌసింగ్‌ సొసైటీల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, పలు కారణాలతో ఓటుకు దూరంగా ఉంటున్న వారూ పోలింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదన 2012 నుంచి ఈసీఐ పరిశీలనలో ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నోయిడా, కాన్పూర్‌, లఖ్‌నవూ, దిల్లీ, రాంచి, పుణేతోపాటు హైదరాబాద్‌ తదితర నగరాల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు సొసైటీల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇటీవల ఈసీఐ ఆయా నగరాల మున్సిపల్‌ కమిషనర్లకు సూచన చేసిన విషయం తెలిసింది.

పోలింగ్‌ శాతాన్ని పెంచే దిశగా..

  • నగర పరిధిలో 19లక్షల మంది ఆస్తిపన్ను చెల్లించే పౌరులు ఉన్నారు. వారి ఫోన్‌ నెంబర్లన్నింటికీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ స్వల్ప సందేశాలను పంపించాలని డీఈఓ రోనాల్డ్‌రాస్‌ తాజాగా యంత్రాంగాన్ని ఆదేశించారు. అదే సమయంలో పాఠశాలల్లోని విద్యార్థులకు సంకల్ప పత్రాలను అందజేసి.. తల్లిదండ్రులంతా ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు.
  • బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్వో) ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే మొదలైందని, ఇంటింటికీ వెళ్లి.. ఎంత మంది ఓట్లు జాబితాలో ఉన్నాయనే సమాచారాన్ని సరిచూస్తున్నారు.
  • సాక్ష్యం మొబైల్‌ యాప్‌లో దివ్యాంగ ఓటర్లు.. తమ వివరాలను నమోదు చేసుకోవాలని, అలా నమోదైన వారికే పోలింగ్‌ రోజున ఉచిత రవాణా సదుపాయం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
  • ఓటరు సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నెంబరు 1950కు ఫోన్‌ చేయాలని, వెబ్‌సైట్‌ https://voters.eci.gov.in/login లో లాగినై ఓటరు జాబితా, ఇతర సమాచారాన్ని పొందవచ్చని జీహెచ్‌ఎంసీ సూచించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని