logo

వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..

భార్య వివాహేతర సంబంధం భర్తను హతమార్చింది. పథకం ప్రకారమే ప్రియుడితో కలిసి వివాహిత దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు. హత్య సమయంలో ప్రధాన నిందితుడిని వెంటాడిన బాధితుడి దీనచూపులు లొంగిపోయేందుకు కారణమయ్యాయి.

Updated : 18 May 2024 09:17 IST

హత్య కేసులో రౌడీషీటర్‌ లొంగుబాటు
నలుగురి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

విజయ్‌కుమార్‌

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: భార్య వివాహేతర సంబంధం భర్తను హతమార్చింది. పథకం ప్రకారమే ప్రియుడితో కలిసి వివాహిత దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు. హత్య సమయంలో ప్రధాన నిందితుడిని వెంటాడిన బాధితుడి దీనచూపులు లొంగిపోయేందుకు కారణమయ్యాయి. ఈ కేసులో శుక్రవారం నిందితులు మృతుడి భార్య శ్రీలక్ష్మి, ఆమె ప్రియుడు రాజేశ్‌, రౌడీషీటర్‌ రాజేశ్వర్‌రెడ్డి, మహ్మద్‌ మైతాబ్‌ను మధురానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

భర్తకు తెలియడంతో పథకం

ఎల్లారెడ్డిగూడకు చెందిన విజయ్‌కుమార్‌ ప్రయివేటు ఉద్యోగి. 15 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మిని వివాహమాడాడు. ఇద్దరు పిల్లలతో కలిసి జయప్రకాశ్‌నగర్‌లోని శిఖర అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. పెళ్లికి ముందే ప్రేమించిన రాజేశ్‌తో శ్రీలక్ష్మి ఆ సంబంధాన్ని కొనసాగించింది. భర్తకు తెలియకుండా ప్రియుడ్ని కలుస్తుండేది. గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతుండేది. ఈ ఏడాది జనవరిలో భార్య ప్రవర్తనపై అనుమానం రావటంతో ఆమె సెల్‌ఫోన్‌ను విజయ్‌ పరిశీలించాడు. ప్రియుడు రాజేశ్‌తో వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్టు గుర్తించాడు. ఈ విషయమై భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. పద్దతి మార్చుకోమంటూ భర్త గట్టిగా మందలించటంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. భర్తను బెదిరించాలని, అవసరమైతే అడ్డు తొలగించాలని కోరింది. విజయ్‌కుమార్‌ను చంపేందుకు రాజేశ్‌.. స్నేహితుడైన రౌడీషీటర్‌ రాజేశ్వర్‌రెడ్డిని అతనికి తెలిసిన మహ్మద్‌ మైతాబ్‌కు చెప్పాడు. స్థానిక మద్యం దుకాణం వద్ద ముగ్గురూ హత్యకు పథకరచన చేశారు. ఫిబ్రవరి 1న విజయ్‌ పిల్లల్ని పాఠశాలకు తీసుకువెళ్లగా ఆ ముగ్గురు ఇంటికి వచ్చి మరుగుదొడ్డిలో దాక్కున్నారు. శ్రీలక్ష్మిని పడకగదిలో ఉంచారు. విజయ్‌కుమార్‌ ఇంటికి రాగానే ముగ్గురు దాడి చేసి చంపేసి వెళ్లిపోయారు. రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసిన శ్రీలక్ష్మి.. విజయ్‌కుమార్‌ గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. మృతుడి తల్లిదండ్రులు మరణించడం, సోదరుడు, బంధువులున్నా రాకపోకలు లేకపోవడంతో ఎవరూ అనుమానించలేదు. దీంతో అంత్యక్రియలు పూర్తిచేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. విజయ్‌ను రౌడీషీటర్‌ రాజేశ్వర్‌రెడ్డి చంపుతున్న సమయంలో పిల్లల కోసమైనా తనను ప్రాణాలతో వదిలేయమని మృతుడి కళ్లు దీనంగా వేడుకోవడం గుర్తుకొచ్చి పశ్చాత్తాపపడిన రాజేశ్వర్‌రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. తండ్రి మరణించటం, తల్లి జైలుకెళ్లటంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంటికి చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు