logo

నీటి సంరక్షణకు అడుగులు.. అవార్డుకు బాటలు

నీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌లు, సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి మించిన మార్గం మరొకటి లేదు. కేంద్ర ప్రభుత్వం వీటి తవ్వకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

Published : 18 May 2024 02:20 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

పులుమద్దిలో ఇంకుడు గుంతను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

నీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌లు, సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి మించిన మార్గం మరొకటి లేదు. కేంద్ర ప్రభుత్వం వీటి తవ్వకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా పురపాలికల్లో, పంచాయతీల్లో వీటి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఏటా భూగర్భ జలాల పెంపునకు కృషి చేసినందుకు జాతీయ వాటర్‌ అవార్డులను అందజేస్తున్నారు. భూగర్భ జలాల పెంపునకు కృషి చేసిన రాష్ట్రం, జిల్లా, మున్సిపాలిటీలు, పంచాయతీలు, పాఠశాలలు/కళాశాలలు, పరిశ్రమలు, సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఇలా ఇప్పటి వరకు నాలుగు అవార్డులను ప్రదానం చేశారు. 5వ అవార్డుల ఎంపికకు గత డిసెంబరులో ఆన్‌లైన్‌లో వివిధ జిల్లాలనుంచి దరఖాస్తులను స్వీకరించారు.

రాష్ట్రం నుంచి వికారాబాద్‌ జిల్లా

దేశ వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వికారాబాద్‌ జిల్లాను, జిల్లాలోని దోమ మండలం దాదాపూర్‌ పంచాయతీని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఉపాధి పథకంలో కుంటలు, ఇంకుడు గుంతలు, సామాజిక ఇంకుడు గుంతలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను, చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. వీటి నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయి.

కేంద్ర బృందం పరిశీలన: జిల్లాలో నీటి సంరక్షణ, ఉపాధి పథకం కింద చేపట్టిన పనులను గురువారం కేంద్ర జల వనరుల శాఖ భూగర్భ జల బోర్డు సభ్యులు డిప్యూటీ డైరెక్టర్‌ కె.శంకర్‌, శాస్త్రవేత్త టి.మాధవ్‌ జిల్లాలో పర్యటించి పనులను పరిశీలించారు. వికారాబాద్‌ మండలం పులుమద్దిలో వాటర్‌షెడ్‌ పనులను, భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన పనులను పరిశీలించారు. నవాబ్‌పేట మండలం గంగ్యాడ, పూడూరు మండలం మీర్జాపూర్‌ గ్రామాలను సందర్శించారు. బృందం గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. పనుల విషయంలోనూ సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఎంపిక ఇలా

వివిధ విభాగాల్లో జాతీయ వాటర్‌ అవార్డులను ప్రకటిస్తారు. ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ జిల్లా, ఉత్తమ పురపాలక సంఘం, పంచాయతీ, ఉత్తమ కళాశాల/పాఠశాల, సంస్థలు, పరిశ్రమలను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియను ప్రత్యేక జ్యూరీ కమిటీ పరిశీలిస్తుంది. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులుంటాయి. ట్రోఫితో పాటు నగదు బహుమతి రూ.2లక్షలు, రూ.లక్షన్నర, రూ.లక్ష అందజేస్తారు.


పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.. 

కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ వాటర్‌ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ సారి అవార్డు కోసం ప్రతిపాదనలు పంపించాం.  జిల్లాను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర బృందం సభ్యులు జిల్లాలో పర్యటించారు. నీటి పొదుపునకు తీసుకున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు