logo

సకుటుంబ సమేతంగా మోసాల దందా

పైసా పెట్టుబడి లేకుండా రూ. కోట్ల వ్యాపారం చేస్తున్నట్టు నాటకమాడారు. రియల్‌ రంగంలో లాభాల పంట పండిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టించారు.

Updated : 12 Jun 2024 04:57 IST

పోలీసులు అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌ : పైసా పెట్టుబడి లేకుండా రూ. కోట్ల వ్యాపారం చేస్తున్నట్టు నాటకమాడారు. రియల్‌ రంగంలో లాభాల పంట పండిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టించారు. పలుమార్లు కేసులు నమోదై జైలుకెళ్లొచ్చినా విడుదల కాగానే మళ్లీ మోసాలతో విరుచుకుపడుతున్న ఈ మాయదారి కుటుంబం ఆటకట్టించారు నగర సీసీఎస్‌ పోలీసులు. డీసీపీ ఎం.శ్వేత మంగళవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన డాక్టర్‌ మొల్ల శివయ్య అలియాస్‌ శివకుమార్‌. భార్య స్వర్ణలత, కుమారుడు జశ్వంత్‌తో కలిసి మిమాంశ, రియాల్టీ ఔరా, జ్యోతిక ఇన్వెస్టర్స్‌ క్లబ్‌ పేర్లతో మోసాల దందా ప్రారంభించారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు, ఎన్‌ఎల్‌పీ ద్వారా వైద్యసేవలు అందిస్తామని.. ఆకట్టుకునేలా మాట్లాడుతూ యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా ప్రచారం చేశారు. శివారు ప్రాంతాల్లో తాము నిర్మిస్తున్న వెల్‌నెస్‌ కేంద్రాల్లో యోగా శిక్షణ, జిమ్, ఆయుర్వేదంవంటి సౌకర్యాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. రియల్‌ రంగంలో ఎదిగేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఒక్కో సభ్యుడి నుంచి రూ.లక్ష కాజేశారు. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, క్యాన్సర్‌ తక్కువ కాలంలో తగ్గించేందుకు మిమాంశ వెల్‌నెస్‌ రిసార్ట్స్‌ సేవలు అందిస్తున్నట్టు శివయ్య ప్రకటించాడు. ఎలాంటి అర్హత లేకపోయినా తానే వైద్యుడిగా చెలామణి అయ్యాడు.  ఇవన్నీ నిజమని భావించిన 70 మంది శిక్షణ, స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టారు. ఇటీవల బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. శివయ్య, స్వర్ణలత, జశ్వంత్, న్యాయవాది శ్రీనివాస్‌ కలిసి సామాన్యుల నుంచి రూ.10.86కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు.  తాజాగా సీసీఎస్‌లో నమోదైన కేసులో నిందితులు  జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవించారు. జైలునుంచి విడుదలయ్యాక ప్రధాన నిందితుడు శివయ్య.. మళ్లీ యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా ప్రకటనలు చేస్తున్నాడు.  వీటిని ఎవరూ గుడ్డిగా నమ్మవద్దని డీసీపీ ఎం.శ్వేత హెచ్చరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని