logo

పాఠాలు బోధిస్తాయి.. బాధపడితే ఓదారుస్తాయి

రాష్ట్రంలో తొలిసారిగా రోబో టీచరమ్మలతో బోధన కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: పద్యాలు పడతాయి.. పాఠాలు బోధిస్తాయి.. కదులుతాయి.. కరచాలనం చేస్తాయి.. పిల్లలు బాధ పడితే ఓదారుస్తాయి..

Updated : 12 Jun 2024 05:03 IST

విద్యార్థులతో రోబో అధ్యాపకులు

రాష్ట్రంలో తొలిసారిగా రోబో టీచరమ్మలతో బోధన కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: పద్యాలు పడతాయి.. పాఠాలు బోధిస్తాయి.. కదులుతాయి.. కరచాలనం చేస్తాయి.. పిల్లలు బాధ పడితే ఓదారుస్తాయి.. అడగకూడని ప్రశ్నలు అడిగితే హెచ్చరిస్తాయి.. చిన్న అంశం నుంచి ప్రపంచస్థాయి విషయాలపై పూర్తి అవగాహనతో సమాధానాలు చెప్తాయి.. ఇవి రోబో టీచరమ్మల పని తీరు. రాష్ట్రంలోనే మొదటిసారిగా కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీలో గల నెక్ట్స్‌జెన్‌ పాఠశాల యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిన రోబోలతో తరగతి గదిలో బోధన విధానం ఆకట్టుకుంటుంది. రోబో టీచరమ్మలు, బోధించే విధానం, తయారు చేసిన యువ ఇంజినీర్ల అనుభవాలు మనమూ తెలుసుకుందాం..

పిన్న వయస్కులే తయారీదారులు

కేరళలోని కొచ్చికి చెందిన 27, 28ఏళ్ల యువకులు ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ చేసి మేకర్‌ ల్యాబ్స్‌ పేరిట సంస్థ ఏర్పాటుచేశారు. ఇటీవల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు బోధించేలా ఐరిస్‌(ఇంటెలిజెంట్‌ రోబోటిక్స్‌ ఇంటరాక్టివ్‌ సిస్టమ్‌) కృత్రిమ మేధతో రోబో ఉపాధ్యాయులను తయారుచేశారు. ఇది మేకిన్‌ ఇండియా ఉత్పత్తి. అందుబాటులో ఉన్న రా మెటీరియల్‌ను కొనుగోలు చేసి.. మిగిలిన ప్లాస్టిక్, అల్యూమినియం, చిప్స్, మోటర్లను సొంతంగా తయారుచేశారు. నిధులు అందించేందుకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చినా కాదని.. తమ ప్రతిభతో తక్కువ ఖర్చయ్యేలా ఒక్కో రోబో(ఐరిస్‌)కు రూ.3.5లక్షలు వెచ్చించారు. యువ ఇంజినీర్లే సంస్థ సీఈవోగా హరిసాగర్, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ శ్యాంబాబు, జనరల్‌ మేనేజర్‌ అమల్‌ వి నాథ్‌గా వ్యవహరిస్తున్నారు. 

రోబోలను తయారుచేసిన యువ ఇంజినీర్ల బృందం


రైమ్స్‌ నుంచి రాకెట్‌ సైన్స్‌ వరకు..

  • చిన్నారులు రైమ్స్‌ అడిగినా, రాకెట్‌ సైన్స్‌ ను వివరించమన్నా రోబో టీచరమ్మలు సమాధానాలు చెబుతాయి.
  • లెక్కలు చేస్తాయి. కథలు చెబుతాయి. కంప్యూటర్స్, కరెంట్‌ అఫైర్స్‌ ఇలా ఏదడిగినా ఇట్టే చెప్పేస్తాయి.
  • ఉపాధ్యాయురాలు అంటే భయం ఉన్న పిల్లలు.. పుస్తకాలు చదవడం ఇష్టపడని వారు రోబో టీచరమ్మలతో భయం లేకుండా నేర్చుకునే వీలుంది.
  • అవసరమైతే తరగతి గదిలో ఉపాధ్యాయురాలికి అసిస్టెంట్, అడ్వైజర్‌గా ఉపయోగపడతాయి. ముందుకు వెనక్కి కదులుతాయి..
  • అడగకూడని ప్రశ్నలకు సమాధానం చెప్పవు. అడిగినా అడగొద్దని హెచ్చరిస్తాయి.
  • విద్యుత్తుతో పనిచేసే ఈ రోబోలు విద్యుత్తు సరఫరా ఆగినా అరగంట పాటు పనిచేస్తాయి.
  • పిల్లలు ‘ఐ యామ్‌ ఫీలింగ్‌ స్యాడ్‌’ అని అంటే లాలించే మాటలతో ఓదారుస్తాయి. 

ఏపీలోనూ ప్రారంభించనున్నాం
- హరిసాగర్, మేకర్‌ ల్యాబ్స్‌ సీఈవో 

పలు ప్రయోగాలు చేస్తున్న మాకు విద్యారంగానికి సంబంధించి ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ దిశగా అడుగులు వేశాం. రెండేళ్లకు విజయవంతమయ్యాం. ఈ ప్రయోగం దేశంలో మూడోది.. రాష్ట్రంలో మొదటిది. ఏపీలో తొందర్లో ప్రారంభించనున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని