logo

విద్యార్థుల ఉన్నతికి ప్రత్యేక కృషి

జిల్లాలో ఈ విద్యా సంవత్సరం మరింత ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నాం. విద్యార్థుల ఉన్నతికి ప్రత్యేకంగా కృషి చేయబోతున్నామని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి (డీఈఓ) తెలిపారు.

Updated : 12 Jun 2024 04:57 IST

రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఈ విద్యా సంవత్సరం మరింత ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నాం. విద్యార్థుల ఉన్నతికి ప్రత్యేకంగా కృషి చేయబోతున్నామని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి (డీఈఓ) తెలిపారు. వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ఆమెతో ‘ముఖాముఖి’ నిర్వహించగా పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే ఇలా.. 

మొదటి రోజు పండుగ వాతావరణం 

జిల్లాలో 1068 పాఠశాలలున్నాయి. నేడు పాఠశాలల పునః ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం.. మొదటి రోజు పాఠశాలల్లో పండుగ వాతావరణాన్ని కల్పించాలని సూచించాం. 

95 శాతం దుస్తులు సిద్ధం

దాదాపు 90 వేల మంది విద్యార్థులు చదువుతుండగా వీరికోసం 85,988 జతల దుస్తులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయి. 300 పాఠశాలలకు దుస్తులను నేరుగా సరఫరా చేశాం. మిగిలిన పాఠశాలలకూ సరఫరా చేస్తున్నాం. 

8వ తరగతి తెలుగు టైటిల్‌ ఒక్కటే రావాలి

విద్యార్థులకు అవసరమైన 5.38 లక్షల పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. 8వ తరగతిలో తెలుగు టైటిల్‌ ఒక్కటి మాత్రమే సరఫరా కాలేదు. దీన్ని కూడా త్వరలో అందిస్తాం. నోట్‌పుస్తకాలు 4.60 లక్షలు పంపించారు. మండల వనరుల కేంద్రం నుంచి ఆయా మండలంలో ఉన్న పాఠశాలలకు తీసుకెళ్తున్నారు.  

‘అమ్మ ఆదర్శం’తో విశేష మార్పు 

‘అమ్మ ఆదర్శ’ పాఠశాలల కార్యక్రమం కింద పాఠశాలల్లో విద్యుద్దీకరణ, శౌచాలయాల మరమ్మతులు, తాగునీటి సౌకర్యం తదితర పనులు చేపట్టాం. తద్వారా విశేషమైన మార్పు కనిపిస్తోంది. 

సాంకేతిక వినియోగానికి అధిక ప్రాధాన్యం 

ఈసారి పాఠశాలల్లో సాంకేతికత వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. జిల్లాలో డిజిటల్‌ బోధన కలిగిన పాఠశాలలు 225 ఉన్నాయి. వీటిలో డిజిటల్‌ పద్ధతిలోనే బోధన చేస్తారు. 940 పాఠశాలల్లో 3187 గ్రీన్‌ చాక్‌బోర్డులు ఏర్పాటు చేశాం. 

స్వచ్ఛమైన నీటినే అందిస్తాం

వానా కాలం విద్యార్థులకు కలుషిత మంచినీటిని కాకుండా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాం. పాఠశాలల్లో ఆర్‌వో ప్లాంట్‌లు ఉన్నాయి. ఈ నీటినే విద్యార్థులు తాగటానికి వినియోగిస్తారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేస్తున్నాం. కొన్ని పాఠశాలల్లో ఏజెన్సీలు నిర్వహించగా మరికొన్ని పాఠశాలల్లో అక్షయ పాత్ర వారు సరఫరా చేస్తున్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు