logo

కాపాడాల్సిన వారే.. కట్టుతప్పుతున్నారు

రక్షణ కల్పించాల్సిన కొందరు రక్షకభటులు అక్రమాలకు చిరునామాగా మారుతున్నారు. ఫిర్యాదు అందగానే సమాచారం బయటకు లీక్‌ చేసి నిందితులు తప్పించుకునేందుకు సహకరిస్తున్నారు.

Updated : 12 Jun 2024 05:05 IST

ఫిర్యాదుఅందగానే నిందితులకు సమాచారం
నగరంలో వెలుగుచూస్తున్న లాఠీ అక్రమాలు
ఈనాడు, హైదరాబాద్‌, గోషామహల్, న్యూస్‌టుడే

క్షణ కల్పించాల్సిన కొందరు రక్షకభటులు అక్రమాలకు చిరునామాగా మారుతున్నారు. ఫిర్యాదు అందగానే సమాచారం బయటకు లీక్‌ చేసి నిందితులు తప్పించుకునేందుకు సహకరిస్తున్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుముఠాలకూ ముందస్తు లీకులిచ్చి పోలీసుశాఖకే మాయని మచ్చగా మారుతున్నారు. 

ఇప్పుడేం జరుగుతుందంటే..: పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి.. నిందితులకు నోటీసులు జారీచేస్తారు. మామూలు కేసులైతే తేలికగా తీసుకుంటారు. అదే సివిల్‌ తగాదాలు, ఆర్థికనేరాలు, డ్రగ్స్‌కు సంబంధించినవి అయితే కొందరు పోలీసులు   నిందితులకు ముందుగానే సమాచారం ఇస్తున్నారు. గత ఏడాది సీసీఎస్‌లో ఇద్దరు ఏసీపీలు ఆర్ధిక నేరస్థులకు సహకరించినట్టు ఇటీవల అంతర్గత విచారణలో బయటపడింది.  ఇటీవల నగరంలో  పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి చేసే సమయంలో  ఒక వ్యక్తి పారిపోతూ భవనంపై నుంచి పడి మరణించాడు. పోలీసులు వస్తున్నట్లు ముందుగానే తెలిసి కొందరు తప్పించుకున్నారు.ఆకస్మికంగా తనిఖీ  విషయం ఎలా లీకైందనేది ప్రశ్నార్ధకంగా మారింది. 

ఇవిగో తాజా ఘటనలు

ఇటీవల దూల్‌పేట్‌ పరిధిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అసలు నిందితుడు తప్పించుకోగా.. అనుచరులు పట్టుబడ్డారు. పోలీసులు గుర్తించేందుకు ఓ వ్యక్తి సహకరించాడంటూ అజ్ఞాతవ్యక్తి ప్రధాన నిందితుడికి సమాచారం చేరవేశాడు. దీంతో కక్షగట్టిన అతడి ముఠా సభ్యులు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఇంటిపై దాడి జరిపి.. మారణాయుధాలతో హత్యాయత్నం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి బాధ్యుడు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ అని నిర్థారణకు వచ్చినట్టు సమాచారం. బేగం బజార్‌లో కొద్దిరోజుల క్రితం   అక్రమంగా తరలిస్తున్న గుట్కా వాహనాల సమాచారం పోలీసులకు చేరింది. తనిఖీల కోసం అక్కడకు వెళ్లేలోపు ఖాళీ వాహనాలు దర్శనమిచ్చాయి. తనిఖీ విషయం ఎలా తెలిసిందన్న దానిపై అంతర్గత   విచారణ సాగుతున్నట్లు సమాచారం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు