logo

అక్రమార్కులతో అధికారుల జట్టు

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో ప్రణాళిక విభాగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెచ్‌ఎండీఏలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల్లో కీలకమైన ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాళన చేయడంతోపాటు బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది.

Updated : 13 Jun 2024 04:57 IST

 కట్టడికి హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగంపై ప్రత్యేక దృష్టి 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో ప్రణాళిక విభాగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెచ్‌ఎండీఏలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల్లో కీలకమైన ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాళన చేయడంతోపాటు బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా 2003 తర్వాత ప్రణాళిక విభాగానికి సంబంధించి కొత్త నియామకాలు లేవు. 20 ఏళ్లలో పనిభారం భారీగాపెరిగింది. ఇప్పటికే చాలామంది అధికారులు పదవీ విరమణ చేశారు. అప్పట్లో 44 మంది జూనియర్‌ ప్లానింగ్‌ అధికారులు (జేపీవోలు) ఉండగా.. వారంతా సహాయ ప్లానింగ్‌ అధికారులు, ప్లానింగ్‌ అధికారులుగా పదోన్నతులపై వెళ్లిపోయారు. కొత్తగా పోస్టులు లేకపోవడంతో ప్రస్తుతం జేపీవోల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో జేపీవోల పని కూడా ఏపీవోలు చేస్తున్నారు. ఇక ప్లానింగ్‌ అధికారులు(పీవో) పది మంది వరకు ఉన్నారు. పెరిగిన ఏరియా, పనిని దృష్టిలో పెట్టుకుంటే అదనంగా మరో 30 మంది పీవోల సేవలు అవసరం ఉంది. ఇక సహాయ ప్లానింగ్‌ అధికారులు (ఏపీవోలు) 22 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. పెరిగిన పనిభారం దృష్ట్యా కొత్తగా మరో 80 మంది వరకు నియమించాల్సి ఉంది. జేపీవో పోస్టులకు సంబంధించి ప్రభుత్వం 44 మందిని తీసుకోగా.. వారిలో ఇప్పుడు ఒక్కరు కూడా ఆ పోస్టులో లేరు. దీంతో కొత్తగా 150 మందిపైనే జేపీవోల నియామకాలు జరపాల్సిన అవసరముంది. ప్రణాళిక విభాగంలో ఈ ఖాళీలను అవుట్‌సోర్సింగ్‌ లేదా కాంట్రాక్టు పద్ధతిలో నింపేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. 

పని భారం సాకుగా చూపి..

హెచ్‌ఎండీఏ పరిధిలో జోన్ల పెంపుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 4 జోన్లను 8 లేదా 16 వరకు పెంచాలా...లేదంటే 8కి పరిమితం చేయాలా అన్నది పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మేడ్చల్, ఘట్‌కేసర్, శంషాబాద్, శంకరపల్లి జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్‌ పరిధి 2000 చదరపు కిలోమీటర్ల వరకు ఉండటంతో వివిధ రకాల అనుమతులు కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు  కొంతమంది అధికారులు విచ్చలవిడిగా అక్రమాలకు తెర తీస్తున్నారు. ఉదాహరణకు 5 అంతస్తులకు అంతకుమించి అంతస్తుల భవనానికి అనుమతులు కావాలంటే తక్కువలో తక్కువ ప్రతి ఫ్లోర్‌కు రూ.లక్ష సమర్పించుకోవాల్సిందేనని ఓ దరఖాస్తుదారుడు వాపోయాడు. పది ఎకరాల లేఅవుట్‌కు అనుమతులు జారీ చేయాలంటే ఏరియాను బట్టి వసూళ్ల దందా ఉంటోందని మరో దరఖాస్తుదారుడు తెలిపాడు. కన్సల్టెన్సీల ద్వారా వెళ్లే దరఖాస్తులకు త్వరలో మోక్షం లభిస్తోందని ఘట్‌కేసర్‌కు చెందిన మరో దరఖాస్తుదారుడు చెప్పారు. నేరుగా వెళితే ఏదో ఒక కొర్రీ పెట్టి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారన్నది పలువురు దరఖాస్తుదారుల ఆవేదన.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని