logo

దూకుడు తగ్గేదెలా !

రవాణాశాఖ నిబంధనల ప్రకారం..డ్రై వింగ్‌ లైసెన్సు పొందలేని మైనర్లు వాహనాలను నడపొద్దు.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసినా పిల్లలకు వాహనాలు ఇవ్వడంతో దూకుడుగా వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు

Updated : 13 Jun 2024 04:56 IST

ప్రాణాలమీదకొస్తున్న చిన్నారుల డ్రైవింగ్‌
తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం

రవాణాశాఖ నిబంధనల ప్రకారం..డ్రై వింగ్‌ లైసెన్సు పొందలేని మైనర్లు వాహనాలను నడపొద్దు.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసినా పిల్లలకు వాహనాలు ఇవ్వడంతో దూకుడుగా వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు అర్థంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా వందల సంఖ్యలో మైనర్లు డ్రైవింగ్‌ చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. సైబరాబాద్, రాచకొండతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది తొలి ఐదునెలల్లోనే ఇక్కడ 1,150 మంది మైనర్లు పోలీసులకు చిక్కారు. మిగిలిన రెండు కమిషనరేట్లలోనూ వందల సంఖ్యలో రికార్డయ్యాయి.

తల్లిదండ్రుల నిర్లక్ష్యంపిల్లలపై గారాబం.. వారు వయసుకు మించిన పనులు చేస్తున్నా తల్లిదండ్రులు అడ్డుచెప్పకపోవడం మైనర్ల డ్రైవింగ్‌కు ప్రధాన కారణం. కొద్ది దూరమే వెళ్లొస్తారని భావిస్తూ వాహనాలు అప్పగిస్తున్నారు. కొందరు పెద్దలు పిల్లలకు 13- 14 ఏళ్లు దాటితే చాలు డ్రైవింగ్‌  నేర్పిస్తున్నారు.  సొంతంగా నడుపుతూ పిల్లలు చేసే చిన్నపాటి తప్పిదాలతో రోడ్డు ప్రమాదాల బారినపడడం.. లేదా ఇతరుల ప్రాణాల మీదకు వస్తోంది.

  •  గతేడాది చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో స్నేహితులతో కలిసి కారులో దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న యువకుడు, రోడ్డు పక్కనే ఉన్న చిన్నషెడ్డును ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో వాహనం నడిపిన యువకుడికి లైసెన్సు లేదు.
  •  ఇటీవల మెహిదీపట్నంలో తెల్లవారుజామునే ఒక తండ్రి తన 15 ఏళ్ల కుమారుడికి వాహనమిచ్చి వెనుక కూర్చున్నాడు. కొద్దిదూరం వెళ్లాక వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. రెండ్రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తండ్రి మరణించాడు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ః ఏప్రిల్‌ చివరివారంలో హయత్‌నగర్‌కు చెందిన నలుగురు యువకులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో కారు తీసుకుని సంఘీనగర్‌కు వెళ్లారు. 18 ఏళ్ల యువకుడు  నడుపుతుండగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఘటనలో ఇద్దరు మరణించారు. 

నిబంధనలు

ఇవీ: మైనర్లు వాహనం నడపడం నేరం. పట్టుబడితే వాహనం ఇచ్చిన యజమాని/వ్యక్తి మీద  చర్యలుంటాయి. పోలీసులు తరచూ ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతూ చర్యలు తీసుకుంటున్నా ఈ ఒరవడికి అడ్డుకట్ట పడటం లేదు. 
ఈనాడు- హైదరాబాద్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని