logo

శివార్లలో ధార్‌ గ్యాంగ్‌.. పోలీసుల అలర్ట్‌

నగర శివార్లలో ధార్‌ గ్యాంగ్‌ కదలికల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకేసారి ఎక్కువ ఇళ్లలో దోపిడీలతో దడ పుట్టించే ఈ ముఠా శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో రాత్రిపూట పెట్రోలింగ్‌ పెంచాలని నిర్ణయించారు. ‘

Published : 13 Jun 2024 02:30 IST

రాత్రిపూట తలుపుకొడితే తీయొద్దని హెచ్చరికలు

ఈనాడు- హైదరాబాద్‌: నగర శివార్లలో ధార్‌ గ్యాంగ్‌ కదలికల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకేసారి ఎక్కువ ఇళ్లలో దోపిడీలతో దడ పుట్టించే ఈ ముఠా శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో రాత్రిపూట పెట్రోలింగ్‌ పెంచాలని నిర్ణయించారు. ‘‘మంగళవారం రాత్రి హయత్‌నగర్‌ ఠాణా పరిధి శివారులోని కొన్ని ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యులు సంచరించినట్లు సమాచారం అందింది. ప్రధానంగా రాత్రిళ్లు నగరానికి దూరంగా విసిరేసినట్లు ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడతాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు ఐదుగురు అంతకుమించి ఒక ముఠాగా ఏర్పడతారు. వీరు పగటిపూట లాడ్జీల్లో తాత్కాలికంగా ఉంటూ.. ఆటోల్లో తిరుగుతూ కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి ప్రహరీలు దూకి లోపలికి ప్రవేశించి.. ఇంటి ప్రధాన ద్వారం తడతారు. తలుపు తీయగానే ఒక్కసారిగా దాడి చేస్తూ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అవసరమైతే చంపేందుకు వెనుకాడరు’’ అని పేర్కొన్నారు. ఈ ముఠా విలువైన వస్తువులు, నగదు అందినకాడికి దోచుకుని వెళ్తుందని.. రాత్రిపూట ఎవరైనా తలుపుతడితే, ఎవరో తెలుసుకున్న తర్వాతే తెరవాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రిపూట కాలనీలు, ఇంటి సమీపంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని, కాలనీవాసులు అప్రమత్తమవ్వాలని హెచ్చరిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని