logo

వెలుగుల మాటున చేతి వాటం

విద్యుత్తు కనెక్షన్ల జారీ, పాడైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, లైన్‌ క్లియర్‌ అనుమతి, సీటీబీటీ మీటర్లకు సీల్‌ వేయడం..ఇలా ప్రతిదాంట్లో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, ఇంజినీర్లు బహిరంగంగానే వసూళ్లకు తెగబడుతున్నారు.

Updated : 13 Jun 2024 04:02 IST

ఎల్‌సీకి, ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడికి వసూళ్లు  

యూడీసీలో ఉన్నా మాయ చేసి కొత్త కనెక్షన్ల జారీ

ప్యానల్‌ బోర్డు లేకుండా బిగించిన మీటర్లు 

ఈనాడు, హైదరాబాద్‌ : విద్యుత్తు కనెక్షన్ల జారీ, పాడైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, లైన్‌ క్లియర్‌ అనుమతి, సీటీబీటీ మీటర్లకు సీల్‌ వేయడం..ఇలా ప్రతిదాంట్లో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, ఇంజినీర్లు బహిరంగంగానే వసూళ్లకు తెగబడుతున్నారు.

పాత మీటర్లు ఉండగానే...  జీడిమెట్ల, షాపూర్‌నగర్‌ పరిధిలోని డీపీపల్లి, ప్రగతినగర్, బాచుపల్లి సెక్షన్ల పరిధిలో విద్యుత్తు బిల్లులు కట్టక చాలా కనెక్షన్లను డిస్‌కనెక్ట్‌ (యూడీఎస్‌) చేశారు. చాలా ఏళ్లుగా వాటి బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. వీటిని కప్పిపెట్టి బై నంబర్లతో, ఆస్తులు అమ్మితే కొత్తగా కొన్నవారి పేరుతో కనెక్షన్లు ఇస్తున్నారు. అసలు ఎస్టిమేషన్‌ లేకుండానే కొత్త కనెక్షన్లు ఇస్తూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నాలుగు మీటర్లు దాటితే ప్యానల్‌బోర్డు ఉండాలని నిబంధనలు చెబుతున్నా.. కొందరి ఇళ్లలో ఆరు, ఎనిమిది, తొమ్మిది కనెక్షన్లు కనిపిస్తున్నాయి.
ఎల్‌సీ ఇచ్చేందుకు..  విద్యుత్తు అంతరాయాలపై ఎక్కువ ఆరోపణలు రావడంతో మరమ్మతులు చేపట్టేందుకు ముందస్తు అనుమతి లైన్‌క్లియర్‌(ఎల్‌సీ) విధానంపై డిస్కం యాజమాన్యం ఆంక్షలు పెట్టింది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు పారిశ్రామికవాడల్లో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. జీడిమెట్ల ఎస్‌ఎస్‌ పరిధిలో పాడైన ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో మరమ్మతులు చేసేందుకు, కొత్తవాటిని బిగించేందుకు ఇటీవల ఒక కంపెనీ నుంచి రూ.70వేలు, మరో సంస్థ నుంచి 40వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొమ్ములు ముట్టేదాకా ఎల్‌సీ ఇవ్వకపోడంతో కొద్దిరోజుల పాటూ సంస్థ కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తాయి.

సీటీబీటీ మీటర్ల  సీల్‌ వేసేందుకు.. 

పారిశ్రామిక వాడల్లో హెచ్‌టీ కనెక్షన్లకు డిమాండ్‌ ఉంటుంది. సీటీబీటీ మీటర్‌ ద్వారా వీటి రీడింగ్‌ను నమోదు చేస్తారు. మీటర్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడకుండా సీల్‌ వేయాల్సిన బాధ్యత ఎంఆర్‌టీది. ఈ సీల్‌ వేసేందుకు కూడా కొందరు ఇంజినీర్లు రూ.నాలుగైదు వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. సొమ్ములు ఇస్తేనే వచ్చి సీల్‌ వేస్తున్నారు. ఈ తరహా కనెక్షన్‌ కోసం ప్రతి దశలో చేతులు తడపాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రతి డివిజన్‌లోనూ ఇదే పరిస్థితి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని