logo

శివారులన్నీ బల్దియాలోకి

హైదరాబాద్‌ శివారులోని ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు

Updated : 13 Jun 2024 04:58 IST

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి కసరత్తు

 అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీలపై మూడు నెలల క్రితం సమీక్ష నిర్వహించినప్పుడు బాహ్యవలయ రహదారికి లోపలున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలంటూ ఆదేశించారు. మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా జలమండలి నిర్వహిస్తున్న తీరుగా జీహెచ్‌ఎంసీ పౌరసేవలను కొనసాగించేందుకు అవకాశాలుంటాయని చెప్పడంతో రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు సాధ్యాసాధ్యాలను ఆలోచించారు. సమాచారం సేకరిస్తుండగా... లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో తాత్కాలికంగా పక్కనపెట్టేశారు.

కొన్ని మున్సిపాలిటీలకే ఆదాయం... 

జీహెచ్‌ఎంసీ పరిధి దాటిన వెంటనే ఉన్న శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్నింటికి మాత్రమే ఆదాయం లభిస్తోంది. మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలు, బండ్లగూడ జాగీర్, జవహర్‌నగర్‌ కార్పొరేషన్లు మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. తుర్కయంజాల్, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, నాగారం, పోచారం, శంషాబాద్‌ మున్సిపాలిటీలతో పాటు బోడుప్పల్‌ పిర్జాదీగూడ, మీర్‌పేట్, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్లు నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని మున్సిపాలిటీలు వీధిదీపాల బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పేరుకు నగర పాలక సంస్థలైన పిర్జాదీగూడ, బోడుప్పల్, మీర్‌పేట్, బడంగ్‌పేట్‌లలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటోంది. ఇరుకైన రహదారులతో తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజాంపేట్‌ కార్పొరేషన్‌ చూసేందుకు బాగానే ఉన్నా... సరైన మురుగునీటి వ్యవస్థ లేదు. వీధిదీపాలూ వెలగవు. పార్కులు ఏర్పాటు చేసినా నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. రహదారులు సక్రమంగా లేవని తుక్కుగూడ, ఆదిభట్ల, శంషాబాద్‌ మున్సిపాలిటీలు, బండ్లగూడజాగీర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్‌ల్లోని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

జోనల్, సర్కిల్‌ కార్యాలయాల్లో..

  • శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయాలు, సర్కిల్‌ కార్యాలయాల్లో విలీనం చేయాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ః కుత్బుల్లాపూర్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి దుండిగల్, కొంపల్లి, మేడ్చల్‌ మున్సిపాలిటీలు, అల్వాల్‌ సర్కిల్‌లో తూంకుంట మున్సిపాలిటీ, జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ను విలీనం చేయాలనుకుంటున్నారు
  • శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయంలో నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలను విలీనం చేయడంతో పాటు మణికొండ లేదా నార్సింగిలో సర్కిల్‌ కార్యాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచన చేస్తున్నారు. 
  • ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి పిర్జాదీగూడ, బోడుప్పల్‌ కార్పొరేషన్లు, పోచారం మున్సిపాలిటీలను విలీనం చేయనున్నారు. పోచారం లేదా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో సర్కిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.  
  • పెద్దఅంబర్‌పేట్, తుర్కయంజాల్, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు, బడంగ్‌పేట్, మీర్‌పేట్‌ కార్పొరేషన్లను ఎల్బీనగర్‌ జోనల్‌ పరిధిలో కలిపేందుకు నిర్ణయించారు. పెద్ద అంబర్‌పేట లేదా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సర్కిల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. 
  • జల్‌పల్లి, శంషాబాద్, తుక్కుగూడ మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్‌లో విలీనం చేయడంపై సమాలోచన చేస్తున్నారు. వీటితోపాటు బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ను విలీనం చేయనున్నారు.   
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని