logo

వ్యాయామ అధ్యాపకులు.. ఒక్కరూ లేరు!

క్రీడలు మానసిక, శారీరక ద్రుఢత్వానికి దోహదపడతాయని పలు సందర్భాల్లో నేతలు వల్లె వేస్తుంటారు. కళాశాలలో, పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న వారు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచిస్తుంటారు.

Published : 14 Jun 2024 01:45 IST

కళాశాల విద్యార్థులకు క్రీడా నైపుణ్యం కరవేనా..

ఇలా శిక్షణ నేర్పే వారు అవసరం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్, పరిగి: క్రీడలు మానసిక, శారీరక ద్రుఢత్వానికి దోహదపడతాయని పలు సందర్భాల్లో నేతలు వల్లె వేస్తుంటారు. కళాశాలలో, పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న వారు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచిస్తుంటారు. వారు చెప్పిన విధంగా విద్యార్థులు క్రీడలను నేర్చుకోవాలనుకుంటే కళాశాలల్లో ఏ మాత్రం ప్రోత్సాహం లేకుండా పోతోంది. ఇందుకు ప్రధాన కారణం.. వ్యాయామ అధ్యాపకుల కొరత. జిల్లాలో ఏ ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీని తీసుకున్నా వీరి నియామకాలు లేవు. దీంతో ఉత్సాహం ఉన్నా విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దే పరిస్థితి లేకుండా పోతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కనీసం ఈ ఏడాదైనా వీరి నియామకానికి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కొత్తగా మూడు కళాశాలల రాక

జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి మరో 3 కళాశాలలు బొంరాస్‌పేట, బషీరాబాద్, దౌల్తాబాద్‌లో ప్రారంభిస్తున్నారు. దీంతో 12 కళాశాలలవుతాయి. వీటిలో ఒక్కరంటే ఒక్కరు కూడా వ్యాయామ అధ్యాపకులు (పీడీ) లేరు. ప్రభుత్వం దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒప్పంద ఉపన్యాసకులుగా పని చేసిన వారిని క్రమబద్ధీకరించింది. వ్యాయామ అధ్యాపకులుగా మాత్రం ఎవరినీ నియమించలేదు.

16 వేలకు పైగా విద్యార్థులు

జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి 12 వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న వారు 4 వేలకుపైనే ఉంటారు. ప్రైవేట్, గురుకులాల్లో వ్యాయమ అధ్యాపకులు అన్ని చోట్ల ఉండగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

రిజర్వేషన్ల కోటా కోల్పోతున్నారు

క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక కోటాను అమలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన విద్యార్థులకు రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. చదువుకు ఇది అదనపు అర్హతగా గుర్తిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇలాంటి అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తోంది. కళాశాలలకు గతంలో క్రీడా సామగ్రిని పంపిణి చేశారు. ఆడించేవారు లేకపోవటంతో అవి మూలకు పడిపోయాయి.

ఇన్‌ఛార్జిలతో కొనసాగిస్తున్నాం :

శంకర్‌నాయక్, జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి

జిల్లాలో పదో తరగతి వరకు ఏదో రకంగా క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వ్యాయమ అధ్యాపకులు లేరు. ఉపన్యాసకులే ఇన్‌ఛార్జి బాధ్యతలను తీసుకుని క్రీడలను నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. వ్యాయామ  అధ్యాపకులను నియమిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

జిల్లాలోని మొత్తం జూనియర్‌ కళాశాలలు: 77
ప్రైవేట్‌ : 41
ప్రభుత్వ : 12
ఆదర్శ : 9
కస్తూర్బా: 8
గురుకుల: 7 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని