logo

మాటు వేస్తున్నాయి.. దాడి చేస్తున్నాయి

దామగుండం అటవీ ప్రాంతంలో మూగ జీవాలు శునకాల దాడిలో తీవ్ర గాయాల పాలవుతున్నాయి. కొన్ని మృత్యువాత పడుతున్నాయి. వీటిలో ప్రధానంగా జింకలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Published : 14 Jun 2024 01:48 IST

శునకాల దెబ్బకు జింకల మృత్యువాత

కండ్లపల్లి అటవీ ప్రాంతం

న్యూస్‌టుడే, పూడూరు: దామగుండం అటవీ ప్రాంతంలో మూగ జీవాలు శునకాల దాడిలో తీవ్ర గాయాల పాలవుతున్నాయి. కొన్ని మృత్యువాత పడుతున్నాయి. వీటిలో ప్రధానంగా జింకలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నివారణ చర్యలు చేపట్టక పోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.  

నీరు తాగేందుకు వచ్చి.. తప్పించుకోలేక 

పూడూరు మండల కేంద్రానికి సమీపంలో తిప్పాపూర్, దామగుండం, కండ్లపల్లి, మీర్జాపూర్‌ గ్రామాల శివారులో సుమారు 3,000 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో జింకలు, లేళ్లు, కుందేళ్లు, అడవి పందులు, మన్నుబోతులు వంటి అనేక రకాల అడవి జంతువులున్నాయి.  

దామగుండం రామలింగేశ్వర సామి ఆలయ సమీపంలో ప్రధాన కొలను   అన్ని కాలాల్లోనూ నీటితో నిండుగా ఉంటుంది. జింకలు నీళ్లు తాగేందుకు వస్తుంటాయి. ఇదే అదనుగా మాటువేస్తున్న శునకాల గుంపు వీటిపై దాడికి పాల్పడుతున్నాయి. మగ జింకలే ఎక్కువగా కుక్కలకు బలవుతున్నాయి. మగ జింకల కొమ్ములు ఏపుగా పొడవుగా ఉండటంతో తప్పించుకునే క్రమంలో చెట్ల పొదల కొమ్మలకు తగిలి ఇరుక్కోవటంతో పరుగెత్తలేక శునకాలకు చికి బలైపోతున్నాయి.  

నియంత్రణ కేంద్రం ఉన్నా నిరుపయోగం.. 

కుక్కల సంతానాన్ని తగ్గించేందుకు వికారాబాద్‌ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శివారెడ్డిపేటలో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శునకాల బెడద ఎక్కువగా ఉందని సమాచారం ఇస్తే మున్సిపల్‌ సిబ్బంది కుక్కలను పట్టుకుని కేంద్రానికి తీసుకురావాల్సి ఉంది. ఆడ, మగ జాతి వాటికి వర్తిస్తుంది. కానీ కొంత కాలంగా అలా సాగటం లేదు.

ఇవిగో ఉదాహరణలు 

  • దామగుండం అటవి ప్రాంతంలో ఈనెల 12న గాయపడిన జింకను పశువుల కాపరులు గుర్తించి ఫారెస్టు సిబ్బందికి తెలిపారు. వారు తీసుకు వెళ్లి చికిత్స చేయించినా బతకలేదు. కుక్కుల దాడిలో గాయపడి మృత్యువాత పడిందని అధికారులు తెలిపారు.
  • మే నెలలో అనంతగిరి అడవిలో ఓ జింకను కుక్కలు దాడిచేసి చంపేశాయి. పర్యాటకులు చూసి ఫొటోలు తీయటంతో విషయం బయటకు వచ్చింది.
  • గత ఏడాది ఏప్రిల్‌లో దామగుండంలో జింక మృతి చెందటాన్ని స్థానికులు గుర్తించి పరిశీలించగా కుక్కలు కొరికిన గాయాలు కనిపించాయి.
  • అదే ఏడాది దామగుండం ఆలయ సమీపంలో ఓ జింకపిల్ల పడి ఉండటాన్ని పశువుల కాపరులు చూసి స్థానికులు చెప్పారు. ఇదీ కుక్కల పనేనని గుర్తించారు.

అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం

దామగుండం అటవీ ప్రాంతంలో కుక్కల సంచారం అరికట్టేందుకు దృష్టిసారిస్తున్నాం. వికారాబాద్‌లోని మున్సిపల్‌ అధికారులకు ఇప్పటికే లిఖిత పూర్వకంగా వినతిపత్రం అందించాం. మరోసారి పై అధికారుల దృష్టికి తీసుకువవెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం.

- వీరబాబు, అటవీ పర్యవేక్షకుడు, పూడూరు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని