logo

శుభకార్యానికి వెళ్తూ.. ఇద్దరి దుర్మరణం

శుభకార్యానికి ఆటోలో వెళ్తూ మార్గ మధ్యన ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ ఢీ కొనడంతో ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందికి గాయాలైన సంఘటన వికారాబాద్‌ మండలంలోని చించల్‌పేట గేటు సమీపంలో గురువారం జరిగింది.

Updated : 14 Jun 2024 05:10 IST

మరో  12 మందికి గాయాలు

ప్రమాద స్థలంలో గుమిగూడిన వాహనదారులు

వికారాబాద్, న్యూస్‌టుడే: శుభకార్యానికి ఆటోలో వెళ్తూ మార్గ మధ్యన ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ ఢీ కొనడంతో ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందికి గాయాలైన సంఘటన వికారాబాద్‌ మండలంలోని చించల్‌పేట గేటు సమీపంలో గురువారం జరిగింది. వికారాబాద్‌ సీఐ నాగరాజు తెలిపిన వివరాలు.. నవాబుపేట మండలం ఎల్లకొండకు చెందిన కుటుంబ సభ్యులు సాయంత్రం ఆటోలో వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని మద్గుల్‌చిట్టెంపల్లికి ఓ శుభకార్యానికి వెళ్తున్నారు. మార్గ మధ్యన చించల్‌పేట గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ చోదకుడు అజాగ్రత్తగా నడుపుతూ ఆటోను ఢీ కొన్నాడు. దీంతో ఆటోలో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. గొల్లగూడకు చెందిన కిష్టయ్య (60) అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రుల హాహాకారాలు చేయగా, ఆ దారి మీదుగా ప్రయాణించే వాహనదారులు ఆటోల్లో కొందరిని, 108లో మరికొంత మందిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బిచ్చమ్మ(53) మృతి చెందింది. ఆటో చోదకుడు ఎం.డి.షాకీర్‌తో పాటు సత్యమ్మ, అంతయ్య, రాంచంద్రయ్యలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి, జంగయ్య, కిష్టయ్య, పుష్పమ్మ, రత్నమ్మ, నర్సిములు, చంద్రమ్మ, పార్వతమ్మలు గాయాలతో వికారాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ నాగరాజులు ఆస్పత్రికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

పరిమితికి మించి ప్రయాణించడమే కారణమా..

ఏడు సీట్ల ఆటోలో పరిమితికి మించి 14 మంది ప్రయాణించడంతోనే ఇద్దరు మృతి చెందడం, 12 మంది గాయాల బారిన పడటం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రయాణించిన వారిలో అధికంగా ఒకే  కుటుంబ సభ్యులు, సమీప బంధువులే ఉన్నారు. శుభకార్యానికి రెండు ఆటోల్లో వెళ్లుంటే అంతటి ప్రమాదానికి గురయ్యేవారు కాదని పలువురు అన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలి వచ్చారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని