logo

సమీకృతం అసంపూర్ణం.. సమస్యలు నిత్యకృత్యం

తాజా కూరగాయలతో పాటు జిల్లా వినియోగదారులకు మాంసం, పాలు, పండ్లు ఒకే చోట విక్రయించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు.

Published : 14 Jun 2024 01:53 IST

రోడ్లపై విక్రయాలతో రాకపోకలకు ఇక్కట్లు

కొడంగల్‌లో ఇలా..  

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్, కొడంగల్, తాండూరు: తాజా కూరగాయలతో పాటు జిల్లా వినియోగదారులకు మాంసం, పాలు, పండ్లు ఒకే చోట విక్రయించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన సమీకృత మార్కెట్ల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. నిధుల కొరత, ప్రభుత్వం మారడంతో పట్టించుకునే వారే లేకపోయారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగిసింది కాబటి ప్రభుత్వం వీటి పూర్తికి చొరవ చూపాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ‘న్యూస్‌టుడే’ కథనం.

నియోజకవర్గానికి ఒకటి.. రెండేళ్ల క్రితమే శ్రీకారం: జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్‌ ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెండేళ్ల క్రితం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆశయం మంచిదే అయినా పనులు అసంపూర్తిగా ఉండటంతో ఇటు వినియోగదారులకు అటు విక్రయదారులకు అవస్థలు తప్పడం లేదు. పలుచోట్ల ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో విక్రయాలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో దుకాణాలు నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు లేకపోయారు. కొన్నిచోట్ల నిర్మాణ పనుల్లోనూ నాణ్యత లోపించింది. పక్కాగా చేపట్టి పూర్తిచేసే విధంగా చూడాలని ఆయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు.

నాణ్యత నవ్వుల పాలు

కొడంగల్‌లో రూ.3.5కోట్లతో చేపట్టిన మార్కెట్‌ సముదాయం నిర్మాణ పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పుర ఉన్నతాధికారిణి హరిచందన పరిశీలించి గుత్తేదారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పనులు నిలిపివేయాలని ఆదేశించడంతో బ్రేక్‌ పడింది. 

రైతులకు, వాహనదారులకు పాట్లు 

పరిగిలో 2022 జూన్‌ 18న రూ.4.25కోట్ల అంచనా వ్యయంతో పరిగిలో అప్పటి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. రెండంతస్థుల వరకు శ్లాబు పనులు పూర్తిచేసి వదిలేశారు. గతంలో అక్కడే కూరగాయల మార్కెట్‌ జరిగేది. పనులు ప్రారంభించడంతో స్థలా భావం కారణంగా మార్కెట్‌ యార్డు, ప్రధాన రహదారిపైకి మారింది. దీంతో వ్యవసాయ విపణిలో రైతులకు, గంజ్‌రోడ్డులో వాహన చోదకులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సమీకృత మార్కెట్‌ పూర్తయితే కనీసం 40దుకాణాలకు అవకాశం లభిస్తుంది.

పిల్లర్ల స్థాయి దాటడంలేదు

జిల్లా కేంద్రంలో రూ.7.2కోట్ల వ్యయంతో 108 దుకాణాలను చేపట్టి పేదలకు ఇవ్వాలని తలపెట్టారు. పనులు మాత్రం పిల్లర్ల స్థాయి దాటి కదలడంలేదు.  లక్ష్యం ఏడాదిలోపే పూర్తిచేయాలని పెట్టుకున్నా నాలుగేళ్లయినా అతీగతీ లేకుండా పోయింది.

తాండూరులోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రూ.7.2కోట్ల అంచనాతో చేపట్టినా పునాదులు కూడా దాటకపోవడంతో నిర్మాణ పనుల పట్ల అనుమానం వ్యక్తమవుతోంది. వాణిజ్య పరంగా ఎదుగుతున్నా సదుపాయాల కల్పనలో మున్సిపాలిటీ వెనుకబడిపోతోంది. దీంతో రైతులు, చిరు వ్యాపారులు రోడ్లపైనే విక్రయించక తప్పడం లేదు.

సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తాం

స్థానికంగా ఉన్న సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అదనపు నిధులు విడుదలయ్యే విధంగా కోరుతాం. వినియోగదారులకు ఉపయోగపడే విధంగా తొందరలో అందబాటులోకి తెచ్చే విధంగా చూస్తాం. 

- వెంకటయ్య, కమిషనర్, పరిగి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని