logo

వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నారు

కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత, ఉపగ్రహాల సాయంతో ప్రజల వ్యక్తిగత గోప్యతను అమెరికన్‌ కార్పొరేట్‌ సంస్థలు హరిస్తున్నాయని, మానవ మెదడును తమ నియంత్రణలోకి తీసుకుని ప్రజల కోరికలు, సంకల్పాన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాయని వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందని టార్గెటెడ్‌ ఇండివిజువల్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు.

Published : 14 Jun 2024 02:00 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత, ఉపగ్రహాల సాయంతో ప్రజల వ్యక్తిగత గోప్యతను అమెరికన్‌ కార్పొరేట్‌ సంస్థలు హరిస్తున్నాయని, మానవ మెదడును తమ నియంత్రణలోకి తీసుకుని ప్రజల కోరికలు, సంకల్పాన్నీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాయని వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందని టార్గెటెడ్‌ ఇండివిజువల్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ వికృత చేష్టలను వ్యతిరేకిస్తూ ఆ సంస్థకు చెందిన రావి తరుణ్, వివేక్‌ జోసెఫ్, రాఘవ, అంకిత్‌ రాజ్‌గోయల్‌ గురువారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు యత్నించారు. వారిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. 
వారు మీడియాతో మాట్లాడుతూ.. తాము ఈ విషయంపై కార్యాలయ అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించేందుకు యత్నించామని తెలిపారు. ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లే భారతీయ పౌరులను న్యూరోవెపన్స్‌ (నాడీ నియంత్రణ ఆయుధాలు)లు ఉపయోగించి అమెరికన్‌ నిఘా సంస్థలు వేధిస్తున్నాయని అన్నారు. వీటిద్వారా వివిధ సమూహాలు ఏం ఆలోచిస్తున్నాయో తెలుసుకునేందుకు, వారి వ్యక్తిగత గోప్యతను హరించేందుకు ప్రయోగాలు చేస్తున్నారని చెప్పారు. తొలుత అమెరికన్‌ నిఘా విభాగాలను ప్రజలపై నిఘా ఉంచేందుకు వాడేవారని, ఇపుడు కార్పొరేట్‌ సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయన్నారు. వారి మెదడును తమ నియంత్రణలోకి తీసుకుని ప్రజల ఆలోచనలనూ ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. ఈ క్రమంలో ప్రజలు తమకు కావాల్సిన వినియోగ వస్తువులను కోరుకుంటారని, కార్పొరేట్‌ శక్తులు మాత్రం ప్రజల మస్తిష్కాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కార్పొరేట్‌ ఉత్పత్తులను కోరుకునేలా ప్రోగ్రామింగ్‌ చేస్తారని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని