logo

బంతి పడకుండానే.. రూ.కోట్లు ఔట్‌

క్రికెట్‌ ఆటలో బంతి పడితేనే బ్యాట్స్‌మెట్‌ ఔట్‌ అవుతాడు.. కానీ జీహెచ్‌ఎంసీలో బంతి పడకుండానే రూ.కోట్లు ఔట్‌ అయిపోతున్నాయి. ఏటా ఇదే వ్యవహారం సాగుతున్నా చూడీచూడనట్టు వదిలేస్తున్నారు.

Updated : 14 Jun 2024 05:05 IST

ఏటా కోట్లతో సామగ్రి కొనుగోలు
ఏడాది గడిచే సరికి అన్నీ మాయం

క్రికెట్‌ ఆటలో బంతి పడితేనే బ్యాట్స్‌మెట్‌ ఔట్‌ అవుతాడు.. కానీ జీహెచ్‌ఎంసీలో బంతి పడకుండానే రూ.కోట్లు ఔట్‌ అయిపోతున్నాయి. ఏటా ఇదే వ్యవహారం సాగుతున్నా చూడీచూడనట్టు వదిలేస్తున్నారు. వేసవిలో నిర్వహించే క్రీడా శిబిరాలకు కొనుగోలు చేసే ఆట వస్తువులను మాయం చేస్తున్నారు. అదేదో ఒక్కసారి, రెండుసార్లు అనుకుంటే పొరపాటే.. చాలా ఏళ్లుగా ఈ దోపిడీ కొనసాగుతోంది.

ఈనాడు, హైదరాబాద్‌ : ఈ ఏడాదిలో కొనుగోలు చేసిన రూ.2.06 కోట్ల విలువైన క్రీడా సామగ్రిలో.. మరుసటి సంవత్సరానికి ఏ ఒక్కటీ మిగలట్లేదు. గత రెండేళ్లుగా.. ఆయా జోన్ల గేమ్‌ ఇన్‌స్పెక్టర్లు గతంలోని ఆట వస్తువులేవీ లేవంటూ.. రాబోయే వేసవి క్రీడా శిబిరాలకు అన్ని రకాల ఆట వస్తువులను కొత్తగా కొనాల్సిందేనంటూ కేంద్ర కార్యాలయానికి నివేదికలివ్వడమే అందుకు నిదర్శనం. వందల సంఖ్యలో కొనుగోలు చేసే క్రికెట్‌ కిట్లలోని బంతి కూడా తర్వాతి సంవత్సరానికి కనిపించకపోవడంతో.. గేమ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆట వస్తువులను పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటున్నారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏటా రూ.2.04 కోట్లు

వేసవి క్రీడా శిబిరాల్లో ఆరేళ్ల నుంచి 16 ఏళ్ల వయసున్న 40వేల మంది చిన్నారులకు జీహెచ్‌ఎంసీ క్రీడల విభాగం 44 క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తోంది. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్‌ బాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, షటిల్‌ బాడ్మింటన్, చెస్, క్యారమ్స్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కరాటే, కబడ్డీ, ఖో ఖో, కిక్‌ బాక్సింగ్, నెట్‌బాల్, రోలర్‌ స్కేటింగ్, రైఫిల్‌ షూటింగ్‌ తదితర ఆటల్లో దాదాపు 800 మంది ప్రైవేటు శిక్షకులు చిన్నారులకు నెల రోజులు తర్ఫీదు ఇస్తారు. జీహెచ్‌ఎంసీ 2023 ఏప్రిల్‌లో రూ.2.06 కోట్లతో వేలాది ఆట వస్తువులను కొనుగోలు చేసింది. 2020, 2021, 2022 సంవత్సరాల్లోనూ అదే మాదిరి కొనుగోళ్లు జరిగాయి.  

ఈ వ్యవహారం కనిపెట్టలేరా...?

బల్దియాకు ఆట వస్తువులను అందించే పలు ఏజెన్సీలు, కొందరు గేమ్‌ ఇన్‌స్పెక్టర్లు కలిసి ఏటా అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆట వస్తువులను 50శాతం మేర సరఫరా చేసి, మిగిలిన వాటిని ఏజెన్సీలు తమ వద్దనే ఉంచుకుని, అధికారులకు లంచం ఇస్తుంటాయని ఓ సీనియర్‌ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. క్రీడా శిబిరాల్లో నెల రోజులపాటు ఉపయోగించిన ఆట వస్తువులను సైతం.. అధికారులు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయమై ఓ జోన్‌లోని గేమ్‌ ఇన్‌స్పెక్టర్‌ని వివరణ కోరగా ఆయన స్పందించలేదు.

కూకట్‌పల్లి జోన్‌లో పనిచేస్తోన్న మరో గేమ్‌ ఇన్‌స్పెక్టర్‌కు చాలా ఏళ్లుగా ఖైరతాబాద్‌ జోన్‌ నుంచి జీతం అందుతోంది. ఆయన విధులకు హాజరవుతున్నారా? లేదా? అని అడిగేవారు లేకుండానే ఆయనకు జీతం వెళ్తుండటంతో ఇటీవల జోనల్‌ కమిషనర్‌గా బాధ్యత తీసుకున్న ఐఏఎస్‌ అధికారిణి అభిలాష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర జోన్లలోనూ క్రీడల విభాగం పనితీరు గందరగోళంగా ఉందనే విమర్శలొస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని