logo

సిగరెట్‌ ఇవ్వకపోగా.. హేళన చేశాడని హత్యాయత్నం

తాను అడిగితే సిగరేట్‌ ఇవ్వకపోవడమే కాకుండా నలుగురు ముందు తనను హేళన చేశాడని హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడిని నారాయణగూడ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు.

Published : 14 Jun 2024 02:20 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తాను అడిగితే సిగరేట్‌ ఇవ్వకపోవడమే కాకుండా నలుగురు ముందు తనను హేళన చేశాడని హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడిని నారాయణగూడ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. అడ్మిన్‌ ఎస్సై నరేష్‌కుమార్‌తో కలిసి ఇన్‌స్పెక్టర్‌ యు.చంద్రశేఖర్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడించారు. నారాయణగూడ ఫైఓవర్‌ పక్కన శివాజీనగర్‌లో నివాసం ఉండే శెట్టి భూపాల్‌(30) గాంధీనగర్‌లోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. ఎక్కువగా అర్ధరాత్రి వేళలో విధుల్లో ఉంటాడు. విధులు ముగించుకొని తిరిగి వస్తూ, ఫుట్‌పాత్‌లపై నిద్రించే వారిని నిద్రలేపి సిగరేట్‌ అడుగుతుంటాడు. బుధవారం అర్ధరాత్రి నారాయణగూడలో ఫుట్‌పాత్‌పై నిద్రించిన సత్యనారాయణ ను నిద్రలేపి సిగరేట్‌ ఆడిగాడు. అతడు ‘నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న నలుగురి ముందు హేళనగా మాట్లాడాడు. అనంతరం శెట్టి భూపాల్‌ ఇంటికి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత మళ్లీ వచ్చి అక్కడున్న ఓ కుర్చీని తీసి సత్యనారాయణపై దాడికి దిగాడు. దీంతో అతడి తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు గట్టిగా అరవడంతో నిందితుడు పారిపోయాడు. గురువారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఎస్సై నరేష్‌కుమార్‌ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి భూపాల్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


కుటుంబం హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష

ఈనాడు, హైదరాబాద్‌: భార్య, అత్తమామలు, బావమరుదులు సహా అయిదుగురిని హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అంబర్‌పేటకు చెందిన భార్యాభర్తలైన మహమ్మద్‌ ఖమరుద్దీన్, సాజిదా బేగం, వారి కుమారులు అబ్దుల్లా బియాబిని, మహమ్మద్‌ కిర్మాణి, కుమార్తె నేహా అఫ్రిన్‌ హత్య కేసులో నిందితులైన నేహా అఫ్రీన్‌ భర్త సయ్యద్‌ జహంగీర్, అతని సోదరుడు సయ్యద్‌ కరీం, బావమరిది జబ్బార్‌ హుస్సేన్‌కు యావజ్జీవ శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించింది. నిందితుడు సయ్యద్‌ జహంగీర్‌కు, నేహా అఫ్రిన్‌కు 2008లో వివాహం జరిగింది. కాపురంలో విభేదాలు తలెత్తడంతో నేహా అఫ్రిన్‌ పుట్టింటికి వచ్చి భర్త, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కేసు విచారణకు భర్త సయ్యద్‌ జహంగీర్, అతని తల్లిదండ్రులు కోర్టుకు వచ్చి వెళ్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో జహంగీర్‌ తల్లి మృతి చెందగా, తండ్రి మనోవేదనతో కుంగిపోయారు. దీంతో భార్య కుటుంబంపై కక్ష పెంచుకున్న జహంగీర్, అతని కుటుంబసభ్యులు 2010 మే 30న భార్య నేహా అఫ్రీన్, ఆమె తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులను హత్య చేశారు. ఖమరుద్దీన్‌ కోడలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కింది కోర్టు పోలీసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి దర్యాప్తులో లోపాన్ని కారణంగా చూపి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేసిన వారిని నిర్దోషులుగా పేర్కొనడం సరికాదంది. ఫిర్యాదు చేసిన మహిళ మృతుడి భార్య కావడంతో ఆమె సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ప్రధాన నిందితుడు జహంగీర్, అతని సోదరుడు, బావమరిది నెలలోగా కింది కోర్టులో లొంగిపోవాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కింది కోర్టును ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.


పెంపుడు శునకం.. మహిళల కయ్యం

నారాయణగూడ, న్యూస్‌టుడే: పెంపుడు కుక్క ఓ ఇంటి ముందు మూత్రవిసర్జన చేయడం.. దాడులకు దారి తీసింది. చివరకు ఈ పంచాయతీ సైఫాబాద్‌ ఠాణాకు చేరింది. పోలీసుల వివరాల ప్రకారం.. సుప్రియ అనే యువతి ఇటీవల అమెరికా నుంచి వచ్చి బషీర్‌బాగ్‌ ఫూల్‌బాగ్‌లోని మామ సునీల్‌ ఇంట్లో ఉంటున్నారు. తన పెంపుడు కుక్కను తీసుకొని గురువారం విహారానికి వెళ్లింది. ఈ క్రమంలో మీత అనే మహిళ ఇంటి ముందు ఆ కుక్క మూత్రవిసర్జన చేసింది. గమనించిన మీత సుప్రియను ప్రశ్నించింది. ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. స్థానికులు వచ్చి ఇరువర్గాలను నచ్చజెప్పి పంపిస్తుండగా సుప్రియ మామ సునీల్‌ అక్కడకు వచ్చారు. తన కోడలిపై చేయి చేసుకుంటారా అంటూ కర్ర తీసుకొచ్చి మీత తండ్రి, సోదరులను కొట్టారు. చివరకు ఇరు కుటుంబాల వారు సైఫాబాద్‌ పోలీసు ఠాణాకు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని