logo

డ్రోన్లతో మందు.. ఇక వద్దు

దోమల నియంత్రణకు ఉపయోగిస్తోన్న డ్రోన్లు నిరుపయోగంగా మారాయని, వాటికి చేస్తోన్న ఖర్చు వృథా అని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వాటి సేవలను రద్దు చేసింది. డ్రోన్లతో పిచికారీ చేస్తోన్న మందుతో దోమల కట్టడి సాకారం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోనల్‌ అధికారులు వెల్లడించారు.

Published : 14 Jun 2024 02:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: దోమల నియంత్రణకు ఉపయోగిస్తోన్న డ్రోన్లు నిరుపయోగంగా మారాయని, వాటికి చేస్తోన్న ఖర్చు వృథా అని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వాటి సేవలను రద్దు చేసింది. డ్రోన్లతో పిచికారీ చేస్తోన్న మందుతో దోమల కట్టడి సాకారం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోనల్‌ అధికారులు వెల్లడించారు. కొందరు సీనియర్‌ ఎంటమాలజిస్టులు వాటి పేరుతో నెలకు రూ.2.5లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఫలితం మాత్రం సున్నా అని వాపోయారు. దోమల విభాగంలో అవినీతి అధికారులు పాతుకుపోయారని చెప్పేందుకు ఇదే నిదర్శనం.

రోజూ రూ.10వేలు.. జీహెచ్‌ఎంసీలో ఆరు జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని 185 చెరువులు దోమల ఉత్పత్తి కేంద్రాలగా మారాయి. వర్షాలు మొదలైతే.. చెరువుల చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం నుంచి జనాలు బయట నిలవలేని పరిస్థితి ఉంటుంది. తలుపులు తీస్తే ఇళ్లలోకి దోమలు దండయాత్ర తప్పదు. సమస్య నివారణకు జీహెచ్‌ఎంసీ వేర్వేరు పద్ధతుల్లో నియంత్రణ చర్యలు చేపడుతోంది. ఇంటింటికీ వెళ్లి నీటి నిల్వల్లో, సంపుల్లో, ఇంటి పైన ఉండే ట్యాంకుల్లో దోమలు ఉన్నాయా లేవా అని పరిశీలించే బాధ్యతలో 2వేల మంది సిబ్బంది పని చేస్తుంటారు. మరో 250 మంది ఫాగింగ్, మూసీ పరివాహక ప్రాంతాల్లో గుర్రపుడెక్క తొలగించి దోమల మందు పిచికారీ చేస్తుంటారు. అవి కాకుండా.. ఎక్కువ విస్తీర్ణంలోని చెరువులపై దోమల మందు పిచికారీ చేసి, వాటి ఉత్పత్తిని నియంత్రించేందుకు జీహెచ్‌ఎంసీ మూడేళ్ల కిందట డ్రోన్లను రంగంలోకి దింపింది. జోన్‌కు ఒకటి చొప్పున ఆరు డ్రోన్లను అద్దె ప్రాతిపదికన అధికారులు సిద్ధం చేశారు. నిబంధన ప్రకారం ఒక్కో డ్రోను రోజూ 1520ఎకరాల్లో ఎంఎల్‌ఓ రసాయనాన్ని పిచికారి చేయాలి. నాలుగు గంటలపాటు పనిచేయాలి. అయితే.. కొన్ని జోన్లలో డ్రోన్ల పనితీరు పూర్తిగా పడకేసింది. పలువురు సీనియర్‌ ఎంటమాలజిస్టులు పనిచేయకపోయినా, పనిచేసినట్టు చూపించి బిల్లులు తీసుకుంటున్నారనే విషయమై జోనల్‌ కమిషనర్లకు ఫిర్యాదులు వరుసకట్టాయి. మరోవైపు డ్రోన్లతో మందు చల్లినా చెరువుల్లో దోమల కట్టడి సాధ్యపడట్లేదని తేలింది. ఈ నేపథ్యంలో జెడ్సీలు వాటి సేవలను ఆపేశారు.

రంగంలోకి ఎఫ్‌టీసీ యంత్రాలు.. గుర్రపుడెక్క తొలగింపునకు ఉపయోగించిన ఎఫ్‌టీస్బీఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్స్శ్‌ యంత్రాల టెండరు గతేడాది చివర్లో ముగిసింది. సరిగా పనిచేయట్లేదనే ఫిర్యాదులతో అప్పట్నుంచి వాటి సేవల పొడిగింపునకు జీహెచ్‌ఎంసీ ఇష్టపడలేదు. ఈ క్రమంలో చెరువుల పరిస్థితి పడకేసింది. భారీ ఎత్తున పెరిగిన గుర్రపుడెక్కతో తటాకాలు పచ్చిక బయళ్లుగా మారాయి. దాంతో.. మళ్లీ జోన్‌కు ఒకటి చొప్పున ఎఫ్‌టీసీ యంత్రాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని