logo

మ్యాన్‌హోల్‌.. నాణ్యత నిల్‌

నగరంలోని అనేక ప్రాంతాల్లో వరదనీటి నాలాల మ్యాన్‌హోళ్లు ఛిద్రమయ్యాయి. వాహనాల రాకపోకలతో ముక్కలయ్యాయి. కొన్నిచోట్ల మూతలు పూర్తిగా గల్లంతయ్యాయి. వాహనదారులు వాటిలో పడుతున్నారు.

Published : 14 Jun 2024 02:35 IST

వరదనాలా మ్యాన్‌హోళ్లపై పగిలిన మూతలు
నిత్యం వాటిలో ఇరుక్కుంటున్న వాహనాలు
జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతో ప్రమాదకర పరిస్థితులు

దారుల్‌సిఫా వద్ద మూతలేని మ్యాన్‌హోళ్లో ఇరుక్కున్న ద్విచక్ర వాహనం

నగరంలోని అనేక ప్రాంతాల్లో వరదనీటి నాలాల మ్యాన్‌హోళ్లు ఛిద్రమయ్యాయి. వాహనాల రాకపోకలతో ముక్కలయ్యాయి. కొన్నిచోట్ల మూతలు పూర్తిగా గల్లంతయ్యాయి. వాహనదారులు వాటిలో పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. ఓ వైపున వర్షాలు, మరోవైపు పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో మ్యాన్‌హోళ్లతో ముప్పు పొంచి ఉందన్న ఆందోళన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. చిన్నారులు, పాదచారులు తిరిగే చోట ప్రమాదకరంగా ఉన్న మ్యాన్‌హోళ్లకు వేగంగా మరమ్మతులను చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

నాసిరకం పనులతో..

నగరంలో రెండు రకాల మ్యాన్‌హోళ్లు ఉంటాయి. గుండ్రనివి మురుగునీటి పైపులైన్లవి. చతురస్రాకారంలోని మ్యాన్‌హోళ్లు వరదనీటి నాలాలవి. గతంలో ఈ రెండు రకాలను గ్రానైట్‌ రాళ్లతో నిర్మించేవారు. దానివల్ల కొన్నేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గుత్తేదారులు, ఇంజినీర్లు నాసిరకంగా పనులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గట్టిగా పిడికిలి బిగిస్తే చాలు.. ఆ ఇటుకలు పిండిగా మారుతాయి. వారానికే వాహనాల రాకపోకల వల్ల ఆ ప్రాంతం కుంగిపోతోంది. రెండు నెలలకే మ్యాన్‌హోల్‌ మొత్తం ధ్వంసమ వుతోంది. వరదనీటి మ్యాన్‌హోళ్లదీ అదే పరిస్థితి.  

బల్దియా నుంచి జలమండలికి

గతంలో శివార్లలో మురుగు నీటి వ్యవస్థ బల్దియా పరిధిలో ఉండేది. ప్రధాన నగరంలో మురుగునీటిని నిర్వహణ జలమండలి చూసేది. గత ప్రభుత్వం శివార్ల మురుగు నీటి వ్యవస్థను జలమండలిలో కలిపేయడంతో ఆయా సర్కిళ్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని అంటున్నారు. జలమండలికి బదిలీ అయిన తర్వాత నిర్వహణ పూర్తిగా పట్టించుకోవడం మానేశారని స్థానికులు చెబుతున్నారు. 

పంజాగుట్ట మోడల్‌హౌజ్‌ వద్ద దాదాపు 10 మ్యాన్‌హోళ్లు ఉంటాయి. వాటిలో ఏ ఒక్క మూత సవ్యంగా లేదు. అన్నీ పగిలిపోయి దర్శనమిస్తున్నాయి. పాతబస్తీ దారుల్‌సిఫా వద్ద పంజెతన్‌ కాలనీలో మూతలేని మ్యాన్‌హోల్‌లో పడి ఓ ద్విచక్ర వాహనదారుడు గాయాలపాలయ్యారు. జీహెచ్‌ఎంసీ మాత్రం పగిలిన మూతల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు, మరమ్మతులను పక్కాగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

ప్రధాన రహదారులపై టన్నుల కొద్దీ బరువుండే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటి బరువును పరిగణనలోకి తీసుకుని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు మ్యాన్‌హోళ్లను నిర్మించాల్సి ఉంటుంది. కొందరు గుత్తేదారులు, ఇంజినీర్ల అవినీతి వల్ల అంతర్గత రోడ్లపైనే కాకుండా ప్రధాన రహదారులపైనా మ్యాన్‌హోళ్ల నిర్వహణ అధ్వానంగా మారింది.

మురుగునీటి మ్యాన్‌హోళ్లను జలమండలి నిర్వహిస్తోంది. సుమారు 6.5 లక్షలున్నాయి. నగరంలో 400 కి.మీ ప్రధాన, మరో 1,300 కి.మీ అంతర్గత నాలాలున్నాయి. కొన్నిరోడ్ల పొడవునా వరద ప్రవాహం కోసం నిర్మించినవి. వాటిపై ఉండే 2.5 లక్షల మ్యాన్‌హోళ్లను జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తుంది.


ఇదీ లెక్క...

డీప్‌  మ్యాన్‌హోళ్లు  63,221
వీటిపై ఉన్న  మొత్తం మ్యాన్‌హోళ్ల సంఖ్య  6,34,919
జీహెచ్‌ఎంసీ  పరిధిలో ఉన్న డీప్‌ మ్యాన్‌హోళ్లు  26,798
శివారు మున్సిపాలిటీల్లో  4,200 కి.మీ
గ్రేటర్‌లో సివరేజ్‌ నెట్‌వర్క్‌  5,767 కి.మీ
శివారు మున్సిపాలిటీల పరిధిలో  36,423
నిత్యం ఉత్పత్తి అయ్యే ముఉగు 2100 మిలియన్‌ లీటర్లు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని