logo

పోలీసు వేషం.. ఘరానా మోసం

పోలీసు అధికారినంటూ బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్న మాయగాడు జాదవ్‌ సన్నీ(35)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు.

Updated : 15 Jun 2024 05:10 IST

మాయగాడి అరెస్ట్‌ రూ.3 లక్షల స్వాధీనం

సన్నీ జాదవ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు అధికారినంటూ బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్న మాయగాడు జాదవ్‌ సన్నీ(35)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. సికింద్రాబాద్‌ పార్శిగుట్టకు చెందిన జాదవ్‌ సన్నీ బీమా కంపెనీ ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఆన్‌లైన్‌ గేమింగ్, గుర్రపు పందేలకు అలవాటుపడ్డాడు.  నెలవారీ అందే వేతనం జూదానికి ఖర్చవటంతో అడ్డదారి తొక్కాడు. 2017లో తొలిసారి తానొక పోలీసు అధికారినంటూ బెదిరించి డబ్బులు వసూలు చేయటంతో మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక అదే రీతిలో మోసాలను కొనసాగిస్తూ వచ్చాడు. సైబరాబాద్‌ సిటీలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా నకిలీ ఐడీ కార్డు తయారు చేయించాడు. దాన్ని మొబైల్‌ పోన్‌లో చూపెడుతూ పోలీసు అధికారిగా చెలామణీ అవుతున్నాడు. నగరంలోని ఖరీదైన హోటళ్లలో ఇతర ప్రాంతాల అమ్మాయిలను(వ్యభిచారిణులు) రప్పించుకునే విటులను లక్ష్యంగా చేసుకొని దందా సాగిస్తున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌లోని ఒక హోటల్‌లో తన పథకం అమలు చేశాడు. అదే హోటల్‌లో బస చేసిన ఒక వ్యక్తికి ఐడీకార్డు చూపి టెర్రాస్‌పైకి తీసుకెళ్లాడు. యువతితో ఉన్నప్పటి నగ్నవీడియోలను అతడి కుటుంబ సభ్యులను పంపుతానంటూ బెదిరించి రూ.5లక్షలు తీసుకున్నాడు. మెడలో బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం పలుమార్లు ఫోన్‌ ద్వారా బెదిరిస్తూ బాధితుడి నుంచి మరో రూ.5లక్షలు కాజేశాడు. మరింత డబ్బు కావాలంటూ వేధింపులు పెరగటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.


నకిలీ యాప్‌తో ఏటీఎంల వద్ద మోసం.. నిందితుడి అరెస్టు

సందీప్‌ కుమార్‌

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ‘సర్‌.. మా అమ్మకు సీరియస్‌గా ఉంది.. ఆసుపత్రిలో ఉంది.. డబ్బులు కావాలి.. నా చరవాణి యాప్‌లో డబ్బులు ఉన్నాయి.. మీకు వేస్తా.. నాకు నగదు కావాలి.. అర్జంట్‌..’ అంటూ ఏటీఎం కేంద్రాల వద్ద నకిలీ యాప్‌తో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ అనదపు ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌ సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన నర్రా సందీప్‌కుమార్‌(23) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లాబ్‌ టెక్నీషియన్‌. జల్సాలకు అలవాటు పడి రెండు నెలల క్రితం భార్యను వదిలేశాడు.  గూగూల్‌లో శోధించి.. నకిలీ యాప్‌ల ద్వారా డబ్బులు పంపినట్లు మోసగించేవాడు.పెట్రోల్‌ బంకులు, ఏటీఎంలు, రహదారి పక్కనే ఉండే హోటళ్ల పరిసరాలను లక్ష్యంగా చేసుకొని తన పథకాన్ని అమలు చేసేవాడు. రాజు నుంచి రూ. 35వేలు, శ్రీను అనే మరొకరి నుంచి రూ. 12వేలు కాజేసి పారిపోయాడు. బాధితులు జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కదులుతున్న బస్సు దిగుతూ విద్యార్థిని మృతి

మసీరా మెహ్రీన్‌

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: కదులుతున్న బస్సులో నుంచి కిందికి దిగే ప్రయత్నంలో ఓ విద్యార్థిని అదే బస్సు చక్రాల కింద నలిగి మృతిచెందిన హృదయవిషాదకర ఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సఫ్దార్‌నగర్‌కు చెందిన సలీం నాంపల్లి ప్రాంతంలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మసీరా మెహ్రీన్‌(16) ఇంటర్‌ చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం కళాశాల నుంచి అక్కాచెలెళ్లు ఇంటికి బయలుదేరి చెక్‌పోస్టు వద్ద బస్టాప్‌ వద్దకు వచ్చారు. సికింద్రాబాద్‌-బోరబండ మధ్య నడిచే ఆర్టీసీ బస్సు రావడంతో మసీరా మెహ్రీన్‌ బస్సెక్కింది. అప్పటికే బస్సు కదిలిపోవడంతో అక్క జవేరియా మెహక్‌ ఎక్కలేకపోయింది. మెహ్రీన్‌ బస్సు ముందు ద్వారం నుంచి కిందికి దిగింది. ఈ క్రమంలో అదుపు తప్పి అదే బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు వదిలింది. కళ్లెదుటే చెల్లి మృతిచెందడంతో జవేరియా కన్నీరుమున్నీరైంది.


బాలిక అదృశ్యం.. అనుమానాస్పద మరణం

వసంత

మియాపూర్, న్యూస్‌టుడే: చదువుకోమని తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ దుర్గా రామలింగ ప్రసాద్, ఎస్‌ఐ రాజు తెలిపిన వివరావీ.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం లక్ష్మతండాకు చెందిన బానోతు నరేష్‌ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మియాపూర్‌ నడిగడ్డతండాలో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె వసంత(13) ఏడో తరగతి చదువుతోంది. ఈనెల 7వ తేదీన నరేష్‌ తన కుమార్తెను చదువుకోమని మందలించి బయటికి వెళ్లాడు, తల్లి సైతం పనుల కోసం బయటకు వెళ్లింది. తిరిగివచ్చి చూసిన తల్లికి కుమార్తె కనిపించలేదు. కుటుంబ సభ్యులు స్థానికంగా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 13 రాత్రి వీరి ఇంటికి కొంత దూరంలోనే ఉన్న నిర్జన ప్రదేశంలో చెట్ల మధ్యనుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పరిశీలించారు. అక్కడ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.


రియల్‌ వ్యాపారం పేరిట మోసం.. కార్పొరేటర్‌ రిమాండ్‌

నరేంద్రకుమార్‌

బాలాపూర్, న్యూస్‌టుడే: రియల్‌ ఎస్టేట్‌లో లాభాలు ఆశ చూపి ఓ వ్యక్తిని మోసం చేసిన మీర్‌పేట కార్పొరేటర్‌ను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్‌ కథనం ప్రకారం... బడంగ్‌పేటకు చెందిన నరేంద్రకుమార్‌ మీర్‌పేట 13వ డివిజన్‌ కార్పొరేటర్‌. ఇతను చంపాపేటకు చెందిన చిత్తోజు కృష్ణకు కొంగరకలాన్‌లో 6.17 ఎకరాల భూమి కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి మోసగించడంతో కృష్ణ ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


రచయిత, పాత్రికేయుడు ఎన్‌. పార్థసారథి కన్నుమూత

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: సీనియర్‌ పాత్రికేయుడు, రచయిత నండూరి పార్థసారధి(85) అనారోగ్యంతో బంజారాహిల్స్‌ని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందారు. అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలో ఉంటున్న ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని ఆరుగొలను ప్రాంతం. ఆయనకు భార్య సువర్చల, కుమారుడు మధుసారథి, కోడలు అపర్ణ ఉన్నారు. 1957లో 18 ఏళ్ల వయసులోనే రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ దిన, వార పత్రికలకు కథలు, స్కెచ్‌లు, నవలలు అందించారు. 1996లో ఆంధ్రప్రభ పత్రికలో పదవీ విరమణ పొందారు.


14వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

నార్సింగి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి 14వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. నార్సింగి ఎస్సై అశోక్‌వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన అనురాధ(40) నగరంలోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం స్పెషల్‌ బ్రాంచిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త జనార్దన్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీరికి ఇద్దరు పిల్లలు. వికారాబాద్‌ జిల్లా. నార్సింగి మైహోంఅవతార్‌లో అనురాధ చెల్లెలు, తల్లి ఉంటున్నారు. అమెరికాలో ఉంటున్న మరో సోదరి వద్దకు తల్లి వెళ్లడంతో పిల్లలను స్కూలుకు పంపించడానికి అనురాధ మైహోం అవతార్‌లోని సోదరి ఇంటికి వచ్చారు. కొంత కాలంగా డిప్రెషన్‌లో ఉంటున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం 14వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక కుంగుబాటు కారణంగానే అనురాధ ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి భర్త, సోదరి తెలిపారని ఎస్సై వివరించారు.


అక్రమంగా భూ తనఖా.. రూ.1.5 కోట్ల బ్యాంకు రుణం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల పేరిట ఉన్న భూమిని అక్రమంగా తనఖా పెట్టి బ్యాంకు రుణాన్ని పొందిన జి.అశోక్‌రావు (జూబ్లీహిల్స్‌), సీహెచ్‌.ఉదయ్‌కుమార్‌(గచ్చిబౌలి)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ‘సొసైటీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్‌ ఎంప్లాయీస్‌ హౌసింగ్, వెల్ఫేర్‌ అసోసియేషర్‌(ఎస్‌ఈఈహెచ్‌డబ్ల్యూఏ) సంస్థను సంగారెడ్డి జిల్లా ఉస్మాన్‌నగర్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 2007 జనవరిలో 6 ఎకరాలు, ఫిబ్రవరిలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. 5 ఎకరాల్లో 240 అపార్ట్‌మెంట్స్, 15 విల్లాల నిర్మాణం పూర్తి చేసి 2016లో సభ్యులకు అప్పగించారు. మిగిలిన 345 మంది సంఘ సభ్యులకు 6 ఎకరాల్లో భాగం ఉంది. 2018లో సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు.  సొసైటీ అధ్యక్ష, కార్యదర్శిగా వ్యవహరించిన జి. అశోక్‌రావు, ఉదయ్‌కుమార్‌ ఎటువంటి సమావేశం నిర్వహించకుండా అనధికారకంగా ఈసీ తీసుకున్నారు. దాని ఆధారంగా రూ.75కోట్ల విలువైన 3 ఎకరాలను మార్టిగేజ్‌ డీడ్‌ ద్వారా రూ.1.5కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మోసాన్ని గుర్తించిన సొసైటీ సభ్యులు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జె.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని