logo

అద్దె పేరుతో వచ్చి.. దోపిడీకి యత్నించి

ఉపాధి కోసం నగరానికొచ్చారు. ఏ పని చేసినా ఎక్కువ డబ్బు రావట్లేదు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన తట్టింది.

Published : 15 Jun 2024 04:08 IST

హిమాన్షి , గాంధీరాం

ఉప్పల్, న్యూస్‌టుడే: ఉపాధి కోసం నగరానికొచ్చారు. ఏ పని చేసినా ఎక్కువ డబ్బు రావట్లేదు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన తట్టింది. ఇంటి అద్దె ముసుగులో మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా సభ్యులు ఓ వృద్ధుడి ఇంట్లో దోపిడీకి యత్నించి దొరికిపోయారు. ఈ ఘటన ఉప్పల్‌ చిలుకానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లా అమర్‌కాన్‌టాక్‌ మండలం  పొడి గ్రామానికి చెందిన గాంధీరాం కస్తూరి రెండేళ్ల క్రితం చిలుకానగర్‌కు వచ్చి నాచారంలోని పైపుల కంపెనీలో పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అదే జిల్లాలోని అమన్‌వ గ్రామానికి చెందిన హమాన్షి అలియాస్‌ ప్రీతి సాన్‌వాణి కూడా చిలుకానగర్‌కు వచ్చి కూలీ పనులు చేస్తోంది.

వృద్ధులను లక్ష్యంగా చేసుకొని.. వృద్ధులను లక్ష్యంగా చేసుకొని దోపిడీ చేయాలని వారిద్దరూ పథకం పన్నారు. కొన్ని రోజులుగా ఉప్పల్, చిలుకానగర్‌ ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు. చిలుకానగర్‌లో ‘టూ లెట్‌’ బోర్డు ఉన్న ఇంట్లో వృద్ధ  దంపతులు పిట్టల సుదర్శన్, నర్సమ్మ ఉండడాన్ని గమనించారు. గురువారం రాత్రి 11.30 గంటలకు ఇద్దరు వ్యక్తులు సుదర్శన్‌ వద్దకు వచ్చి ఇల్లు కిరాయికి కావాలని అడిగారు. వారికి ఇల్లు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. మొదటి అంతస్తులో ఖాళీగా ఉన్న గదికి తాళం వేసేందుకు వెళ్లాడు. అక్కడే మాటువేసి ఉన్న గాంధీరాం, హిమాన్షి అతడిపై దాడి చేశారు. నోట్లో రుమాలు కుక్కి ముఖంపై కొట్టారు. తర్వాత అతడిపై మత్తు మందు స్ప్రే చేసి.. పడిపోయాక గదిలో బంధించి దోచుకెళ్తేందుకు యత్నించారు. అంతలోనే అతడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని