logo

కలకలం రేపుతున్న చిరుత సంచారం

వికారాబాద్‌ పరిసర ప్రాంతంలోని అనంతగిరి అడవిలో చిరుత పులి సంచారం మరోమారు కలకలం రేపుతోంది.

Updated : 15 Jun 2024 05:08 IST

పాదముద్రలు పరిశీలిస్తున్న అధికారులు  

వికారాబాద్, వికారాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ పరిసర ప్రాంతంలోని అనంతగిరి అడవిలో చిరుత పులి సంచారం మరోమారు కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం అనంతగిరి హరిత రిసార్ట్స్‌ వెనుక వైపు కుక్కలపై చిరుత దాడి చేసిందన్న సమాచారంతో అటవీశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్‌ఎఫ్‌వో అరుణ, ఎస్‌ఎస్‌వో అరుణ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అయితే అవి చిరుత పాదముద్రలేనా? కావా? అనే తేల్చే పనిలో ఉన్నారు. 2023 అక్టోబరులో పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో, నవంబరు 9న వికారాబాద్‌ మండలం గోధుమగూడలో చిరుతదాడిలో మూగజీవాలు బలయ్యాయి. వికారాబాద్‌ మండలం బురంతపల్లి శివారు పొలంలోనూ చిరుతను గుర్తించిన గ్రామస్థుడు భయంతో పరుగు తీసి అటవీశాఖాధికారులకు సమాచారం అందించాడు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత పాదముద్రలని నిర్ధరించారు. అనంతరం వాటి జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం మరోమారు చిరుత సంచారం సమాచారంతో ద్విచక్ర వాహనదారులు అనంతగిరి అటవీ మార్గంలో  ప్రయాణించేందుకు భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఒంటరిగా సంచరించవద్దని అధికారులు సూచించారు.  

కొత్తపల్లిలో దాడి చేసింది అడవి జంతువని అనుమానం

కుల్కచర్ల, న్యూస్‌టుడే: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తిని గురువారం చిరుత గాయపరిచిందన్న సంఘనటపై అటవీశాఖ అధికారులు చౌడాపూర్‌ మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో ఆధారాలు సేకరించారు. మహబూబ్‌నగర్‌ అటవీ క్షేత్రాధికారి సయ్యద్‌ మక్బూల్‌ హుస్సేన్, సహాయ క్షేత్రాధికారి సుమలత, సెక్షన్‌ అధికారి జాక్రివొద్దీన్‌ తదితరులు కొత్తపల్లి సమీపంలో శేఖర్‌ అనే వ్యక్తిపై దాడికి పాల్పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని వారు తెలిపారు. విద్యుత్తు వెలుగులున్న చోటికి చిరుత వచ్చే అవకాశమే లేదన్నారు. అది చీకట్లోనే ఎక్కువగా సంచరిస్తుందని తెలిపారు. మూగజీవాలను పొలాల వద్ద కాకుండా రైతులు ఇళ్ల ఆవరణలోనే కట్టేసుకోవాలని సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, అటవీశాఖ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని