logo

కానరాని.. ఖనిజ సంక్షేమ నిధి

జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వీటి తవ్వకాలతో సర్కారుకు ఏటా రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది.

Published : 15 Jun 2024 04:16 IST

గనుల గ్రామాల్లో వెచ్చిస్తే మేలు

ఎల్మకన్నెలో అపరిశుభ్రంగా ట్యాంకు

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వీటి తవ్వకాలతో సర్కారుకు ఏటా రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. ఇందులోంచి కొంత మొత్తాన్ని గనుల ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కేటాయిస్తోంది. వీటితో ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆ మొత్తాన్ని మంజూరు చేయలేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధికి నిధుల్లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లాలోని ఇరవై మండలాల్లో ఎర్రమట్టి, సుద్ద, నాపరాయి, కంకర, పలుగురాయి, గ్రానైట్‌ నిక్షేపాలున్నాయి. దాదాపు 6వేల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాల నేలలు ఉన్నాయి. వీటిని తవ్వకాల ద్వారా వెలికితీసి ఎగుమతులు చేసేందుకు ఏడు శాఖల ద్వారా సంబంధిత అనుమతులు జారీ చేస్తున్నారు. తవ్వకాలు, ఎగుమతులతో వ్యాపారులు గనులు భూగర్భ వనరుల శాఖకు రుసుం, సుంకం, తదితరాలను చెల్లిస్తున్నారు. వీటి ద్వారా సర్కారుకు ఏటా రూ.వంద కోట్ల ఆదాయం సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.113.46 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి అంతకుమించి రూ.115.04కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులోంచి రూ.22 కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు గనుల ప్రభావిత గ్రామాల్లో సంక్షేమానికి ఖర్చు చేసేందుకు కేటాయించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు.

గ్రామాలకు కేటాయింపుల ఊసేది: లక్ష్యానికి మించి ఆదాయం సమకూరడంతో గనుల శాఖ ద్వారా కొంత మొత్తాన్ని డీఎమ్‌ఎఫ్‌టీ కమిటీకి చెల్లిస్తారు. జిల్లా మంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించే కమిటీ ద్వారా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఖనిజ సంక్షేమ నిధిని జిల్లాలోని 566 పంచాయతీలకు మంజూరు చేస్తారు. వాటిని విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, ఉపాధి కల్పన, స్త్రీ శిశు సంక్షేమం, క్రీడలు, విగణిత విద్యకు సద్వినియోగం చేసే వీలుంటుంది. ఈ ఏడాది ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో పల్లెల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టే వీల్లేకుండాపోయింది. గతేడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికల కోడ్, ఆ తర్వాత పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, అనంతరం ఎంపీ ఎన్నికల కోడ్‌ను ఈనెల 4న వరకు అమలు చేయడంతో నిధుల మంజూరుకు అవకాశం లేకపోయింది. 70 శాతం పంచాయతీ ఖాతాల్లో నిధులు లేక పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ఆటంకంగా మారింది. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌ పౌడర్, ట్యాంకుల శుభ్రత వంటి స్వచ్ఛత కార్యక్రమాలకు నిధుల కొరత నెలకొంది. ఖనిజ సంక్షేమ నిధులు విడుదల చేస్తే కొంతవరకు పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ఊరట కలగనుంది. కోడ్‌ ముగిసినా ఖనిజ సంక్షేమ నిధుల వినియోగంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

త్వరలో కేటాయిస్తాం: శ్రీనివాస్, డీఆర్డీవో

నిధులు కలెక్టర్‌ పరిధిలో ఉన్నాయి. త్వరలో డీఎమ్‌ఎఫ్‌టీ కమిటీ సమావేశం నిర్వహించి నిధులు కేటాయించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గ్రామాలకు నిధులు అందించేందుకు కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని