logo

అటవీ భూమిని వీడని కబ్జా పర్వం!

రెండు దశాబ్దాలుగా తెలంగాణ అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు.

Published : 15 Jun 2024 04:18 IST

అధికారులు అడ్డుకుంటున్నా తొలగని ఆటంకాలు

కర్ణాటక రైతులు కబ్జా చేసి సాగు చేసుకుంటున్న భూమి

న్యూస్‌టుడే, బషీరాబాద్‌: రెండు దశాబ్దాలుగా తెలంగాణ అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. అటవీ అధికారులు తరుచూ వెళ్లి హెచ్చరించి పంపించడం.. మళ్లీ అదే పరిస్థితి. ఈ భూమి తమదేనంటూ మన అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భూమికి హద్దులు ఏర్పాటు చేసే అంశం చిక్కుముడిలా మారింది. వివాదం తేలకపోవడంతో తెలంగాణ అటవీ భూములను కర్ణాటక రైతులు కబ్జా చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమై చర్చించి, హద్దులను నిర్ధరిస్తేనే ప్రయోజనముంటుంది.

1300 హెక్టార్ల వరకు: వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం పరిధిలో అటవీప్రాంతంలో సుమారు 1,300 హెక్టార్ల వరకు వికారాబాద్‌కు చెందిన అటవీ భూమే. అయితే కర్ణాటక రైతులు చెట్లను నరికేయడం, కబ్జా చేసి సాగు చేసుకోవడంతో అరణ్యం కాస్త సాగుకు అనువుగా మారిపోతున్నాయి. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా, వినిపించుకోవడం లేదు. కర్ణాటక పరిధి సర్వే సంఖ్య 1, 2 లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో ఏమీ చేయలేకపోతున్నారు. దీనినే ఆసరా చేసుకుని సుమారు 200 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులే చెబుతున్నారు.

నిత్యం గొడవలు: కర్ణాటక వాసులు వచ్చి మన భూమిలో సాగుకు ఉపక్రమించడం, మన అధికారులు వెళ్లి అడ్డుకోవడంతో వారిపై పలుమార్లు గొడవకు దిగడం, ప్రత్యక్ష దాడులకు దిగిన సంఘటనలు ఉన్నాయి. ఉద్యోగ బాధ్యతలో న్యాయం చేయాలనే కోణంగా అటవీశాఖ అధికారులు రేయింబవళ్లు నిఘా పెట్టినా, ఉన్నతాధికారుల సహకారం లేకపోవడంతో నిస్సహాయ స్థితికి చేరుకుంటున్నారు. విత్తనాలు విత్తే సమయంలో అడ్డుకోవడం, మళ్లీ కొన్ని రోజులయ్యాక అధికారులు లేన సమయం చూసి కబ్జా కొనసాగించడం నిత్యకృత్యమైంది. పదేళ్లుగా ఇలాగే కొనసాగుతుండడంతో అధికారులు ఏం చేయలేకపోతున్నామని తలలు పట్టుకుంటున్నారు.

కొడంగల్‌ వద్ద: కొడంగల్‌ సరిహద్దు ప్రాంతంలోనే ఈ అటవీ భూమి కబ్జాల వ్యవహారం కొనసాగుతోంది. ఎడమవైపు కొడంగల్, కుడివైపు బషీరాబాద్, కర్ణాటక సరిహద్దు ఉంది. ఈ ప్రాంతాలకు ఆనుకునే అటవీ భూమి ఉంది. తాండూరు రేంజ్‌ అధికారులు ఇరు రాష్ట్రాల సంయుక్త సర్వేకు నివేదించామని, జిల్లా స్థాయి అధికారుల పరిధిలో ఉందని చెప్పడంతో సమయం ముగుస్తోందని కిందిస్థాయి అధికారులు ఆవేదన చెందుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ స్పందించి ఈ విషయంలో చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.

సంయుక్త సర్వేకు నివేదించాం

బషీరాబాద్‌ మండలంలోని అటవీభూములు కర్ణాటక ప్రజలు కబ్జా చేశారని గుర్తించాం. నిరంతరం అడ్డుకుంటున్నాం.కబ్జా విడిపించి కొంత స్థలంలో మొక్కలు నాటాం. ఇరు రాష్ట్రాల అధికారుల సంయుక్త సర్వే చేయాల్సి ఉంది. జిల్లా రెవెన్యూ, అటవీశాఖల అధికారుల దృష్టికి తీసుకెళుతూనే ఉన్నాం. అటవీభూముల పరిరక్షణ అధికారి, జిల్లా పాలనాధికారికి మరోసారి విన్నవించి త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

శ్యాంసుందర్, అటవీశాఖ అధికారి, తాండూరు.


తెలంగాణ భూమిలో కన్నడీగుల సాగు

8మందిపై కేసు నమోదు

నీళ్లపల్లి తండా శివారులో తెలంగాణ అటవీభూమి హద్దు వద్ద కర్ణాటక, తెలంగాణ రైతులు, అధికారుల వాగ్వాదం

తెలంగాణ సరిహద్దు మండలమైన బషీరాబాద్‌ అటవీ భూమిలో కర్ణాటక రైతులు చొచ్చుకొచ్చి భూములు సాగు చేస్తున్నారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతాన్ని సందర్శించి కబ్జా విడిపించారు. సాగు చేసిన 8 మంది కర్ణాటక వాసులపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. కర్ణాటక రాష్ట్రం పలుగుకుచ్చ తండా, గోప్యానాయక్‌ తండాకు చెందిన వారిపై కేసు నమోదైంది.. తాండూరు రేంజ్‌ అధికారి శ్యాంసుందర్, పీర్యానాయక్, సిబ్బందితో కలిసి కబ్జా చేసిన అటవీ భూమి వద్దే ఉండి, తాండూరు, బషీరాబాద్, వికారాబాద్‌ సర్వేయర్లు, కర్ణాటక సేడం, ముదోల్‌కు చెందిన రెవెన్యూ, పోలీసు అధికారులు, సర్వేయర్లను అటవీ ప్రాంతానికి పిలిపించుకుని కబ్జా విషయమై తేల్చుదామని  ప్రయత్నించారు. ఉన్నతాధికారులకు వివరించాకే  సర్వే చేస్తామని కర్ణాటక అధికారులు వెళ్లిపోయారు. అప్పటి వరకు భూమిలోకి ఎవరూ రావొద్దని ఒప్పందం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని