logo

అధ్వాన దారులు.. అవస్థల ప్రయాణాలు

జిల్లాలో రహదారులు, భవనాలశాఖ  ప్రధాన రోడ్లతో పాటు పల్లెలకు అనుసంధానంగా ఉన్న పంచాయతీరాజ్‌ రోడ్లు అధ్వానంగా మారాయి.

Published : 15 Jun 2024 04:21 IST

చోదకులకు ఒళ్లు నొప్పులు
మరమ్మతుకు గురవుతున్న వాహనాలు

జిల్లాలో రహదారులు, భవనాలశాఖ  ప్రధాన రోడ్లతో పాటు పల్లెలకు అనుసంధానంగా ఉన్న పంచాయతీరాజ్‌ రోడ్లు అధ్వానంగా మారాయి. వీటిపై రాకపోకలు నిర్వహించే ద్విచక్ర వాహన దారులు తరచూ ఒళ్లు నొప్పులతో అవస్థలు పడుతున్నారు. వాహనాలు మరమ్మతుకు గురవుతున్నాయి. నిధులున్న ప్రాంతాల్లో కూడా అధికారులు పనులు చేయకపోవడం శోచనీయం. మరి కొన్నిచోట్ల నిధులు లేక పనులు జరగడం లేదు. ప్రస్తుత వానాకాలం ప్రారంభం అయింది. ప్రజలకు మరింత ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి. సత్వరం అధికారులు స్పందించి బాగుచేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌ కలెక్టరేట్‌.


గుంతలు పడి.. నీరు నిలిచి..

తాండూరు మండలం చెంగేష్‌పూరు వద్ద దుస్థితి

తాండూరు మండలం ఈద్గా నుంచి చెంగేష్‌పూరు మీదుగా ఎల్మకన్నె వెళ్లే రోడ్డులోకంకర, తారు  తొలగి గుంతలు పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వీటిల్లో వరద చేరి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గౌతాపూరు నుంచి చెంగోల్‌ వరకు కూడా ఇదే పరిస్థితి. తాండూరు పట్టణం నుంచి నారాయణపూర్‌ వెళ్లే రోడ్డు రైల్వే గేటు వరకు మట్టితో కూడుకున్నది కావడంతో అవస్థలు తప్పడం లేదు. కరణ్‌కోట నుంచి గౌతాపూరు వరకు వచ్చే రోడ్డు చిత్తడిగా మారింది. గౌతాపూరు నుంచి తాండూరు వరకు జాతీయ రహదారిపై చాలా చోట్ల రెండుఅడుగుల లోతు గుంతలు పడ్డాయి.


మరమ్మతు లేక

మహబూబ్‌నగర్‌ మార్గంలో వంతెనపై ..

తాండూరు నుంచి మహబూబ్‌నగర్‌ వైపు వెళ్లే మార్గంలోని తాండూరు రైల్వే వంతెనపై గుంతలు పడినా మరమ్మతు చేయడంలేదు. 2014లో రూ.7కోట్లతో దీనిని నిర్మించారు. మూడేళ్ల వరకు బాగానే ఉన్నా, అనంతరం తారు తొలగిపోయింది.ఈ గుంతలపై నుంచి వెళ్లిన వాహనాలు తరచూ మరమ్మతుకు గురై ఆగిపోతున్నాయి.

ప్రమాదకరంగా..: తాండూరు నుంచి వికారాబాద్‌ వైపు వెళ్లే రోడ్డును 2017లో రూ.52 కోట్లతో విస్తరించే పనులు ప్రారంభించారు. చాలా చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. తాండూరు పట్టణం విలియమ్‌ మూన్‌ కూడలి నుంచి పెద్దేముల్‌ మండలం దుగ్గాపూరు వరకు అస్తవ్యస్తంగా మారింది.

ఇదీ లెక్క:

  • రహదారులు, భవనాల శాఖ పరిధిలో 911.869 కిలోమీటర్లు. ఇందులో 361.875 కిలోమీటర్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, రహదారుల మరమ్మతు వంటి 57 పనులను రూ.637.93 కోట్లతో చేపడుతున్నారు. కొన్ని పూర్తయినా, ఇంకొన్ని పూర్తి కాలేదు. మరికొన్ని ప్రారంభానికి నోచలేదు.
  • పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో అన్ని రకాల రోడ్లు 2,781.29 కిలోమీటర్లు. రూ.262.94 కోట్లతో 917 పనులు చేపడుతున్నారు. ఇందులో 681 పూర్తయ్యాయి. మిగిలినవి కొన్ని ప్రారంభమయ్యాయి.

వంతెనపై చువ్వలు తేలినా..

పెద్దేముల్‌ మండలం బుద్దారం వద్ద..

పెద్దేముల్‌ మండలం బుద్దారం వాగుపై రూ.3కోట్లతో నిర్మించిన వంతెనపై ఇనుప చువ్వలు తేలాయి. వర్షాకాలంలో నీరు చేరితే వాహనదారులు వేగంలో వెళ్లే సమయంలో అదుపు తప్పి పడిపోయే ప్రమాదం ఉంది. గాజీపూరు వద్ద రూ.6 కోట్లతో నిర్మించిన వంతెనకు అనుసంధానంగా చేపట్టే తారు రోడ్డు పనులు పూర్తి కాలేదు. పెద్దేముల్‌ నుంచి గిరిజన తండా, రుద్రారం మీదుగా నాగులపల్లి వరకు వెళ్లే తారు రోడ్డు అడుగుకోగుంతతో వాహనాలు మరమ్మతుకు గురవతున్నాయి. బుద్దారం నుంచి పెద్దేముల్‌ తండా వరకు రూ.కోటికి పైగా నిధులతో తారు రోడ్డు నిర్మించాల్సి ఉంది. కొన్ని చోట్ల కంకర పరిచి వదిలేశారు.


కంకర తొలగి

బెన్నూరు-యాలాల వద్ద

బెన్నూరు నుంచి మండలకేంద్రం యాలాల వరకు ఉన్న తారు రోడ్డు అక్కడక్కడ గుంతలు పడ్డాయి. లక్ష్మీనారాయణపూరు నుంచి ఎన్కేపల్లి, కమాల్‌పూరు నుంచి బాగాయిపల్లి వరకు వెళ్లే దారిపై కంకర, తారు తొలగింది.  బండమీది పల్లి నుంచి జుంటుపల్లి, చెన్నారం నుంచి నాగారం వరకు ప్రధాన మంత్రి సడక్‌ యోజన కింద రూ.2.68 కోట్లతో నిర్మించాల్సిన రోడ్డును కేవలం కంకర పరిచి వదిలేశారు.

నిధుల లభ్యత ప్రకారం పూర్తి చేస్తాం: రహదారులు, భవనాలు, పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈలు

జిల్లాలో మరమ్మతుకు వచ్చిన రహదారులకు నిధుల మంజూరు లభ్యతను బట్టి పూర్తి చేస్తామని వికారాబాద్‌ రహదారులు, భవనాల శాఖ ఈఈ లాల్‌సింగ్, తాండూరు, వికారాబాద్‌  పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈలు శ్రీరాములు, వికారాబాద్‌ ఈఈ ఉమేష్‌ కుమార్‌ తెలిపారు. వర్షాకాలంలో అత్యవసరంగా చేపట్టే పనులపై దృష్టి పెట్టామని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామనిపేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని