logo

అవకాశాల పెన్నిధి.. ఆకర్షణీయ ఉపాధి

మార్కెట్‌లో లభించే ప్రతి వస్తువు వినియోగించే వరకు భద్రంగా ఉండాలంటే దానికి ప్రత్యేకమైన ప్యాకింగ్‌ అవసరం.

Published : 15 Jun 2024 04:26 IST

ప్యాకేజింగ్‌ టెక్నాలజీ కోర్సుకు డిమాండ్‌

ప్రయోగాలను వీక్షిస్తున్న విద్యార్థులు

హబ్సిగూడ, న్యూస్‌టుడే: మార్కెట్‌లో లభించే ప్రతి వస్తువు వినియోగించే వరకు భద్రంగా ఉండాలంటే దానికి ప్రత్యేకమైన ప్యాకింగ్‌ అవసరం. ప్రతి వస్తువును అందంగా, ఆకర్షణీయంగా రూపొందించడమే  ప్రత్యేకత. అందుకే ప్యాకింగ్‌ అనేది ఒక శాస్త్రంగా మారింది. పరిశ్రమలో తయారైన వస్తువు వినియోగదారుడికి పలు దశల్లో సరఫరా అవుతుంది. ఆ వస్తువు రోజుల నుంచి కొన్నేళ్ల వరకు సురక్షితంగా ఉండాలి. రవాణాలో వస్తువులు పాడవకుండా ఉండడంతోపాటు నిల్వ ఉండటానికి అవసరమైన సమాచారాన్నిఅందించడమే ప్యాకేజింగ్‌ టెక్నాలజీ లక్ష్యం. ఆధునిక జీవనశైలికి, వ్యాపార నిర్వహణకు ప్యాకేజింగ్‌ విభాగం తప్పనిసరి. అందుకే ఇదో పరిశ్రమగా పరిగణించి ప్యాకేజింగ్‌ టెక్నాలజీ కోర్సును సాంకేతిక విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది.తెలుగు రాష్ట్రాలకు ఏకైక కళాశాల: రామంతాపూర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అందిస్తున్న ప్యాకేజింగ్‌ టెక్నాలజీ డిప్లొమాకు విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాలకు కోర్సును అందిస్తున్న ఏకైక కళాశాల కావడం విశేషం. 1996లో ప్రవేశపెట్టిన ఈ కోర్సును పూర్తి చేసిన వారు నేడు పలు కంపెనీల్లో మంచి ఉద్యోగాల్లో, పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డారు. ఏటా పాలీసెట్‌ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించిన 60మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 27బ్యాచ్‌లు పూర్తి చేశారు. గతంలో 1996 నుంచి 2008 వరకు 30 సీట్లు ఉండగా.. 2009 నుంచి 60కి పెంచారు. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా 100శాతం ఉపాధి పొందారు.

కెరీర్‌ ఇలా..

ఈ కోర్సు పూర్తి చేసిన వారిని ప్యాకేజిస్టులని అంటారు. ప్రతి వస్తువును అందంగా, ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా ప్యాకింగ్‌ చేయడమే వీరి పని. క్వాలిటీ కంట్రోల్, ప్యాకింగ్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. దేశంలో 40వేల ప్యాకింగ్‌పరిశ్రమలు ఉన్నాయి. వీటికి తగ్గట్టుగా శిక్షణ అందించే సంస్థలు తక్కువ కావడంతో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ కోర్సు చేసిన వారు డాక్టర్‌ రెడ్డీస్, అరబిందో, హెటిరో, సిగ్నోడ్, ఐటీసీ భద్రాచలం, గ్లాండ్‌ ఫార్మా, ఇండియన్‌ ఇమ్యునాలాజికల్‌ లిమిటెడ్, స్ప్రెడ్‌ ఫార్మా, అర్చిడ్‌ ఫార్మా, టోరంటో ఫార్మా, బయొలాజికల్‌ తదితర సంస్థల్లో మంచి స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు స్వయంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్యాకేజింగ్‌ టెక్నాలజీ శాఖాధిపతి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కోర్సులకు చాలా డిమాండ్‌ ఉందని జేఎన్‌జీపీ కళాశాల ప్రిన్సిపల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని