logo

గోదావరి నుంచి అత్యవసర పంపింగ్‌

నగర అవసరాలకు గోదావరి జలాల తరలింపునకు సంబంధించి అత్యవసర పంపింగ్‌కు జలమండలి సిద్ధమవుతోంది.

Published : 15 Jun 2024 04:37 IST

18న ప్రారంభానికి ఏర్పాట్లు

ఎల్లంపల్లిలో పనులను పరిశీలిస్తున్న  జలమండలి అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: నగర అవసరాలకు గోదావరి జలాల తరలింపునకు సంబంధించి అత్యవసర పంపింగ్‌కు జలమండలి సిద్ధమవుతోంది. 7 పంపులతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి ప్రాజెక్టు అప్రోచ్‌ ఛానెల్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. గురు, శుక్రవారాల్లో ట్రయల్‌రన్‌ ప్రారంభించిన అధికారులు...ఈ నెల 18 నుంచి పూర్తి స్థాయిలో అత్యవసర పంపింగ్‌ చేపట్టనున్నారు. నిత్యం 172 మిలియన్‌ గ్యాలన్లు అటు మిషన్‌ భగీరథతోపాటు ఇటు నగర అవసరాలకు అందిస్తున్నారు. కృష్ణా తర్వాత ఎక్కువ శాతం గోదావరి జలాలపైనే నగర ప్రజలు ఆధారపడ్డారు. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 5 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయి. నగరానికి నీటిని తరలించే పంప్‌హౌస్‌కు నీటి సరఫరా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో జలాశయం లోపల భారీ పంపులతో పంప్‌హౌస్‌కు వెళ్లే అప్రోచ్‌ ఛానెల్‌లో ఎత్తిపోయాలి.

నాగార్జునసాగర్‌లో ప్రసుత్త నీటి మట్టం 504.67 అడుగులు...500 అడుగుల వరకు నిత్యం 270 ఎంజీడీలను నగరానికి తీసుకోవచ్చు. రుతుపవనాల రాకతో వానలు కురుస్తున్నాయి. గోదావరిలోకి కొంచెం వరద పెరిగింది. ఎల్లంపల్లిలోకి కూడా వరద రావడంతో ఇక అత్యవసర పంపింగ్‌ అవసరం ఉండదని తొలుత అధికారులు భావించారు. వరద కంటే ఎక్కువ జలాలు వాడుతుండటంతో ఎల్లంపల్లిలోనూ నీటి మట్టం తగ్గుతోంది. దీంతో అత్యవసర పంపింగ్‌నకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని