logo

ఉస్మానియా ప్రాంగణంలో జైలు వార్డు ఏర్పాటుకు సన్నాహాలు

ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో ‘జైలు వార్డు’ ఏర్పాటుకు పోలీసు, జైళ్లశాఖ అధికారులు, వైద్యాధికారులతో సన్నాహాలు చేస్తున్నారు.

Published : 15 Jun 2024 04:40 IST

ఆసుపత్రిని సందర్శించిన సీపీ శ్రీనివాస్‌రెడ్డి

సీపీ శ్రీనివాస్‌రెడ్డికి  పుష్పగుచ్ఛం ఇస్తున్న సూపరింటెండెంట్‌ నాగేందర్‌

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో ‘జైలు వార్డు’ ఏర్పాటుకు పోలీసు, జైళ్లశాఖ అధికారులు, వైద్యాధికారులతో సన్నాహాలు చేస్తున్నారు. నగర కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, జైళ్లశాఖ అధికారులు, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ తదితరులు ఈ నెల 13న ఆసుపత్రిలోని అఫ్జల్‌గంజ్ ఠాణా వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఈ పక్కనే సీవరేజీ ట్రీట్‌మెంటు ప్లాంటు నిర్మాణం కొనసాగుతోంది. అక్కడ ఖాళీ స్థలం ఉండటంతో జైలు వార్డు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు చూశారు. నగర కొత్వాల్‌ ఆదేశాల మేరకు శుక్రవారం డీసీపీ వెంకటేశ్వర్లు మరోమారు ఉస్మానియాను సందర్శించారు. ఖైదీలు, ఎస్కార్టు సిబ్బందికి అనువుగా ఉండేందుకు గదులు, మూత్రశాలలు, విద్యుత్తు  సదుపాయాలు గతంలోనే ఏర్పాటు చేయడంతో ఖైదీల వార్డుకు అనువుగా ఉంటుందని డా.నాగేందర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనాతో మూతపడి.. కొత్తగా నిర్మాణం చేపట్టకుండా ప్రస్తుతం ఉన్న వార్డుల్లోనే ఖైదీల వార్డు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఉస్మానియాలోని పాత భవనం వంటశాల సమీపంలో ఖైదీల కోసం ప్రత్యేకంగా వార్డు ఉండేది. నాలుగేళ్ల క్రితం కరోనా విజృంభించడం, పాత భవనంలోకి వరద చేరింది. కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఈ జైలు వార్డులో ఖైదీల కోసం ప్రత్యేకంగా పది పడకలుండేవి. భవనం శిథిలం కావడంతో వార్డును మూసివేశారు. ఖైదీలను రోగులతో పాటే సాధారణ వార్డుల్లో చికిత్స చేస్తున్నారు. ఎస్కార్టు సిబ్బంది, రోగుల సహాయకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇన్‌పేషెంట్లుగా చేర్చుకునే ఖైదీల కోసం ప్రత్యేకంగా హౌస్‌సర్జన్‌ క్వార్టర్స్‌ను కేటాయించేందుకు ఉస్మానియా అధికారులు సముఖత వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని