logo

మరో 100 రోడ్లకు వాణిజ్య హోదా

ఆదాయం పెంపు దిశగా జీహెచ్‌ఎంసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మరో వంద రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.

Updated : 15 Jun 2024 05:03 IST

వెడల్పు, పార్కింగ్‌ పరిశీలించి ఎంపిక
ఏటా రూ,100 కోట్ల ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయం పెంపు దిశగా జీహెచ్‌ఎంసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మరో వంద రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత సర్కారు 2021లో జీ.వో.నెం.102 ద్వారా 118 రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చింది. మారిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. మరో వంద రోడ్లకు ఆ హోదా ఇవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 100 అడుగులు, అంతకన్నా ఎక్కువ వెడల్పున్న రోడ్లను ఎంపిక చేసి ప్రాథమిక జాబితాను సర్కారుకు అందించారు. ప్రభుత్వ నిర్ణయం వచ్చాక రోడ్ల ఎంపికపై మరింత కసరత్తు చేసి తుది జాబితాను సిద్ధం చేసే అవకాశం ఉంది. తుదిరూపం ఏర్పడితే రూ.100 కోట్ల ఆదాయం సమకూరనుంది.

హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) 2007లో ఏర్పాటైంది. 17ఏళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో నగరాభివృద్ధి ప్రణాళికకు తగ్గట్టు రూపుదిద్దుకోలేదు. హెచ్‌ఎండీఏ పరిధిలోనూ అంతే. వాస్తవ పరిస్థితులకు, మాస్టర్‌ప్లాన్‌కు చాలా వ్యత్యాసం ఉంది. బృహత్‌ ప్రణాళికలో మాదిరి రోడ్ల విస్తరణ, నిర్మాణం జరగట్లేదు. దానితో షాపింగ్‌ మాల్స్, భారీ వాణిజ్య భవనాలు ఉన్న రోడ్లు అనేకం ఇప్పటికీ నివాస కేటగిరీలో ఉన్నాయి. ఇళ్ల కోసమంటూ అనుమతి తీసుకునే పలువురు యజమానులు, నివాసయోగ్యతాపత్రం(ఓసీ) తీసుకున్నాక ఆయా భవనాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నారు. ఈ రకంగా పార్కింగ్‌ వసతి లేని భవనాలు రూపం మార్చుకోవడంతో.. పార్కింగ్‌ వసతి లేక వాహనాలు రోడ్లపై నిలుస్తున్నాయి. ఇతరత్రా సమస్యలూ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో వంద రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చి, వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

ఆదాయం పెరుగుతుందిలా..: ఏదైనా రహదారిని వాణిజ్య రహదారిగా గుర్తిస్తే జీహెచ్‌ఎంసీకి వేర్వేరు రూపాల్లో ఆదాయం పెరుగుతంది. సహజంగానే ఆస్తిపన్ను ఆదాయం రెట్టింపు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. వాణిజ్య సముదాయాలను నిర్మించాలనుకునే యజమానులకూ మేలే. వాణిజ్యేతర రహదారులపై కమర్షియల్‌ కాంప్లెక్సులను నిర్మించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించి భూ వినియోగాన్ని మార్చుకోవాలి. ఆ ప్రక్రియ చాలా వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటుంది. వాణిజ్య రహదారిపై అయితే.. నేరుగా వాణిజ్య కేటగిరీలో నిర్మాణ అనుమతి లభిస్తుంది. నివాస సముదాయాలనూ నిర్మించుకోవచ్చు. నిర్మాణదారు భవనం విస్తీర్ణంలోని ప్రతి చదరపు అడుగుకు రూ.300ల నుంచి రూ.400ల ఇంపాక్ట్‌ ఫీజును జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన సాకారమైతే.. ఆస్తిపన్ను, నిర్మాణ అనుమతి రుసుము, ఇంపాక్ట్‌ ఫీజుల రూపంలో జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.100కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని