logo

కసి పెంచుకొని.. ఉసురు తీసి

ప్రతీకారంతో ఒకరు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇంకొకరు..  ఇంట్లో గొడవల కారణంగా మరొకరు.. డబ్బుల విషయమై ఓ మహిళ, మరో వ్యక్తి హత్యకు గురయ్యారు.

Updated : 15 Jun 2024 05:02 IST

నగరంలో వేర్వేరు ఘటనల్లో ఒకేరేజు ఐదు హత్యలు

ప్రతీకారంతో ఒకరు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇంకొకరు..  ఇంట్లో గొడవల కారణంగా మరొకరు.. డబ్బుల విషయమై ఓ మహిళ, మరో వ్యక్తి హత్యకు గురయ్యారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దారుణాలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి.


కత్తులు, కర్రలతో వేటాడి..

ఆసిఫ్‌నగర్, న్యూస్‌టుడే: యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధిలో గురువారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం... టప్పాచబుత్ర గంగాబౌలికి కుతుబుద్దీన్‌(27) ఫర్నీచర్‌ పాలిషింగ్‌ పనులు చేస్తుంటాడు. 2013 ఆగస్టులో ఆసిఫ్‌నగర్‌ జిర్రా రోడ్డులో జరిగిన సయ్యద్‌ ముజాహిద్‌(28) హత్య కేసులో నిందితుడు. ఆ హత్య తర్వాత నిందితుడిపై మృతుడి సోదరులు కక్ష పెంచుకున్నారు. రోజూ పనులు ముగించుకొని తన సోదరుని వద్దకు కుతుబుద్దీన్‌ వెళ్తుంటాడు. ఇది గమనించిన ముజాహిద్దీన్‌ సోదరులు గురువారం రాత్రి అతనిపై కత్తులు, కర్రలతో వెంటపడి విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కుతుబుద్దీన్‌ను  ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సయ్యద్‌ ఇమ్రాన్, తాహెర్, అమన్‌పై కుతుబుద్దీన్‌ సోదరుడు మహ్మద్‌ అబ్దుల్‌ రహీం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


మహిళ దారుణ హత్య

శేరిలింగంపల్లి: ఓ మహిళ హత్యకు గురైన ఘటన ఇది. చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పాలవెల్లి వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన చెందిన అమర్‌సింగ్, అతని భార్య విజయలక్ష్మి (32) కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చి నల్లగండ్ల లక్ష్మీవిహార్‌ ఫేజ్‌-1 కాలనీలో ఉంటున్నారు. భర్త కార్మికుడిగా, భార్య విజయలక్ష్మి(32) వంట మనిషిగా పనిచేస్తుంది. వీరికి 16, 14 ఏళ్ల కుమారులున్నారు. ఆటోలకు ఫైనాన్స్‌ ఇచ్చే భరత్‌గౌడ్‌ అలియాస్‌ శ్రీనివాస్‌గౌడ్‌తో ఈ కుటుంబానికి సాన్నిహిత్యం ఏర్పడింది. అమర్‌సింగ్‌ తన బావమరిది సునీల్‌కు ఫైనాన్స్‌లో ఆటో ఇప్పించాడు. అతను డబ్బులు చెల్లించడం లేదని భరత్‌గౌడ్‌ సోదరులు ఆటో తీసుకెళ్లి కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టులో రాజీ కుదుర్చుకున్నారు. శుక్రవారం భరత్‌గౌడ్‌ కత్తితో అమర్‌సింగ్‌ ఇంటికి వచ్చి విజయలక్ష్మిపై దాడి చేసి చంపి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.


భార్య, కొడుకు దాడి.. భర్త కన్నుమూత

తలకొండపల్లి: భార్య, కొడుకు దాడిలో భర్త చనిపోయిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్‌ వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాకు చెందిన ముడవత్‌ పాండు(45)కు అతని భార్య శాంతి, కొడుకు శ్రీహరికి కొద్దిరోజుల నుంచి కుటుంబ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి పాండుపై భార్య, కుమారుడు కట్టెలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పాండును వారే  నగరంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


డబ్బుల విషయంలో ఘర్షణ..

చేవెళ్ల గ్రామీణం: మేనమామను హత్య చేసిన సంఘటన చేవెళ్ల ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తంగడపల్లికి చెందిన రుల్లాఖాన్‌(58) భార్యాపిల్లలతో నగరంలో ఉండేవాడు. అనారోగ్యం కారణంగా సొంతూరికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. సోదరి కుమారుడు ఖాజాపాషా డబ్బులు కావాలని పలుసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో మామపై కోపం పెంచుకున్నాడు. గురువారం ఖాజాపాషా తన స్నేహితులు షేక్‌ ముస్తఫా, అఫ్జల్‌తో కలిసి తంగడపల్లిలోని మామ ఇంటికి వచ్చారు. రాత్రి వరకు మాట్లాడుకున్నారు. 2 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. కత్తితో దాడి చేసి రుల్లాఖాన్‌ను హత్య చేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


వివాహేతర సంబంధంతో..

పహాడీషరీఫ్, న్యూస్‌టుడే: ఓ మహిళతో వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. గురువారం అర్ధరాత్రి యువకుడిని హతమార్చిన సంఘటన తెలిసిందే. బాలాపూర్‌ ఎస్సై మహెందర్, స్థానికుల కథనం ప్రకారం... చంద్రాయణగుట్ట హఫీజ్‌బాబానగర్‌కు చెందిన  సమీర్‌(19) ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో అక్కడే ఉండే సోహెల్‌(21), ఓ బాలుడు (17) సమీర్‌పై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో సమీర్‌పై సోహెల్‌ దాడి చేశాడు. దీంతో సమీర్‌ అతనిపై కక్ష పెంచుకున్నాడు. సమీర్‌ గురువారం అర్ధరాత్రి మహిళ వద్దకు వెళ్లి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా సోహెల్, బాలుడు వచ్చి మాట్లాడాలంటూ అతడ్ని బాలాపూర్‌లోని గుర్రం చెరువు వద్దకు తీసుకెళ్లారు. చర్చిస్తూనే ఇద్దరూ కలిసి సమీర్‌ను కత్తితో హత్య చేసి పరారయ్యారు. శుక్రవారం ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని