logo

హాజరుకు నకిలీ మకిలి

పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తూ.. వారి జీతాన్ని జేబులో వేసుకుంటోన్న కేటుగాళ్లకు జీహెచ్‌ఎంసీ అడ్డాగా మారింది.

Published : 15 Jun 2024 04:48 IST

అధికారులు, ఎస్‌ఎఫ్‌ఏల కుమ్మక్కు
ఫొటో గుర్తింపులోనూ లోపాలు
విధులకు రాని కార్మికుల పేరిట వేతనాలు
‘ఈనాడు’ నిఘాలో గుట్టురట్టు

బ్యాంకు ముందు డబ్బులు పంచుతున్న మహిళ

ఈనాడు, హైదరాబాద్, రాంనగర్, న్యూస్‌టుడే: పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తూ.. వారి జీతాన్ని జేబులో వేసుకుంటోన్న కేటుగాళ్లకు జీహెచ్‌ఎంసీ అడ్డాగా మారింది. సూపర్‌వైజర్లు, ఏఎంఓహెచ్‌(సహాయ వైద్యాధికారి)లు ప్రతి నెలా రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్ల గొడుతున్నారు. ఇటీవల కొత్తగా ఐటీ విభాగం బాధ్యతలు తీసుకున్న ఐఏఎస్‌ అధికారిణి దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఫలితం దక్కలేదు. వేలి ముద్రల హాజరు విధానాన్ని రద్దు చేసి, ముఖాన్ని స్కానింగ్‌ చేసే ఎఫ్‌ఆర్‌సీ యాప్‌ను తీసుకొస్తే.. అందులోని లోపాలను వసూల్‌ రాజాలు కనిపెట్టేశారు. విధుల్లో లేని కార్మికులను ఉన్నట్టుగా చూపించి వారందరి జీతాలను జేబులో వేసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీలో 18 వేల మంది కార్మికులుంటే..అందులో ప్రతిరోజూ సుమారుగా 16 వేల మంది విధుల్లో ఉంటారు..వీరిలో దాదాపు నకిలీ హాజరుతో 1000 మంది వేతనాలను సూపర్‌వైజర్లు నొక్కేస్తున్నారు. ఇది దాదాపుగా రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.

రూ.2లక్షలు డిమాండ్‌..: సికింద్రాబాద్‌ జోన్‌ ముషీరాబాద్‌ సర్కిల్‌లోని ఓ డివిజన్‌లో  సూపర్‌వైజర్‌ పరిధిలో 21 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. అందులోని ఐదుగురు కార్మికులు పని చేయకపోయినా హాజరు వేసి వేతనాలను తీసుకుంటున్నారు. వారికి రూ.2,500లు ఇస్తారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటే రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని వాపోతున్నారు.

‘నిఘా’ఇలా..: కొందరు బాధితులు ‘ఈనాడు’ను ఆశ్రయించి.. తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. మరుసటి రోజే సూపర్‌వైజరు నుంచి వాళ్లకు ఫోన్‌ వచ్చింది. జూన్‌ 3న ఉదయం 10గంటలకు బ్యాంకుకు వెళ్లి జీతం తీసుకోవాలని చెప్పాడు. బాధితులతో కలిసి ‘ఈనాడు’ బ్యాంకు వద్ద నిఘా ఉంచింది. కాసేపటికి సూపర్‌వైజరు వద్ద పనిచేసే మరో కార్మికురాలు కొన్ని బ్యాంకు పాసుపుస్తకాలను తీసుకొని వచ్చింది. అక్కడికి చేరుకున్న ఇద్దరు బాధితులను లోపలికి తీసుకెళ్లి జీతం డబ్బును డ్రా చేయించి, ఆ మొత్తాన్ని ఆమె తీసుకుంది. ఆ ఇద్దరు బాధితులకు రూ.2,500లు ఇచ్చి వెళ్లిపోయింది. అనంతరం.. ‘ఈనాడు’ బృందం జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను, ఐటీ విభాగాన్ని సంప్రదించింది. సూపర్‌వైజరు పరిధిలో పనిచేస్తోన్న కార్మికుల రోజువారీ హాజరును ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే.. వారికి రోజూ హాజరు పడుతోంది. కానీ.. కొన్ని నెలలుగా వారు విధులకు వెళ్లట్లేదని చేప్పే ఆధారాలను ఇస్తే ఆశ్చర్యపోయారు.

విధానంలో లోపాలు..

నకిలీ వేలి ముద్రలతో హాజరు వేస్తున్నారని.. ఎఫ్‌ఆర్‌సీ యాప్‌ను జీహెచ్‌ఎంసీ ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తెచ్చింది. దాంతో దాదాపు 1,500ల మంది నకిలీ కార్మికుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారం తిరిగే సరికి.. మళ్లీ కార్మికుల సంఖ్య పెరగడం మొదలైంది. యాప్‌లో ఉన్న లోపాలే అందుకు కారణమని తెలుస్తోంది. ఎస్‌ఎఫ్‌ఏలు స్కాన్‌ చేస్తోన్న కార్మికుల ముఖాలు సాఫ్ట్‌వేర్‌లో నిల్వ ఉండట్లేదు. ఎస్‌ఎఫ్‌ఏ చేస్తోన్న నకిలీ హాజరును గుర్తించే సదుపాయం ఏఎంఓహెచ్‌కే ఉంది. పై అధికారులు సిబ్బంది ఫొటోలను చూసేందుకు యాప్‌ అనుమతించట్లేదు. కార్మికుల ఫొటో లేదా వీడియోలను ఉపయోగించి సూపర్‌వైజర్లు, ఏఎంఓహెచ్‌లు నకిలీ హాజరుకు పాల్పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని