logo

దుర్భాషలాడాడని కుమారుడిని చంపేసిన తల్లి

తల్లి ప్రవర్తన సరిగా లేదని దుర్భాషలాడుతుండడంతో ఓ బాలుడిని తల్లే గొంతు నులిమి చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి చివరికి పోలీసులకు దొరికిపోయింది.

Updated : 16 Jun 2024 04:56 IST

అనిల్, స్వాతి

పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: తల్లి ప్రవర్తన సరిగా లేదని దుర్భాషలాడుతుండడంతో ఓ బాలుడిని తల్లే గొంతు నులిమి చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ కేసులో మహిళ, ఆమెకు సహకరించిన రెండో భర్తను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐలు ప్రవీణ్‌రెడ్డి, రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి బాహ్య వలయ సర్వీసు రహదారి పక్కన ఈనెల 11న ఉదయం బాలుడు చనిపోయి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు గుర్తుతెలియని బాలుడి మృతిగా కేసు నమోదు చేసి వివరాల కోసం సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు పెట్టారు. పాత రామచంద్రాపురానికి చెందిన బాలుడు విష్ణువర్ధన్‌గా కొంతమంది గుర్తుపట్టి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలుడి ఇంటికెళ్లి చూడగా తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వాకబు చేయగా తండ్రి కుమార్‌ ఏడాది క్రితం చనిపోయాడని, తల్లి స్వాతి వద్దే బాలుడు ఉంటున్నాడని స్థానికులు చెప్పారు.

కుమారుడు చనిపోయినా తల్లి ఇంటి వద్ద లేకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమెపై నిఘా ఉంచారు. 14వ తేదీ సాయంత్రం ఆమె ఇంటి వద్ద స్వాతిని పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈనెల 10న కుమారుడు విష్ణువర్ధన్‌ తనను దుర్భాషలాడటంతో మద్యం మత్తులో గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశానని చెప్పింది. తన కుమార్తె, రెండో భర్త అయిన ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన అనిల్‌ను కూడా విష్ణువర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నాడనే నమ్మించింది.  స్వగ్రామం కామారెడ్డి జిల్లా పుల్కంపేట గ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తే, అక్కడికి మృతదేహాన్ని తీసుకురావద్దని మీరున్న చోటే కార్యక్రమం పూర్తి చేసుకోవాలని బంధువులు చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియక రెండో భర్త అనిల్‌తో ద్విచక్ర వాహనంపైకి ఎక్కించుకొని ముత్తంగి బాహ్యవలయ సర్వీస్‌ రహదారి పక్కన పడేశామని విచారణలో వారు తెలిపారు. దీంతో స్వాతి, అనిల్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌ తరలించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని